నాకేం కావాలి?

మహిళా దినోత్సవం... ఇంటికి వెలుగు, సూపర్‌ విమెన్‌ అంటూ బోలెడు మెసేజ్‌లు, పొగడ్తలు.  వాటన్నింటినీ చూస్తున్నప్పుడు మనసు ఎటో  లాక్కెళ్లింది. నాకు కావాల్సింది అవి కాదనిపించింది. ఏం కావాలి? మరి నాకేం కావాలి అంటే...

Updated : 08 Mar 2024 12:14 IST

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం...

మహిళా దినోత్సవం... ఇంటికి వెలుగు, సూపర్‌ విమెన్‌ అంటూ బోలెడు మెసేజ్‌లు, పొగడ్తలు.  వాటన్నింటినీ చూస్తున్నప్పుడు మనసు ఎటో  లాక్కెళ్లింది. నాకు కావాల్సింది అవి కాదనిపించింది. ఏం కావాలి? మరి నాకేం కావాలి అంటే...

రాణిని చేయండి

‘మా ఇంటి మా లక్ష్మి’ నేను పుట్టినపుడు ప్రతి ఒక్కరూ ఇదే మాట. అడుగేస్తే కాలు కందుతుందేమో అన్నంత జాగ్రత్త. రంగురంగుల దుస్తులు, నగలు వేసి మురిసిపోవడాలు సరేసరి. ఒకరకంగా యువరాణి హోదానే! ప్రేమించండి... కానీ కోరినవన్నీ తెచ్చిపెట్టేయొద్దు. నేను మీకు ప్రత్యేకమే! అలాగని అందరికీ కాదుగా? ఇలాగే సాగితే... ఎక్కడైనా నేను కోరుకున్నదే జరుగుతుందనుకోనా? పొరపాటున అలా జరక్కపోతే అప్పుడు తట్టుకోలేను. ఆరేడు ఏళ్లు... చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకునే వయసు నాది. కొన్ని జీవన నైపుణ్యాలనూ స్వయంగా నేర్చుకోవాల్సిన సమయమిదే. కాబట్టి, ప్రిన్సెస్‌లా కాదు టఫ్‌ గర్ల్‌లా పెంచండి. నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తూనే సవాళ్లేవైనా తట్టుకునేలా సిద్ధం చేయండి. అప్పుడే నా జీవితానికి నేను రాణిని అవ్వగలను.

భరోసా ఇవ్వండి

అప్పటిదాకా చిన్నపిల్లనే! యవ్వనంలోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా పెద్దదాన్నైపోతా. నాన్నైతే నన్ను దగ్గరకు తీసుకోవడానికీ వెనకాడతారు. పైగా ‘ఒక వయసొచ్చాక నాన్నకైనా దూరం పాటించా’లనే నియమాలు. ఓవైపు లోలోపల ఏదో అలజడి, శరీరంలోనూ కొత్త మార్పులు. ఇవన్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు అమ్మమీదో, బామ్మమీదో అరిచేస్తాను, అలుగుతాను. నాన్న ఉన్నారన్న ధైర్యం. తనొక్కరే నన్ను అర్థం చేసుకోగలరన్న నమ్మకం. అమ్మాయి ఆత్మవిశ్వాసం పెరగాలా తగ్గాలా అన్నది ‘టీనేజీ’లోనే నిర్ణయమవుతుందట. ఆ సమయంలోనే తోడు వదలొచ్చా? ఒంటరినైపోనూ? దగ్గరకు తీసుకొని భరోసానివ్వండి. ప్రేమను పంచుతూ భరోసాను నింపాల్సిన బంధువులూ, ఉపాధ్యాయులూ ప్రతి విషయానికీ ప్రశ్నిస్తూ, అతిగా గమనిస్తూ, కట్టడి చేయొద్దు. నా మంచికే అని మీరనుకున్నా ఉక్కిరిబిక్కిరై పోతాను. వెన్నంటి ఉండండి...  ధైర్యమివ్వండి. అప్పుడు ఏదైనా సాధించి చూపిస్తా.

సమానత్వం కావాలి

కొత్త ప్రదేశంలో, కొత్త మనుషుల మధ్య కాసేపు గడపడానికే చాలా ఇబ్బంది పడతాం కదూ! పుట్టి పెరిగిన ఇల్లు, అయినవాళ్లు అందరినీ వదిలేసి, తెలియని ప్రపంచంలోకి అడుగుపెడతాం. కుదురుకోవడం ఎంత కష్టం? ‘ఇదేమైనా కొత్తా? అందరికీ మామూలేగా’ అన్నా ఆ అమ్మాయికి కొత్తే. పైగా మెచ్చిన కెరియర్‌, సాధించిన విజయాలు అన్నీ పక్కకు వెళతాయి. కొత్త బాధ్యతలు వస్తాయి. ఇక పిల్లలు పుడితే త్యాగం చేయాల్సిందీ నేనే. పొగడ్తలేమీ కోరుకోను. సూపర్‌ విమెన్‌ అన్న బిరుదులూ వద్దు. కానీ ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా కాస్త సహకరించండి. నన్నూ మగవాళ్లతో సమానంగా చూడండి. నలుగురికి సాయపడాలన్న తపననీ, ఆసక్తినీ గుర్తించండి. నా పనికీ, నిర్ణయాలకీ విలువనివ్వండి.

మీ తోడు చాలు

చిన్నా పెద్దా కాని పిల్లలు. ఏం చెప్పాలనుకున్నా ‘నీకేం తెలియదమ్మా’ అనేస్తుంటారు. వాళ్ల లోకం వాళ్లది. పోనీ భర్తగా మీతో పంచుకుందామంటే మీరు బిజీ. గృహిణిగా అన్నీ అమర్చి పెట్టినా... ఉద్యోగినిగా, వ్యాపారిగా బయట ఓ బృందాన్ని నడుపుతున్నా ఎక్కడో అసంతృప్తి! కుటుంబ బాధ్యతల్లో పడి నన్ను నేను మరిచానా? ఆనందంగానే ఉన్నానా? అతిగా ఆధారపడుతున్నానా? నేను కోరుకున్న జీవితం ఇదేనా? ఈ ఆలోచనలు నాకేనా... ఇంకెవరైనా ఇలానే ఆలోచిస్తున్నారా అన్న మానసిక స్థితికి తోడు... ప్రీ మెనోపాజ్‌, మెనోపాజ్‌ శరీరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే... ఆ బాధ ఎవరికి చెప్పుకోను? తెలియని ఆందోళన, కోపం, నిద్ర అంటూ ఎరుగను. ఆ ప్రభావంతో ఒక్కోసారి కోపగించుకుంటే ఏమవుతుంది? అందరూ ఒక్కటై పోయి నన్నేగా పరాయిదాన్ని చేసేది. పనుల ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం... కాస్త అర్థం చేసుకోవచ్చుగా? భారాన్ని పంచుకోవచ్చుగా? మానసిక ఓదార్పునకు మించి మిమ్మల్ని కోరేదేముంది?

ఓ పలకరింపు...

‘మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది. తనను బాగా చూసుకోవాలి’ మీ మనసులో ఈ ఆలోచన నాకు తెలుసు. మీరు నాకోసం తీసుకొచ్చే వస్తువుల్లోనూ అది కనిపిస్తుంది. కానీ నాకు కావాల్సింది జ్ఞాపకాలు. ఏదో పనిచేస్తుంటానా... ‘అరె చిన్నప్పుడు మావాడు అలా చేసేవాడు, అమ్మాయి ఇలా అలిగేది’ అంటూ బోలెడు గుర్తొస్తాయి. పంచుకుందామని గబగబా వస్తానా... మాట పెదవి దాటేలోపే మీరేమో బిజీగా కనిపిస్తారు. ఊసూరుమంటూ వెనక్కి తిరుగుతా. అమ్మని... మీ పనుల ఒత్తిడి అర్థం చేసుకోగలను. అయినా మనసులో ఏ మూలో సన్నని బాధ. అస్తమానూ అక్కర్లేదు కానీ... కలిసి ఓ టీ, ప్రేమగా చేయి పట్టుకొని కొన్ని కబుర్లు చెప్పొచ్చుగా! ఆ కొద్దిసమయం నా పెదవిపై రోజంతా చిరునవ్వు పూయిస్తుందంటే నమ్ముతారా? దానిముందు నాకే బహుమతైనా దిగదుడుపే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్