నా దుస్తులు... నా ఇష్టం!

టీనేజీ అమ్మాయి... ప్రవేశపరీక్ష కోసం హాలుకి వెళ్లింది. కానీ ఇన్విజిలేటర్‌ లోనికి రావొద్దంటూ ఆపేశారు. హాల్‌టికెట్‌ ఉంది. ఆలస్యంగానూ రాలేదు. అయినా ఎందుకు ఆపారో అర్థం కాలేదామెకు. అదే అడిగితే దుస్తులను కారణంగా చూపాడాయన.

Updated : 16 Mar 2024 15:14 IST

టీనేజీ అమ్మాయి... ప్రవేశపరీక్ష కోసం హాలుకి వెళ్లింది. కానీ ఇన్విజిలేటర్‌ లోనికి రావొద్దంటూ ఆపేశారు. హాల్‌టికెట్‌ ఉంది. ఆలస్యంగానూ రాలేదు. అయినా ఎందుకు ఆపారో అర్థం కాలేదామెకు. అదే అడిగితే దుస్తులను కారణంగా చూపాడాయన. ఆ అమ్మాయి మోకాళ్ల వరకూ మాత్రమే కప్పుతోన్న నిక్కరు వేసుకుంది. మార్చుకోవడానికి ఇంటికెళ్లలేదు... పరీక్ష సమయం దగ్గరపడుతోంది. ఇంతలో దగ్గర్లో ఒక కర్టెన్‌ కనిపించింది. అది కాళ్లకు చుట్టుకున్నాక కానీ లోనికి అనుమతించలేదు.

ఆమె అనాథ పిల్లలను చేరదీసే ఓ ఎన్‌జీఓ నిర్వాహకురాలు. నిధులిమ్మంటూ పేరున్న ఓ వ్యక్తిని కలిసింది. ఆమెను తేరిపారా చూసిన ఆయన... ‘ఈ దుస్తులేసుకొని ఆ పిల్లలకు ఏం సంస్కారం నేర్పిస్తా’వంటూ అందరి ముందూ అవమానించాడు. ఇంతకీ ఆమె వేసుకున్నది మోకాళ్ల దగ్గర చిరుగులు ఉన్న రిప్ప్‌డ్‌ జీన్స్‌.

‘నేను రేపట్నుంచి ఆ కాలేజీకి వెళ్లను’ ఇంటికొచ్చాక ఈ మాట చెప్పి ఏడుస్తూ కూర్చుందా అమ్మాయి. అసలు జరిగిందేమిటంటే... కాలేజీకి యూనిఫాం ఉంది. అందరి శరీరాలూ ఒకలా ఉండవుగా! వయసు చిన్నదే అయినా ఆమె శరీరం కాస్త నిండుగా కనిపిస్తోంది. ‘క్లీవేజ్‌ చూపిస్తున్నావ్‌. గుండీ పెట్టుకోవాలని తెలియదా’ అంటూ అందరి ముందూ కోప్పడింది లెక్చరర్‌.

ఒకటా రెండా... దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలెన్నో. స్కూలు పిల్లల నుంచి ఉద్యోగినుల వరకు అందరూ ఎదుర్కొనేదే ఇది. ఈ ప్రవర్తనకు అవతలివాళ్లు చెప్పే కారణం మాత్రం ఒక్కటే! ‘మీ దుస్తులు అబ్బాయిల దృష్టిమరల్చేలా ఉన్నా’యనే! అందుకే ఇలా ఉండాలి, ఇవే వేసుకోవాలి అన్న నిబంధనలు. భుజాలు కనిపించినా, మోకాళ్లు దాటకుండా దుస్తులేసినా, ఆకృతి కనిపించేలా లెగ్గింగ్‌లు ధరించినా ‘సరైన వస్త్రధారణ కాద’ంటూ విమర్శలు వచ్చేస్తాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ‘ఇనఫ్‌’, ‘మై డ్రెస్‌ మై రూల్స్‌’, ‘డునాట్‌ టచ్‌ మై క్లాత్స్‌’, ‘నోమోర్‌ డ్రెస్‌ కోడ్స్‌’... అంటూ ఎన్నో క్యాంపెయిన్‌లు నడిచినా, నడుస్తున్నా ఇప్పటికీ ‘మహిళల వస్త్రధారణ’పై ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నారు.

మార్చుకోండి...

‘సరిగా దుస్తులు వేసుకోమన్నాం... తప్పేంటి?’ వ్యతిరేకించిన ప్రతిసారీ ఎదురయ్యే ప్రశ్నే ఇది. చిన్నపిల్లలనే తీసుకుందాం. వాళ్లకి సరిగా ‘జెండర్‌’ అన్నదానికి తేడాకూడా తెలియని వయసులో నిండుగా దుస్తులు వేసుకోవాలంటూ చెబుతాం. వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నట్టేగా. పైగా తెలిసో తెలియకో ‘ఆకర్షిస్తున్నా’రంటూ మాట జారతారు. అంటే అమ్మాయిలను శృంగార కోణంలో చూబెడుతున్నట్టే! పాశ్చాత్య వస్త్రాలు వేసుకుంటే సంప్రదాయాలను మంట గలిపేస్తున్నారన్న మాట వినిపిస్తుంది. సమాజ నిర్మాణంలో స్త్రీ, పురుషులిద్దరి పాత్రా ఉన్నప్పుడు సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రం ఆడవారి మీదే ఎలా ఉంటుంది? పైగా శరీర కొలతలు, రంగు లాంటి బాడీషేమింగ్‌కి ఆస్కారం మొదలయ్యేది ఇక్కడే. అంతేకాదు ఈ నిబంధనలు వారిలో ఒత్తిడి, ఆందోళన, తీవ్ర కోపం వంటివాటికీ దారితీస్తున్నాయని ఎన్నో అధ్యయనాలూ చెబుతున్నాయి. ఇంకా ఈవ్‌టీజింగ్‌, కామెంట్లు ఎదురైనా, అఘాయిత్యాలకు గురైనా ‘ఏ దుస్తులు వేసుకున్నావ్‌’ అన్నమాట వచ్చేస్తుంది. అయిదేళ్ల పాపపైనా దురాగతాలు జరుగుతున్నాయి. ఆమెలో శృంగార కోణం ఏం కనిపించింది? దుస్తులు ఆమె స్టైల్‌, ఆత్మవిశ్వాసం, సౌకర్యాన్ని ప్రదర్శించే మార్గం. వాటిపై ‘ఆకర్షణ, రెచ్చగొట్టడం’ ముద్రలేసి నిబంధనలు సృష్టించొద్దంటోంది నేటి తరం. ‘డ్రెస్‌ కోడ్‌’ పేరుతో అమ్మాయిని ఇలా ఉండమని చెప్పడం కాక... అబ్బాయిలు చూసే దృష్టికోణాన్ని మార్చుకోమంటోంది.


జీరో ఎఫ్‌ఐఆర్‌ హక్కు

మహిళల పట్ల నేరం ఎక్కడ జరిగినా, ఆమె తన ఫిర్యాదును అందుబాటులో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఇవ్వొచ్చు. దీన్నే జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటారు. నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోకుండా ఉండటానికి, న్యాయం ఆలస్యం కాకుండా ఉండటానికి ఈ ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఇలా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కి... సీరియల్‌ నంబర్‌ ఇవ్వకపోవడమో లేదంటే ‘0’తో సూచించడమో చేస్తారు. తరవాత దాన్ని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు సమర్పిస్తారు.


ఆత్మవిశ్వాసమే మనకు నిజమైన ఆభరణం... అదే మన ఆయుధం


ఫలానాది జరగాలి అని నిర్ణయం తీసుకోండి. అంతేగానీ ఏదో జరుగుతుందనే భయంతో నిర్ణయాలు తీసుకోకండి.

మిషెల్‌ ఒబామా, అమెరికా మాజీ ప్రథమ మహిళ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్