ఇంటి నుంచే ఆనందంగా!

ఒమిక్రాన్‌ కారణంగా చాలా సంస్థలు మళ్లీ ఇంటి నుంచే పని చేయమంటున్నాయి. ఇల్లు, ఉద్యోగం రెండూ చూసుకునే ఇల్లాళ్లకి ఇది ఒకరకమైన ఒత్తిడే! దీన్ని తప్పించుకోవడానికి నిపుణుల సూచనలివిగో!

Updated : 12 Jan 2022 05:36 IST

ఒమిక్రాన్‌ కారణంగా చాలా సంస్థలు మళ్లీ ఇంటి నుంచే పని చేయమంటున్నాయి. ఇల్లు, ఉద్యోగం రెండూ చూసుకునే ఇల్లాళ్లకి ఇది ఒకరకమైన ఒత్తిడే! దీన్ని తప్పించుకోవడానికి నిపుణుల సూచనలివిగో!

* ఇంటి నుంచి పనిలో నిర్దిష్ట పనివేళలుండవు. అదే ప్రధాన ఇబ్బంది. కాబట్టి, మీ పని గంటలేవో ఆ సమయంలో ఇంటి పనులను పక్కన పెట్టేయండి. కార్యాలయ పనికే ప్రాధాన్యమివ్వండి. అలాగే సమయం ముగిశాక అందుబాటులో ఉండటం కష్టమని ముందే మీ పైవారికి, సహోద్యోగులకు చెప్పేయండి.

* ఇంట్లో వదులుగా, సౌకర్యంగా ఉండే దుస్తులనే ఇష్టపడతాం. కానీ అవి మెదడుకు విశ్రాంతి సంకేతాన్నిస్తాయి. దీంతో పనీ నెమ్మదిగా సాగుతుంది. ఫలితమే ఎక్కువ సేపు పనిచేయాల్సి రావడం! కాబట్టి, ఆఫీసుకు వేసుకెళ్లే దుస్తులనే ధరించండి.

* చుట్టుపక్కల ప్రాంతం సక్రమంగా ఉంటేనే.. మనసూ ప్రశాంతంగా ఉండేది! ఎంచుకున్న గదిని సర్దిపెట్టుకోండి. టీవీ, బయటివారి మాటలు వినబడకుండా జాగ్రత్త తీసుకోండి. మంచాలపై కాకుండా టేబుల్‌, కుర్చీని ఏర్పాటు చేసుకుని పని చేసుకోండి.

* రోజు ముగిసేసరికి పని పూర్తిచేయాలన్నది నిజమే. కానీ అదేపనిగా చేస్తూ పోతే మెదడు అలసిపోతుంది. పనికి ఉపక్రమించే ముందే.. చిన్న చిన్న విరామాలను తప్పక ప్లాన్‌ చేసుకోండి.

* ఒంటరిగా పనిచేయడం అనాసక్తిని కలిగిస్తుంది. ప్రభావం పనిపైనా పడుతుంది. పని కోసమే కాకుండా.. విరామాలప్పుడూ సహోద్యోగులతో వీడియో కాల్‌ మాట్లాడటం, పని సంగతులు పంచుకోవడం వంటివి చేయండి. అయితే.. సమయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మాత్రం మరచిపోకండే! ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. ఇంటి నుంచీ ఆనందంగా పనిచేసేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్