12 గంటలు నిలుచునే పని చేసేదాన్ని...

క్యాన్సర్‌ గురించి ఎప్పుడు విన్నా... ‘దానిని తగ్గించే ఔషధం కనిపెట్టలేనా?’ అన్న చిన్ననాటి కలే ఆమెని ముందుకు నడిపించింది. క్యాన్సర్‌ కణుతుల పరిమాణం తగ్గించే ఆమె పరిశోధనలకుగాను ‘ది ఉమెన్‌ సైంటిస్ట్‌’ అవార్డుని అందుకున్నారు డాక్టర్‌ కల్యాణి పైడికొండల.

Published : 05 Aug 2023 00:15 IST

క్యాన్సర్‌ గురించి ఎప్పుడు విన్నా... ‘దానిని తగ్గించే ఔషధం కనిపెట్టలేనా?’ అన్న చిన్ననాటి కలే ఆమెని ముందుకు నడిపించింది. క్యాన్సర్‌ కణుతుల పరిమాణం తగ్గించే ఆమె పరిశోధనలకుగాను ‘ది ఉమెన్‌ సైంటిస్ట్‌’ అవార్డుని అందుకున్నారు డాక్టర్‌ కల్యాణి పైడికొండల. ఈ సందర్భంగా వసుంధరతో ముచ్చటించారామె...

మాది తిరుపతి. అమ్మ వీరభద్రమ్మ గృహిణి. నాన్న కృష్ణమరాజు చిరువ్యాపారి. అక్క, ముగ్గురు అన్నయ్యల తర్వాత నేను పుట్టాను. నాన్న సంపాదనే ఇంటికి ఆధారం. తను కష్టపడైనా మమ్మల్ని పెద్ద చదువులు చదివించాలని నాన్న కోరుకొనేవారు. తాతయ్య క్యాన్సర్‌తో చనిపోయారు. మా బంధువులు, తెలిసిన వాళ్లలో మరికొందరు కూడా క్యాన్సర్‌బారిన పడ్డారు. ఆ మరణాల గురించి విన్నప్పుడు ఈ వ్యాధిని అదుపుచేయలేమా అనిపించేది.  నాన్నకు కొద్దిగా ఆయుర్వేదం తెలుసు. పేదవాళ్లకు చిన్నచిన్న అనారోగ్యాలుంటే మందులిచ్చేవారు. కనీసం నేనైనా బాగా చదువుకుని క్యాన్సర్‌కి మందు కనిపెట్టాలన్నది నాన్న కల. అలా నాకూ ఔషధాలంటే ఆసక్తి పెరిగింది. అదికాస్తా క్యాన్సర్‌కు సంబంధించి రిసెర్చ్‌ చేయాలనే దిశగా నడిపించాయి. తిరుపతిలో బీయెస్సీ చేశాక ఔషధాలపై ఆసక్తితో హైదరాబాద్‌లో మెడిసినల్‌ కెమిస్ట్రీలో స్పెషలైజేషన్‌ చేశా. జేఎన్‌టీయూలో యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్స్‌పై 2019లో పీహెచ్‌డీ పూర్తి చేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గీతం విశ్వవిద్యాలయంలో.. క్యాన్సర్‌ కణాల ఉత్పత్తిని అదుపు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నా.

అదే నా లక్ష్యం..

మన శరీరంలో కణాల ఉత్పత్తి కొన్నిసార్లు ఎక్కువగా జరుగుతుంటుంది. ఉదాహరణకు మనకు 100 కణాల ఉత్పత్తి సరిపోతుందనే చోట వెయ్యికిపైగా ఉత్పత్తి అవుతుంటాయి. అదనంగా పెరిగే ఈ కణాలన్నీ ఒకచోట చేరడంతో క్యాన్సర్‌ కణితి ఏర్పడుతుంది. అదే అధిక కణాల ఉత్పత్తిని నియంత్రిస్తే కణితి పరిమాణాన్ని కూడా తగ్గించొచ్చు. అందుకు అవసరం అయిన ఔషధాలపైనే నా పరిశోధన కొనసాగుతోంది. రెండేళ్ల నుంచీ దశలవారీగా సాగుతున్న ఈ పరిశోధనల్లో.. ప్రస్తుతం జంతువులపై అధ్యయనం జరుగుతోంది. ఇంతవరకూ జరిగిన పరిశోధనల ఫలితంగా 5- 10 మిల్లీ మీటర్ల వరకూ కణితి పరిమాణాన్ని తగ్గించగలిగాం. ఇదొక విజయం. ఇంకా తగ్గించాలన్నదే నా లక్ష్యం. అలాగే ఔషధం నాణ్యత పెంచడం, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూడ్డానికీ ప్రాముఖ్యతనిస్తున్నా.

విఫలమయినా..

పరిశోధనలో భాగంగా కొన్నిసార్లు గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది. రిసెర్చ్‌లో రాత్రీ, పగలూ అని తేడాలేకుండా కష్టపడాలి. కొన్నిసార్లు 12 గంటలపాటు కనీసం కూర్చునే వెసులుబాటు కూడా ఉండదు. నిలబడే పనిచేయాల్సి ఉంటుంది. రియాక్షన్‌ను గుర్తిస్తూ.. దానికి చేర్చాల్సిన మందులను అందిస్తూ ఉండాలి. ఇంతా చేశాక ఒక్కోసారి చేసిన ప్రయోగమంతా విఫలం అవుతుంది. తిరిగి మొదటి నుంచీ చేయాలి. అయితే ఈ వైఫల్యాలు నా లక్ష్యాన్ని నీరుకార్చలేదు. నా కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్టీ).. ‘ది ఉమెన్‌ సైంటిస్ట్‌’ అవార్డునివ్వడం సంతోషంగా ఉంది. రిసెర్చ్‌ కోసం రూ.34.5 లక్షలు నిధులు అందించింది. అలాగే కర్ణాటక, బెల్గాంలో జరిగిన జాతీయ సదస్సులో నా పరిశోధనా పత్రానికి ‘ది బెస్ట్‌ రిసెర్చ్‌ పేపర్‌’గా ప్రశంసలు అందాయి. దేశవ్యాప్తంగా పలు సదస్సుల్లో పాల్గొన్నా. యాంటీ క్యాన్సర్‌ డ్రగ్స్‌కు సంబంధించి ఇంతవరకూ ఐదు పుస్తకాలు రాశా. అంతర్జాతీయ జర్నల్స్‌లో 15వరకు పరిశోధనా పత్రాలు ప్రచురితం అయ్యాయి. నా మెంటార్‌ ప్రొఫెసర్‌ గుండ్ల రాంబాబు, మా పరిశోధనా బృందం, మావారు సుబ్రమణ్య వరప్రసాద్‌ ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపిస్తోంది. నా పరిశోధనతో క్యాన్సర్‌ కణితిని తగ్గించగలిగే ఔషధం మార్కెట్‌లోకి వస్తే మా నాన్న కల నెరవేరినట్లే. అదే నా ఆశయం కూడా.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు...

ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్