మరో భూమి లేదు కాబట్టి..

ఫ్యాషన్‌, పర్యావరణాన్ని ప్రేమించే పదహారణాల తెలుగమ్మాయి ప్రజ్ఞా అయ్యగారి అంతర్జాతీయ వేదికపై.. మాతృదేశాన్ని గర్వపడేలా చేసింది.

Updated : 16 Jul 2023 03:16 IST

ఫ్యాషన్‌, పర్యావరణాన్ని ప్రేమించే పదహారణాల తెలుగమ్మాయి ప్రజ్ఞా అయ్యగారి అంతర్జాతీయ వేదికపై.. మాతృదేశాన్ని గర్వపడేలా చేసింది. పోలండ్‌ వేదికగా 67 దేశాల అందగత్తెలతో పోటీపడి ‘సూపర్‌ నేషనల్‌-2023’ పోటీల్లో.. ‘మిస్‌ సూపర్‌ నేషనల్‌ ఆసియా’ కిరీటాన్ని దక్కించుకొంది..

పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌. ఐఎన్‌ఐఎఫ్‌డీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పూర్తిచేసింది. కుటుంబమంతా ఇంజినీర్లు, డాక్టర్లు, కార్పొరేట్‌ ఉద్యోగులే. ఆ వాతావరణం తనకు సరిపోదనిపించింది ప్రజ్ఞకు. టీవీలో ప్రకటనలు చూసినప్పుడు అలా రంగుల దుస్తుల్లో మెరవాలనుకునేది. తనకు చదరంగం, పెయింటింగ్‌, నాట్యం అన్నా ఇష్టం. వాటిలో బహుమతులూ గెల్చుకుంది. అది ఆమెకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఆసక్తిని కలిగించింది. ఇంట్లో వాళ్లను బతిమాలి, ఒప్పించి మరీ ఈ కోర్సులో చేరింది. పర్యావరణ హితమైన, అందరికీ అందుబాటులో ఉండే వస్త్రశ్రేణిని ఆవిష్కరించాలన్నది ఆమె కల. 2017లో మానుషి చిల్లర్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అందుకున్నప్పుడు తన మనసు మోడలింగ్‌ వైపు మళ్లింది. ఈసారి ఇంట్లో ఒప్పించడానికి మరింత కష్టపడ్డానంటుంది ప్రజ్ఞ. తన ఆసక్తి, పట్టుదలను చూసి వాళ్లూ కాదనలేకపోయారు. ‘కల కన్నావంటే దాన్ని నువ్వు సాధించడం ఖాయం’ అనే గట్టిగా చెప్పే ఈ ముద్దుగుమ్మ ప్రకృతి ప్రేమికురాలు. శాస్త్రీయ నృత్య కళాకారిణి. ‘సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతున్న వ్యర్థాల గురించే నా దిగులంతా. వారాంతంలో వలంటీర్ల బృందంతో కలిసి వాటిని తొలగిస్తుంటా.  మనం వాడిపారేసిన దుస్తులు, ప్లాస్టిక్‌ వస్తువులన్నీ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. మనకి మరో భూమి లేదుగా! వ్యర్థాలను తగ్గించి పునర్వినియోగంపై అవగాహన కలిగించడానికి ‘ప్లానెట్‌-ఏ’ ప్రాజెక్టు ప్రారంభించా. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్‌ స్కూల్స్‌, ఆన్‌లైన్‌ డెనిమ్‌ డ్రైవ్‌ ద్వారా సేకరించిన వృథా వస్త్రాలను రీసైక్లింగ్‌ చేయిస్తున్నా. మహిళా సాధికారత కోసం ‘షి శక్తి’ ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్నా. మహిళలు తయారుచేస్తున్న అలంకరణ వస్తువులని ప్రదర్శిస్తున్నా’ అంటోంది ప్రజ్ఞా అయ్యగారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్