అరిచి పనిచేయించడం నా నైజం కాదు!

ఐఏఎస్‌గా బాధ్యతలు తీసుకొన్న తొలినాళ్లలో... ఐరాస అభివృద్ధి లక్ష్యాల కోసం కశ్మీర్‌వంటి చోట్ల పనిచేసినప్పుడు... కొవిడ్‌లాంటి మహమ్మారులని ఎదుర్కొన్నప్పుడు... తెలంగాణ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా... అడుగడుగునా ఎన్నో సవాళ్లు. అన్నింటినీ ఒకేధైర్యంతో ఎదుర్కొన్నారు.

Updated : 08 Mar 2024 12:11 IST

ఐఏఎస్‌గా బాధ్యతలు తీసుకొన్న తొలినాళ్లలో... ఐరాస అభివృద్ధి లక్ష్యాల కోసం కశ్మీర్‌వంటి చోట్ల పనిచేసినప్పుడు... కొవిడ్‌లాంటి మహమ్మారులని ఎదుర్కొన్నప్పుడు... తెలంగాణ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా... అడుగడుగునా ఎన్నో సవాళ్లు. అన్నింటినీ ఒకేధైర్యంతో ఎదుర్కొన్నారు. అధికారి అంటే అలా ఉండాలి.. అనేలా క్రమశిక్షణకు మారుపేరుగా మారారు. ఆమే సీఎస్‌ శాంతికుమారి. వసుంధర ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించింది...

మీ కుటుంబం... చదువుల నేపథ్యం గురించి చెబుతారా?

మాది కృష్ణాజిల్లా మచిలీపట్నం. నాన్న ఎస్‌బీఐలో రిటైర్డ్‌ ఉద్యోగి. అమ్మ గృహిణి. వాళ్లిప్పుడు లేరు. సాధారణ మధ్యతరగతి కుటుంబం మాది. మేము నలుగురు అక్కాచెల్లెళ్లం. ఒక అక్క క్యాన్సర్‌తో చనిపోయింది. మిగిలిన ఇద్దరూ గృహిణులు. నా విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. నాకు ముందునుంచీ పరిశోధన రంగం పట్ల ఆసక్తి ఉండేది. పీహెచ్‌డీ చేసి మెరైన్‌ బయాలజీలో ప్రొఫెసర్‌గా, శాస్త్రవేత్తగా ఎదగాలనుకున్నా. 

మరి సివిల్స్‌వైపు అడుగులు ఎలా పడ్డాయి. ఈ రంగంలో ఎవరైనా స్ఫూర్తి నింపారా?

(నవ్వుతూ)... అలాంటిదేమీ లేదు. యూనివర్సిటీలో నా స్నేహితులు కొందరు సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. వాళ్లు నాతో ‘దీన్ని మించి ఆలోచించు.. ఒకసారి సివిల్స్‌ రాసి చూడు’ అని ప్రోత్సహించారు. అలా 21 ఏళ్ల వయసులో సివిల్స్‌ రాశా. మూడో ప్రయత్నంలో  ఐఏఎస్‌ శిక్షణకు ఎంపికయ్యా. అంతకుముందు సివిల్‌ సర్వెంట్స్‌ ఎవరున్నారు? అని నేను పెద్దగా ఆరా తీసిన సందర్భాలేమీ లేవు. ఐఏఎస్‌లో చేరిన పదేళ్ల తరవాత అమెరికాలో ఎంబీఏ చేశా. అదికూడా ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే ఆసక్తితోనే తప్ప అమెరికాలో కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగం చేయాలని కాదు.  ఐఏఎస్‌గా అవ్వకపోయుంటే ప్రొఫెసర్‌గా స్థిరపడేదాన్నేమో. 

యూఎన్‌డీపీలో రెండేళ్లు పనిచేశారు. ఆ సమయంలో గుర్తుండిపోయే అనుభవాలు?

యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌డీపీ)లో పనిచేస్తున్నప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలూ పర్యటించా. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉండేదాన్ని. అప్పట్లో అక్కడ క్లిష్ట పరిస్థితులుండేవి. అయినా మహిళా స్వయం సహాయక బృందాలను తయారు చేయడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు వంటివి చేశా. ప్రజలు చాలా సాను   కూలంగా స్పందించారు. ఫలితంగా మహిళలు రుణాలు పొంది, ఏదో ఒక పని చేస్తూ, తమ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. ఇవి  ప్రజలు కొంతవరకూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు దృష్టిపెట్టకుండా చేశాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ తరహా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాం.

మీరు ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో పనిచేశారు. ఆ రోజుల్లోనే వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహించడంలో ముందున్నారు. మీకలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి?

ఏ పనైనా కొత్తగా మొదలుపెట్టే వారి ఆలోచనలు తాజాగానే ఉంటాయి. నాకు మొదట్నుంచీ ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూడ్డం అలవాటు. నేనో పెద్ద అధికారిణి, నాకు పెద్ద హోదా, అధికారం ఉందనే భావన నాలో ఉండదు. అందుకే నా ఆలోచనలు కూడా వినూత్నంగా ఉంటాయేమో! కష్టాల్లో ఉన్న వారి జీవితాల్లో అర్థవంతమైన మార్పు తీసుకొస్తే చాలు అనుకుంటా. ఉదాహరణకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో  కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పలకలను అందజేయాలని అనిపించింది. నన్ను కలవడానికి వచ్చేవాళ్లు పలకలు, బలపాలు తీసుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశా. ఆ విజ్ఞప్తికి భారీ స్పందన వచ్చింది. వాటిని ఎంతోమందికి అందించాం. అలాగే మరుగుదొడ్లని వినియోగించడం లేదనేది తెలుసుకుని స్వయంగా గ్రామాల్లో పర్యటించా. అసలు అక్కడ నీళ్లు రావడం లేదు. దీంతో తీవ్రమైన అపరిశుభ్రత. అది నిర్మించిన ఇంజినీరు తప్పు కాదు.. వినియోగిస్తున్న ప్రజలదీ కాదు. అందుకే నీళ్ల వసతి కల్పించడంపై దృష్టిపెట్టా. నేను ఎప్పుడూ ఈ విధంగా ఆలోచిస్తుంటా.

మీరు సహచర సిబ్బంది విషయంలోనూ ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి చాలా అరుదు అని అంటుంటారు? 

నేను ఎప్పుడూ తోటి సిబ్బందిపై అరవను. అది నా సహజసిద్ధ స్వభావం. పేరు, ప్రచారం రావాలి. అధికారం చూపించాలి అనుకున్నప్పుడు.. అలాంటి ధోరణితో వ్యవహరిస్తుంటారేమో. నేను అలా ఆలోచించను. సమస్యను పరిష్కరించడం ఎలా అనే దానిపైనే నా దృష్టంతా. సమస్యను గుర్తించిన తరవాత నేను ఒక్కదాన్నే పరిష్కరించలేను కదా! అందరూ సమష్టిగా కలిసి పనిచేస్తేనే విజయం సాధించగలం. పది మందిలో ఒకరు ఎక్కువ పని చేయొచ్చు. ఒకరు తక్కువ చేయొచ్చు. వాళ్ల సామర్థ్యాలను అర్థం చేసుకున్నప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించగలం. ఎవరు ఏ పనిని ఎంత మేరకు చేయగలరనేది అంచనా వేసి, ఆ మేరకు పనులు అప్పగించడం నాకు ముందు నుంచీ అలవాటు. అది నా వర్కింగ్‌ స్టైల్‌. ఒకవేళ ఏదైనా చేయలేకపోయినా అందుకు వారు బాధ్యులని వేరొకరి మీద నెట్టడాన్ని నేను ఇష్టపడను. గమ్యం కంటే.. ప్రయాణమే ముఖ్యమని బలంగా నమ్ముతాను.

కెరియర్‌లో ఇప్పుడు మీరు అత్యున్నతమైన పదవిలో ఉన్నారు? ఈ సమయంలో మీ అనుభవం?

హోదా మారినా ప్రిన్సిపుల్స్‌ మాత్రం అవే. కాకపోతే ఒక శాఖకు బాధ్యులుగా ఉన్నప్పుడు అంత వరకే పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సీఎస్‌గా నేను 23 శాఖలకు సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. ఎంతో అనుభవమున్న ఐఏఎస్‌లు, మంత్రులు, ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలి. ఒక్కొక్కరికీ ఒక్కో విజన్‌ ఉంటుంది. వాళ్లని అర్థం చేసుకొని ముందుకెళ్లాలి. మనం ఏమి చేయాలనే దానిపై స్పష్టత ఉంటే.. మన మార్గం కూడా స్పష్టంగా ఉంటుంది. ప్రభుత్వాధినేతకు ఒక పొలిటికల్‌ విజన్‌ ఉంటుంది. దానికి ఒక కార్యరూపం తీసుకొచ్చి, సంబంధిత కార్యదర్శికి అప్పగించి, వారికి మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది.

మీ కుటుంబం మద్దతు?

అది లేకపోతే.. నేనిలా పనిచేయలేను. ఇంత సమయం, ఎఫర్ట్‌, డెడికేషన్‌ పెట్టలేను. మనకు ఏది ముఖ్యమనేది కుటుంబ సభ్యులకూ వివరించాలి. ఇంట్లో కూడా టీమ్‌ వర్కే ఉంటుంది. కచ్చితంగా నా కెరియర్‌లో భర్త, కుమార్తెల పాత్ర చాలా కీలకం. నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు.

ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ సమయంలో మీరు ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ కఠిన సమయాన్ని ఎదుర్కొన్నప్పుడు మీ అనుభవాలు?

కొవిడ్‌ తొలి కేసు నమోదు నుంచీ లాక్‌డౌన్‌ వరకూ అనేక సవాళ్లు. కొవిడ్‌ పరీక్షా కేంద్రాలు నిర్వహించడం, ఐసోలేషన్‌, ఆసుపత్రుల్లో పడకలు సిద్ధం చేయడం, నిషేధిత ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు ఇవన్నీ సవాల్‌తో కూడుకున్నవే. మాస్కులు, శానిటైజర్లను అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్లో అందుబాటులో ఉంచడం నిత్యం సవాల్‌గా అనిపించేది.

మహిళలకు ఏది ముఖ్యం?

ముందు మన విలువను మనం గుర్తించాలి. స్త్రీ అంటే భర్త, పిల్లలు, కుటుంబం అని కట్టిపడేస్తారు. ఇవన్నీ ముఖ్యమే. కానీ మహిళగా తనేంటో తెలుసుకోవాలి. మనకోసం మనమే నిలబడకపోతే.. ఎవరో మనకోసం నిలబడాలని ఎలా ఆశిస్తాం? మనం మన గురించి మాట్లాడాలి, కొట్లాడాలి.

ఈతరం అమ్మాయిలకు ఏం చెబుతారు?

మా తరంలో 20 ఏళ్లకుండే తెలివితేటలు ఇప్పుడు 10-12 ఏళ్లకే వస్తున్నాయి. కానీ ఈతరం అమ్మాయిలు ఎక్కువగా బయటి ప్రపంచం కోసమే బతుకుతున్నారు. లైక్‌లు, పోస్ట్‌లకే  ప్రాధాన్యమిస్తున్నారు.  అక్కడ నెగెటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వస్తే మానసిక కుంగుబాటుకు గురవుతారు. అందుకే బయట ప్రపంచం కోసం కాక... ఇన్నర్‌ బ్యూటీని అన్వేషించాలి. మనమేంటో
తెలుసుకోవడమే అవసరం.

  • ఆధ్యాత్మిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాను. నన్ను సరైన మార్గంలో ఉంచడానికి ఆధ్యాత్మిక భావన నాకు దోహదపడుతుందని నమ్ముతా.
  • నేను ప్రకృతి ప్రేమికురాలిని. ప్రశాంతంగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాను. కొండలు, అడవులంటే ఇష్టం. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని అడవుల్లోనూ పర్యటించా. ప్రకృతితో కనెక్ట్‌ అవడానికి మించిన సంతోషమేముంటుంది.
  • నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలంటే ఇష్టం. యోగుల ఆటోబయోగ్రఫీలంటే ఆసక్తి. రామకృష్ణ మిషన్‌ వాళ్లది ‘మోనాస్టిక్‌ లైఫ్‌’ పుస్తకం చదువుతున్నా.  
  • కాలేజీ రోజుల నుంచే సినిమాలు చూడటం మానేశాను. ఎప్పుడైనా డాక్యుమెంటరీలు చూస్తా.

అయితరాజు రంగారావు, ఈనాడు, హైదరాబాద్‌


మహిళలు ఇలానే జీవించాలనే ఫార్ములా ఏమీ లేదు. తన కోసం, కుటుంబం కోసం ఆడవాళ్లు తీసుకునే నిర్ణయాలను గౌరవించాల్సిందే. తన శక్తి సామర్థ్యాలేంటో తెలుసుకునే అవకాశం ప్రతి మహిళకీ ఇవ్వాలి.

హిల్లరీ క్లింటన్‌, యూఎస్‌ మొదటి మహిళా ప్రెసిడెంట్‌


ఈ రోజే కాదు, ప్రతిరోజూ మనదే..!


అరెస్టును అడ్డుకునే హక్కు

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 46 క్లాజ్‌(4) కింద స్త్రీలను సూర్యోదయానికి ముందూ లేదా అస్తమించిన  తరవాత అరెస్టు చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాల్సిన పరిస్థితే వస్తే.. ఓ మహిళా పోలీస్‌ అధికారి రాత పూర్వకంగా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ దగ్గర ముందస్తు అనుమతి తీసుకోవాలి. దానికి భిన్నమైన పరిస్థితులు  ఎదుర్కొంటే కోర్టులో సవాల్‌ చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్