క్రీడా రంగంలో మహిళా మణులు!

అది 1970... అమ్మాయిలు పరిగెత్తడమంటేనే నామోషీగా భావించే రోజులవి. అలాంటి సమయంలోనే మెరుపువేగంతో దూసుకొచ్చింది కేరళకు చెందిన పరుగుల రాణి పీటీ ఉష. ‘క్వీన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌’ గా అందరి గుండెల్లో నిలిచిపోయింది.

Updated : 06 Mar 2024 12:57 IST

అది 1970... అమ్మాయిలు పరిగెత్తడమంటేనే నామోషీగా భావించే రోజులవి. అలాంటి సమయంలోనే మెరుపువేగంతో దూసుకొచ్చింది కేరళకు చెందిన పరుగుల రాణి పీటీ ఉష. ‘క్వీన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌’ గా అందరి గుండెల్లో నిలిచిపోయింది. అమ్మాయిలంటేనే సుకుమారం, బరువులు ఎత్తలేరు అనుకుంటారెందరో. కానీ తెలుగు ఆడపడుచు కరణం మల్లీశ్వరి... సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. మూస పద్ధతులకు స్వస్తి పలికి, తర్వాతి తరాల్లో స్ఫూర్తి నింపారు వీళ్లు. నిజానికి 1952లోనే నీలిమా గూస్‌ ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టింది. మరి ఆనాటి నుంచి ఈనాటికి క్రీడారంగంలో వచ్చిన మార్పులేంటో చూద్దామా!

పీవీ సింధు... బ్యాడ్మింటన్‌లో రెండు ఒలింపిక్‌ పతకాలను సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. ఒక్కసారిగా దేశం మొత్తం ఆమె పేరు మార్మోగింది. క్రికెట్‌ అంటే అప్పటివరకూ అబ్బాయిల ఆటే. కానీ మిథాలీ రాజ్‌, ఇండియన్‌ విమెన్స్‌ క్రికెట్‌లో చెరగని ముద్ర వేసింది. ఇక ఆసియన్‌ పారా గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన 16ఏళ్ల శీతల్‌ దేవిని చూసి దేశమంతా ఉప్పొంగిపోయింది. రెజ్లింగ్‌లో గీతా ఫొగాట్‌, జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్‌ సాధించిన విజయాలూ తక్కువేమీ కాదు. ఇక బాక్సింగ్‌ క్వీన్‌ మేరీ కోమ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానూ, హర్డ్‌లర్‌ జ్యోతి యర్రాజీ సృష్టించిన రికార్డులు ఎందరికో ఆదర్శం.

సవాళ్లూ ఉన్నాయ్‌...

క్రీడల్లో అమ్మాయిలు దూసుకుపోతున్నారు కదా! అయితే లోటేముంది ఇక.. అనుకుంటే పొరపాటే. విజయాలు ఎన్నున్నాయో, వెనక్కిలాగే సవాళ్లూ అంతకుమించే ఉన్నాయి. సౌకర్యాల లేమి, నాణ్యమైన స్పోర్ట్స్‌ ఎక్విప్‌మెంట్‌ లేకపోవడం వంటివి మహిళా అథ్లెట్లను పీడిస్తోన్న సమస్యలు. అంతెందుకు, స్పోర్టింగ్‌ పవర్‌హౌస్‌గా చెప్పుకొనే మణిపుర్‌లో 48శాతం మహిళా అథ్లెట్లు, సాధన చేయడానికి రోజూ 10కిమీపైగా ప్రయాణించాలంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లింగ వివక్ష, ఫండింగ్‌, మత విశ్వాసాలు, మీడియా కవరేజ్‌ తక్కువగా ఉండడం... వంటివీ మహిళా క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలే. ఒకవేళ ప్రతికూలతలన్నింటినీ దాటుకుని వచ్చినా, ‘మగరాయుడిలా ఆ ఆటలేంటి?’ అంటారనే మరో భయమూ అమ్మాయిలను ముందడుగు వేయనీయడం లేదట. ఇక మహిళా అథ్లెట్ల రక్షణ..అమ్మాయిలు ఈ రంగంలోకి రావడానికి మరో ప్రతిబంధకం. యూఎన్‌ విమెన్‌ లెక్కల ప్రకారం, క్రీడాకారుల్లో 21శాతం అమ్మాయిలు ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నారట. బీబీసీ ప్రకారం మన దేశంలో క్రీడల్లో పాల్గొనే అమ్మాయిల శాతం 29 మాత్రమేనట. ఇక ప్రసవం తర్వాత తిరిగి వచ్చినా మునుపటిలా అవకాశాలు అందకపోవడం వంటివన్నీ క్రీడాకారిణులు ఎదుర్కొంటున్న సవాళ్లే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్