నిమిషాల్లో వెండి శుభ్రం!

పూజల్లో వెండి వస్తువులనే ఉపయోగిస్తారు చాలా మంది. సమస్యల్లా.. వాటిని శుభ్రం చేయడంతోనే! పెద్దగా శ్రమలేకుండా నిమిషాల్లో వాటిని మెరిపించేందుకు ఈ చిట్కాలను ప్రయత్నించండి...  ఒక గాజు పాత్రకు లోపలి వైపున అల్యూమినియం ఫాయిల్‌ ఉంచండి. దానిలో మరిగించిన నీటిని పోసి, ఆపై లిక్విడ్‌ డిటర్జెంట్‌ను వేసి కలపండి. వెండి వస్తువులను దానిలో వేసి ఓ నిమిషం వదిలేయాలి....

Published : 05 Aug 2022 00:35 IST

పూజల్లో వెండి వస్తువులనే ఉపయోగిస్తారు చాలా మంది. సమస్యల్లా.. వాటిని శుభ్రం చేయడంతోనే! పెద్దగా శ్రమలేకుండా నిమిషాల్లో వాటిని మెరిపించేందుకు ఈ చిట్కాలను ప్రయత్నించండి...

ఒక గాజు పాత్రకు లోపలి వైపున అల్యూమినియం ఫాయిల్‌ ఉంచండి. దానిలో మరిగించిన నీటిని పోసి, ఆపై లిక్విడ్‌ డిటర్జెంట్‌ను వేసి కలపండి. వెండి వస్తువులను దానిలో వేసి ఓ నిమిషం వదిలేయాలి. తర్వాత బయటికి తీసి గోరువెచ్చని నీటిలో రుద్ది కడిగితే సరి.

లీటరు వేడినీటిలో అరచెక్క నిమ్మరసం, 3 టేబుల్‌ స్పూన్ల ఉప్పు వేసి, వాటిలో వెండి పాత్రలు, నగలు ఉంచండి. అయిదు నిమిషాలయ్యాక కాస్త రుద్ది కడిగితే మెరుపు తిరిగొస్తుంది.

గాజు లేదా పింగాణి పాత్రలో అల్యూమినియం ఫాయిల్‌ మెరిసే వైపుని పైకి వచ్చేలా ఉంచి, నీటితో నింపాలి. లీటరు నీటికి అయిదు స్పూన్ల చొప్పున బేకింగ్‌ సోడా వేసి మరిగించాలి. దానిలో వెండి వస్తువులను వేసి అర నిమిషం ఉంచి తీయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. మరీ మొండిగా పట్టేసుంటే రెండోసారి తిరిగి చేయాలి. ఇతర మెటల్‌ పాత్రలను ఇందుకు వాడద్దు. రాళ్లు లేని వాటినే ఈ పద్ధతిలో శుభ్రం చేయాలి.

మొక్కజొన్న పిండిలో తగినన్ని నీళ్లు కలిపి గట్టి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని వెండి వస్తువులకు పట్టించి పూర్తిగా ఎండనివ్వాలి. ఆపై పేపర్‌ టవల్‌తో రుద్ది, కడిగితే మెరుస్తాయి.

శానిటైజర్‌ కూడా మాయ చేయగలదు. పేపర్‌ టవల్‌పై కొన్ని చుక్కల శానిటైజర్‌ వేసి, దాంతో రుద్ది చూడండి. శుభ్రతతోపాటు మెరుస్తాయి కూడా.

పాత బ్రష్‌పై టూత్‌పేస్ట్‌ను తీసుకోండి. దాంతో వెండి వస్తువులను వృత్తాకారంలో రుద్ది అయిదు నిమిషాలు పక్కన పెట్టేయండి. ఆపై చల్లటి నీటితో కడిగేస్తే తేలిగ్గా శుభ్రపడతాయి. వేడి నీటిలో డిటర్జెంట్‌ పౌడర్‌ కలిపి ఆ మిశ్రమంలో వెండి వస్తువులను 5 నిమిషాలుంచి, కాస్త రుద్ది కడిగినా ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్