Published : 07/11/2021 11:04 IST

మీ విడాకులు పిల్లలకు భారం కాకుండా..!

ఈరోజుల్లో పెళ్లి తర్వాత దంపతులు వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకోవడం చాలా సాధారణమైన విషయంగా మారింది. వీరిలో కొంతమంది పిల్లలున్న వాళ్లు కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో దంపతులిద్దరిలో ఎవరి తప్పు వల్ల వాళ్లు విడిపోతున్నారనే విషయం పక్కనబెడితే.. దీనివల్ల ఏ తప్పూ చేయని పిల్లలు మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న పిల్లలకు ఆ బాధ మరింత ఎక్కువుంటుంది. ఇకపై తమ తల్లిదండ్రులు కలిసుండరు అనే నిజాన్ని విని ఆ పసి మనసులు తట్టుకోలేవు. ఈ క్రమంలో సంబంధిత కేసును బట్టి పిల్లలను అయితే తల్లి దగ్గర.. లేదా తండ్రి దగ్గర ఉంచాలని న్యాయస్థానం నిర్ణయిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రుల్లో ఒకరిని విడిచి ఉండలేక పిల్లలు మానసికంగా కుంగిపోతుంటారు. ఈ క్రమంలో పిల్లల బాధను దృష్టిలో ఉంచుకొని విడాకులు తీసుకున్న దంపతులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటో చూద్దాం..!

పిల్లలకు వివరించండి..!

విడాకుల తర్వాత కొంతమంది మళ్లీ పెళ్లి చేసుకోవడం మామూలే. ఈ క్రమంలో మీ పిల్లలు మీ నిర్ణయాన్ని స్వాగతించకపోవచ్చు. వాళ్ల మనసులో మీరు పెళ్లి చేసుకున్న వారిపై ద్వేషం, అయిష్టత భావాలు బలంగా నాటుకుపోతాయి. అందుకే మీరు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ముందుగానే మీ పిల్లలకు అర్ధమయ్యేలా వివరించండి. మీ కొత్త భాగస్వామికి, పిల్లలకు మధ్య ముందు స్నేహబంధం ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల భావాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వాటిని మార్చడం అసాధ్యమని మాత్రం మర్చిపోకండి.

సమయం కేటాయించండి..!

మీ భాగస్వామితో విడాకులు తీసుకున్న తర్వాత మీతో పాటు పిల్లలు కూడా ఒంటరిగా బాధపడుతుంటారు. ఈ క్రమంలో పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. వృత్తిగతంగా మీరెంత బిజీగా ఉన్నప్పటికీ వారంలో ఒకటి, రెండు రోజులు పిల్లలకే కేటాయించండి. వాళ్లతో కలిసి ఆడుకోవడం, నచ్చిన ప్రదేశాలకు తీసుకెళ్లడం, వాళ్ల స్నేహితులను మీ ఇంటికి పిలవడం.. లాంటివి చేయండి. దీనివల్ల పిల్లలు తమ తల్లి/తండ్రికి దూరంగా ఉన్నారనే బాధ నుంచి క్రమంగా కోలుకుంటారు.

కుదిరితే కలుస్తుండండి..!

సమాజంలో ఎంతోమంది దంపతులు విడాకుల తర్వాత మంచి స్నేహితులుగా ఉంటుంటారు. తమ పిల్లల సంరక్షణ విషయంలో ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకొంటుంటారు. కలిసి జీవించకపోయినా పిల్లల కోసం ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తుంటారు. ఇలా ఉండడం అందరికీ కుదరకపోవచ్చు.. కానీ అవకాశం ఉన్నవాళ్లు ఇలా ఉండేందుకు ప్రయత్నించడంలో తప్పులేదు..! సమయం కుదిరినప్పుడల్లా ఇద్దరూ కలిసి పిల్లలతో సరదాగా సమయాన్ని గడపండి. వారానికి ఒకటి, రెండు రోజులు పిల్లలను షికారుకు తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల తమ తల్లిదండ్రులు విడిపోయారనే విషయాన్ని మర్చిపోయి పిల్లలు ఆనందంగా ఉంటారు.

స్వేచ్ఛతో పాటు క్రమశిక్షణ అవసరం..!

విడాకుల తర్వాత పిల్లలకు తల్లి/తండ్రి ప్రేమ దూరమైందని.. వాళ్లని బాగా గారాం చేసి ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుంటారు తల్లిదండ్రులు. కానీ.. మీరిచ్చే స్వేచ్ఛను వాళ్లు దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇందుకోసం వాళ్లు వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా కనిబెడుతుండండి. ఈ క్రమంలో పిల్లలకు స్వేచ్ఛతో పాటు కొంచెం క్రమశిక్షణ కూడా అవసరమనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు..!

సమానంగా చూడండి..!

విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది మరో వివాహం చేసుకుంటారు. కొన్నిసార్లు అవతలి వ్యక్తికి కూడా పిల్లలుండే అవకాశముంటుంది. ఈ క్రమంలో మీ పిల్లల జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తున్నారనే విషయాన్ని వాళ్లకు అర్ధమయ్యేలా వివరించండి. ఇరువురి పిల్లలను సమానభావంతో చూడండి. పిల్లల మధ్య స్నేహబంధం ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకోండి.

ఇవి కాకుండా ఇంకేవైనా జాగ్రత్తలు మీకు తెలిసుంటే వాటిని మాతో పంచుకోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని