ఆ పేరుతోనే పుస్తకం రాస్తా..

నా సావు నేను చస్తా, నీకెందుకు..? ‘పెళ్ళిచూపులు’లోని ఈ మాటను అంత తొందరగా మరిచిపోలేం. ఆ సంభాషణని ప్రియదర్శి పలికిన విధానం, కౌశిక్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయిన వైనం ప్రేక్షకులకు అంతగా నచ్చింది. ఆ చిత్రంతోనే ఆయన జీవితం మలుపు తిరిగింది. భిన్నమైన పాత్రలతో దూసుకెళుతున్న ప్రియదర్శి అంతరంగం..

Updated : 09 Dec 2022 15:28 IST

నా సావు నేను చస్తా, నీకెందుకు..? ‘పెళ్ళిచూపులు’లోని  ఈ మాటను అంత తొందరగా మరిచిపోలేం. ఆ సంభాషణని ప్రియదర్శి పలికిన విధానం, కౌశిక్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయిన వైనం ప్రేక్షకులకు అంతగా నచ్చింది.  ఆ చిత్రంతోనే ఆయన జీవితం మలుపు తిరిగింది. భిన్నమైన పాత్రలతో దూసుకెళుతున్న ప్రియదర్శి అంతరంగం..
* పుస్తకం రాయడం పూర్తయిందా?
ప్రస్తుతానికి ఆలోచనలతో నింపుతున్నానండీ. చిత్రసీమలో ఒక్కో అనుభవం ఒక్కో పేజీకి సరిపోయేలా ఉంది. ఇక వాటికి అక్షరరూపం ఇవ్వాలి. ఎప్పుడు పూర్తయ్యేది ఇప్పుడే చెప్పలేను.
* పుస్తకం పేరు అదేనా..?
‘నా సావు నేను చస్తా.. నీకెందుకు?’ ఆ డైలాగే కదా నాకు పేరు, గుర్తింపు తెచ్చింది. అందుకే ఆ పేరుతోనే పుస్తకం రాస్తాను. నిజానికి ఎమ్‌.ఎ చదివే రోజుల్లోనే నేను కూడా ఏదైనా పుస్తకం రాయాలనుకునేవాణ్ని. కానీ ఇప్పుడేం చేశామని పుస్తకం రాయడం అని ఆగిపోయా. భవిష్యత్తులో ఏదైనా సాధించాక మాత్రం తప్పకుండా పుస్తకం రాస్తాను.
* హాస్య ప్రధానమైన పాత్రలే కాకుండా... సీరియస్‌గా సాగే పాత్రలపై కూడా దృష్టిపెడుతున్నట్టున్నారు?
‘పెళ్ళిచూపులు’ కంటే ముందు చేసిన అన్ని సినిమాల్లోనూ నేను ప్రతినాయకుడి పాత్రలే వేశాను. వాటిలో కొన్ని విడుదల కాలేదు. కామెడీ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. ఎలాగూ కథానాయకుడిని కాలేను. నటుడంటూ అయితే అది విలనే అవుతాననుకున్నా. అయితే దర్శన్‌ అని నాకొక తమిళ స్నేహితుడు ఉన్నాడు. వాడు తీసే షార్ట్‌ఫిల్మ్‌లో నాకో పాత్ర ఇచ్చాడు. అది చేశాక నేను కామెడి చేయగలనని ఓ నమ్మకం ఏర్పడింది. నా స్నేహితుడు తరుణ్‌భాస్కర్‌ ‘పెళ్ళిచూపులు’లో కౌశిక్‌ పాత్ర ఇచ్చాడు. ప్రస్తుతం హాస్య ప్రధానమైన పాత్రలతో పాటు, అప్పుడప్పుడు సీరియస్‌గా సాగే పాత్రల్లోనూ కనిపిస్తున్నా. ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’లో పోలీసు అధికారిగా కనిపిస్తా. నవ్వించను కానీ... ఆ పాత్ర బాగుంటుంది.
* నటుడవ్వాలనే కోరిక చిన్నప్పట్నుంచీ ఉందా?
చిన్నప్పట్నుంచి ఉన్న కోరికే అది. ఒక రకంగా నన్ను పెంచింది సినిమాలే. గొప్ప గొప్ప దర్శకులు, నటుల సినిమాల్ని చూసి ప్రభావితమయ్యా. దానికి తగ్గట్టే నా విద్య సాగింది. మాస్‌ కమ్యూనికేషన్‌లో పీజీ చేశా. నేను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నేర్చుకోవడానికి ఎంతో మేలు చేసింది. నా గురువు భిక్షుగారు నన్ను నేను తెలుసుకోవడానికి సహాయం చేశారు.
* ఇండస్ట్రీలోకి రావడానికి సినిమా కష్టాలు ఏమైనా ఎదుర్కొన్నారా?
పస్తులొక్కటే ఉండలేదు. మా నాన్న ప్రొఫెసర్‌ కాబట్టి తిండికి ఇబ్బందేమీ లేదు. బండి కొనిచ్చి, పెట్రోల్‌కి సరిపడా డబ్బులు ఇచ్చేవాళ్లు. పీజీ అయ్యాక కొన్నాళ్లు ఒక గ్రాఫిక్స్‌ కంపెనీలో ఉద్యోగం చేశా. ఆ తర్వాత సినిమాల్లో ఆసక్తి ఉండటంతో స్నేహితులతో కలిసి లఘు చిత్రాల్లో నటించడం, తీయడమే నా పని. ఆ ప్రక్రియలోనే తరుణ్‌ భాస్కర్‌, దర్శన్‌, ప్రణీత్‌, కిషోర్‌, అరుణ్‌ వీళ్లంతా కలిశారు. వాళ్లు నన్ను కొన్నిసార్లు నటన కోసం, మరికొన్నిసార్లు సాంకేతిక సహాయం కోసం పిలిచేవాళ్లు. నేను తీసే లఘు చిత్రాల కోసం వాళ్లూ వచ్చేవాళ్లు. మేం తీసిన లఘు చిత్రాలతో అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ని. ఇంట్లో కొడుకు సినిమాలంటూ ఇలా తిరిగితే తల్లిదండ్రులు ఎవరైనా భయపడతారు కదా. మా ఇంట్లోనూ అంతే. ఏదైనా ఉద్యోగం చూసుకో అనేవారు. ‘టెర్రర్‌’ సినిమా కోసం దర్శకుడు సతీష్‌ కాశెట్టి ఆడిషన్స్‌ నిర్వహిస్తే, అందులో నేను ఎంపికయ్యా. ఆ సినిమా తర్వాత ఇంట్లో వాళ్లకి ఓ నమ్మకం ఏర్పడింది.
*నటుడిగా స్థిరపడినట్టే అని మీకెప్పుడు నమ్మకం ఏర్పడింది?
‘బొమ్మలరామారం’, ‘టెర్రర్‌’ తర్వాత ఇక ఇక్కడే నేను, నా జీవితం అంతా ఇలాగే ఉంటుందనిపించింది. ఎన్ని కష్టాలొచ్చినా సినిమాల్లోనే ఉండాలని భావించా. ‘పెళ్ళిచూపులు’ తర్వాత చేతినిండా పని దొరికింది. వీడు నటుడు అని గుర్తించారంతా. అవకాశాల కోసం నేను ఏ ఆఫీసుల చుట్టూ తిరిగానో, వాళ్లే పిలిచి అవకాశం ఇచ్చారు.
* సినిమాల కోసం కథలేమైనా రాసుకొన్నారా?
రాసుకొన్నారా అంటారేంటి? స్క్రిప్టులు పట్టుకొని నిర్మాతల కోసం తెగ తిరిగామండీ. సినిమా కష్టాలంటే తెలిసింది అప్పుడే. కానీ కచ్చితంగా దర్శకత్వం చేస్తాను. ఆ విభాగం నుంచి వచ్చినవాణ్నే కదా.
* నా గొడవ ప్రయాణాలంటే ఇష్టం.
స్నేహితులతో కలిసి గడపడాన్ని,
సినిమాలు చూడటాన్ని ఆస్వాదిస్తుంటా.
పుస్తకాలు బాగా చదువుతుంటా.
ప్రస్తుతం కాళోజీ ‘నా గొడవ’ చదువుతున్నా.

- నర్సిమ్‌ ఎర్రకోట

* ఐదేళ్ల ప్రేమ... ఆ తర్వాత పెళ్ళి

ఈ మధ్యే పెళ్లి చేసుకొన్నా. నా భార్య పేరు రిచా. మాది ప్రేమ వివాహం. ఐదేళ్లు ప్రేమించుకున్నాం. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో చదువుకునేటప్పుడు రిచా నాకు సీనియర్‌. తనతో నాకు ఏమాత్రం పరిచయం లేదు. ఫేర్‌వెల్‌ పార్టీలో తొలిసారి కలిశాం. వాళ్లు వెళ్లిపోతున్నారు కాబట్టి.. కంగ్రాట్స్‌ చెప్పానంతే. ఆ తర్వాత మేం మళ్లీ కలిసింది లేదు. రెండేళ్ల తర్వాత అనుకుంటా, ఫేస్‌బుక్‌లో కలిశాం. ఒకరినొకరు పలకరించుకొన్నాం. ఆ తర్వాత మంచి స్నేహితులమయ్యాం. నా కంటే ముందు తనే సెటిల్‌ అయ్యింది. రిచా రైటర్‌. ఒక కంపెనీలో తను భాగస్వామి, అలాగే ఆ కంపెనీకి సోషల్‌ మీడియా మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తోంది. మేం మంచి స్నేహితులం కాబట్టి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్