చేయి విరిగినా... హాకీని వదల్లేదు!

టీమ్‌లో పదిమంది ఉంటే అందరూ ఒకేలా ఉండాలని లేదు.  భిన్న సంప్రదాయాలు... విభిన్న సంస్కృతులు... బలాలు... బలహీనతలు... ఇన్ని వైవిధ్యాలని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి దేశానికి విజయాన్ని అందించాల్సిన బాధ్యత మాత్రం కోచ్‌దే.

Updated : 01 Feb 2024 07:08 IST

టీమ్‌లో పదిమంది ఉంటే అందరూ ఒకేలా ఉండాలని లేదు.  భిన్న సంప్రదాయాలు... విభిన్న సంస్కృతులు... బలాలు... బలహీనతలు... ఇన్ని వైవిధ్యాలని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి దేశానికి విజయాన్ని అందించాల్సిన బాధ్యత మాత్రం కోచ్‌దే. తెలుగమ్మాయి యెండల సౌందర్య జాతీయ హాకీ జట్టుకు కోచ్‌గా ఎదిగి ఆ బృహత్తర బాధ్యతలు తీసుకుంది. ఈ సందర్భంగా వసుంధరతో మాట్లాడుతూ తను అనుభవాలను పంచుకుంది...

ప్పుడంటే హాకీకి గుర్తింపు వస్తోంది కానీ, నేనీ ఆటలో అడుగుపెట్టే సమయానికి ఆడపిల్లలకు అసలు ప్రోత్సాహమే ఉండేది కాదు. ఎక్కడో కాదు, మా ఇంట్లోనే లేదు. నాన్న మేస్త్రీ పని చేసేవారు. అమ్మ బీడీలు చుట్టేది. ఆ పనులు చేస్తేనే కానీ పూటగడవని పరిస్థితి. ముగ్గురు పిల్లల్లో నేనే పెద్దదాన్ని. మా స్వస్థలం నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట. స్కూల్లో నేను హాకీని ఇష్టంగా ఆడటం గమనించిన కోచ్‌లు నాలోని క్రీడాకారిణిని గుర్తించి, మెలకువలు నేర్పారు. కానీ టోర్నమెంట్లకు వెళ్లాలన్నా, మంచి పోషకాహారం తినాలన్నా, షూస్‌ వంటి క్రీడా సామగ్రి కొనాలన్నా చాలా ఖర్చవుతుంది. దాంతో అమ్మానాన్నలు ఈ ఆటలవీ వద్దన్నారు. కానీ నా ఉత్సాహం చూసిన మా తాతయ్య మాత్రం కాదనలేక... అడపాదడపా డబ్బులిచ్చి సాయం చేసేవారు. అవి ఎటూ సరిపోయేవి కాదు. ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాయ్‌)’లో సీటొచ్చాక నా కష్టాలు కాస్త గట్టెక్కాయి. అక్కడి కోచ్‌ల ప్రోత్సాహంతో ఆటపై దృష్టిపెట్టా. 2006లో రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. అక్కడ పట్టుదలగా ఆడి జాతీయ జట్టుకు ఎంపికయ్యా. అంతవరకూ మన తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ జట్టుకు ఎవరూ ఎంపిక కాలేదు. అది నా తొలి విజయం. నన్ను చూసి మా తమ్ముడు సాగర్‌ కూడా హాకీలో జాతీయ స్థాయిలో రాణించాడు. ప్రస్తుతం జిల్లా క్రీడల ప్రాధికార సంస్థ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

వంద మ్యాచులు ఆడి..

జాతీయజట్టులో రాణించడం అంత తేలిక్కాదు. అక్కడా ఎన్నో సవాళ్లు. ఉత్తరాది అమ్మాయిల డామినేషన్‌ ఉండేది. మొదట్లో హిందీరాక చాలా ఇబ్బందులు పడ్డా. టీమ్‌లో ఉన్నానన్న పేరే కానీ మైదానంలోకి దిగే అవకాశం వచ్చేది కాదు. ప్రధాన క్రీడాకారిణులకు గాయాలైతే తప్ప నాకు ఛాన్స్‌ రాదు. అలాంటి ఒక్క ఛాన్స్‌ వచ్చినా వదిలేదాన్ని కాదు. అలా నా ప్రతిభతో జట్టులో కీలకంగా మారా. మధ్యలో చేతి ఎముక విరిగి గాయం కావడంతో రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యా. ఆ సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, తిరిగొచ్చి నన్ను నేను నిరూపించుకొని వైస్‌కెప్టెన్‌గా, కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నా. ఒలింపిక్స్‌ సహా వందకుపైగా అంతర్జాతీయ మ్యాచులకు ప్రాతినిధ్యం వహించా.

అప్పుడూ, ఇప్పుడూ... 

2006 నుంచి 2016 వరకు పదేళ్ల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించా. ఆ తర్వాత కోచ్‌గా స్థిరపడాలనే కోరికతో 2022లో దరఖాస్తు చేసుకున్నా. క్రీడాకారిణిగా పదేళ్ల అనుభవాన్ని చూసి జాతీయ జట్టుకి సహాయ కోచ్‌గా అవకాశం ఇచ్చారు. ఇంతవరకూ మనకు విదేశీ కోచ్‌ ఉండేవారు. నేను సహాయ కోచ్‌గా పనిచేశా.ఇటీవల ఒమన్‌లో జరిగిన ప్రపంచ కప్‌ హాకీ టోర్నిలో మన దేశ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నా. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ హోదా, అవకాశం తొలిసారిగా దక్కడం సంతోషంగా ఉంది. 2009లో రైల్వే టీసీగా ఉద్యోగం వచ్చింది. మొదట ముంబైలో పనిచేసేదాన్ని. పెళ్లయ్యాక సికింద్రాబాద్‌ వచ్చేశా. మావారు రమేష్‌ ఐటీ ఉద్యోగి. మాకో పాప. గతంలో మాదిరిగా కాదు... తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నారు. మట్టిలో మాణిక్యాలని వెలికితీయాలన్నదే నా కల. 

 రేవళ్ల వెంకటేశ్వర్లు, నిజామాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్