కాబోయే అమ్మల కోసం తారల పుస్తకాలు!

కాబోయే తల్లి నెలలు నిండుతున్న కొద్దీ పుట్టబోయే తన ప్రతిరూపాన్ని ఊహించుకుంటూ అమితానందానికి లోనవుతుంటుంది. మరికొన్నిసార్లు ఆరోగ్యం-మనసు సహకరించక పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలా అమ్మతనం ప్రతి మహిళకు ఎన్నో అనుభవాలు, అనుభూతుల్ని మిగుల్చుతుంది. అయితే వాటన్నింటినీ తమలోనే దాచుకోకుండా నలుగురితో పంచుకుంటూ.. కాబోయే అమ్మలందరికీ మార్గనిర్దేశనం చేయాలనుకుంటారు కొందరు మహిళలు.

Published : 12 Jul 2021 20:08 IST

కాబోయే తల్లి నెలలు నిండుతున్న కొద్దీ పుట్టబోయే తన ప్రతిరూపాన్ని ఊహించుకుంటూ అమితానందానికి లోనవుతుంటుంది. మరికొన్నిసార్లు ఆరోగ్యం-మనసు సహకరించక పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలా అమ్మతనం ప్రతి మహిళకు ఎన్నో అనుభవాలు, అనుభూతుల్ని మిగుల్చుతుంది. అయితే వాటన్నింటినీ తమలోనే దాచుకోకుండా నలుగురితో పంచుకుంటూ.. కాబోయే అమ్మలందరికీ మార్గనిర్దేశనం చేయాలనుకుంటారు కొందరు మహిళలు. బాలీవుడ్‌ అందాల తార కరీనా కపూర్‌ కూడా అదే చేసింది. ఇద్దరు పిల్లల తల్లైన ఈ ముద్దుగుమ్మ.. రెండుసార్లు అమ్మయ్యే క్రమంలో తనకెదురైన అనుభవాలను రంగరించి ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ అనే పుస్తకం రాసింది. కాబోయే అమ్మలందరికీ ఇదొక గైడ్‌లా ఉపయోగపడుతుందంటూ ఇటీవలే తన పుస్తకాన్ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. కరీనానే కాదు.. గతంలోనూ కొందరు తారలు/ప్రముఖులు అమ్మతనంపై పుస్తకాలు రాసి.. కాబోయే అమ్మల్లో స్ఫూర్తి నింపారు. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తొలిసారి తల్లయ్యే క్రమంలో ఎదురయ్యే ప్రతి అనుభవమూ కొత్తగానే ఉంటుంది. అదే రెండోసారైతే పూర్వపు అనుభవం ఉంది కాబట్టి.. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే నేర్పు తనకు అలవడుతుంది.. అందుకే తొలి, మలి ప్రెగ్నెన్సీలు మహిళలకు విభిన్నమైన అనుభూతుల్ని పంచుతాయంటోంది బెబో. ఈ క్రమంలో తన ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చే క్రమంలో తనకెదురైన అనుభవాలన్నీ ఒక్కచోట చేర్చి పుస్తకంగా రాసిందీ బాలీవుడ్‌ బ్యూటీ. గతేడాది తన కొడుకు తైమూర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అందరితో పంచుకుంది.

అందమైన ప్రయాణానికి ప్రతిరూపమిది!

‘కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పేరుతో తాను రాసిన పుస్తకాన్ని ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది కరీనా. మైక్రోవేవ్‌ ఒవెన్‌ నుంచి పుస్తకాన్ని బయటికి తీసి అందరికీ చూపుతూ.. ఇలా విభిన్నంగా తన పుస్తకాన్ని ఆవిష్కరించిన బెబో.. కాబోయే అమ్మలందరికీ ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది.

‘అమ్మతనం అనేది ఓ అందమైన ప్రయాణం. నేను రెండుసార్లు అమ్మనయ్యే క్రమంలో నాకు ఎదురైన అనుభవాలు, పాటించిన ఆహార నియమాలు, చేసిన వ్యాయామాలు.. తదితర విషయాలన్నీ రంగరించి ఈ పుస్తకం రాశాను. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పుస్తకాన్ని నా మూడో బిడ్డగా భావిస్తున్నా. గర్భిణిగా ఉన్నప్పుడు ఎన్నో మధురానుభూతులతో పాటు ఆరోగ్యం విషయంలో పలు సవాళ్లను కూడా ఎదుర్కొన్నా. ఈ క్రమంలో ఒక్కోసారి నా శరీరం నాకు సహకరించకపోయేది. కెరీర్‌పై దృష్టి పెట్టడం కూడా ఓ సవాలుగా మారేది. ఇలా రెండుసార్లు గర్భిణిగా ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా నేను ఎదుర్కొన్న అనుభవాలన్నింటి సారాంశమే నా ప్రెగ్నెన్సీ బైబిల్‌. నా వ్యక్తిగత అనుభవాలతో పాటు గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంతమంది నిపుణులు చెప్పిన సలహాలను కూడా ఇందులో పొందుపరిచాను.

ఈ పుస్తకాన్ని Federation of Obstetric and Gynaecological Societies of India (FOGSI) కూడా ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయం!’ అంటోందీ అందాల అమ్మ. 2016లో తైమూర్‌కు జన్మనిచ్చిన ఈ బాలీవుడ్‌ మామ్‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముద్దులొలికే బాబుకు జన్మనిచ్చి మరోసారి తల్లిగా ప్రమోషన్‌ పొందింది.


సవాలైనా సంతోషంగా ఎదుర్కోవాలి!

తొలిసారి తల్లయ్యే క్రమంలో పలు సవాళ్లు ఎదురైనా.. వాటిని సంతోషంగా అధిగమించినప్పుడే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలం అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కల్కీ కొచ్లిన్. గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్‌కు చెందిన పియానిస్ట్‌ గై హెర్ష్‌బర్గ్‌తో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. వారి ప్రేమ బంధానికి గుర్తుగా గతేడాది ఫిబ్రవరిలో సాఫో అనే ముద్దులొలికే పాపకు జన్మనిచ్చింది. అయితే ఈ క్రమంలో తనకెదురైన అనుభవాలను ఓ పుస్తకం రూపంలో రాయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిందీ బోల్డ్‌ బ్యూటీ. అంతేకాదు.. ఈ అందమైన జర్నీకి ‘ది ఎలిఫెంట్‌ ఇన్‌ ది ఊంబ్’ అనే పేరు కూడా పెట్టింది కల్కి.

‘నేను గర్భిణిగా ఉన్నప్పుడు కాబోయే అమ్మగా పలు సవాళ్లను ఎదుర్కొన్నా. ఆ సమయంలో వాటిని అధిగమించానంటే అదంతా నా స్నేహితుల చలవే! ఎందుకంటే వాళ్లూ వాళ్ల జీవితంలో జరిగిన ఇలాంటి అనుభవాలు, వాటిని వారు ఎదుర్కొన్న విధానం గురించి నాతో పంచుకున్నారు. అంతేకాదు.. ప్రెగ్నెన్సీ సమయంలో ఏ విషయాన్నైనా నవ్వుతూ, ధైర్యంగా పరిష్కరించుకోవాలని నాకు సూచించారు. బహుశా.. ఆ సమయంలో ఇదే నన్ను మరింత సంతోషంగా ఉండేలా చేసిందేమో! ముద్దులొలికే చిన్నారిని నా జీవితంలోకి ఆహ్వానించేలా చేసిందేమో! అందుకే ఆ అనుభవాలన్నీ త్వరలోనే పుస్తక రూపంలో మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నా.. అమ్మతనంలోని మధురానుభూతుల్ని కళ్లకు కట్టినట్లు చూపేలా అందమైన ఇలస్ట్రేషన్స్‌ వేయిస్తున్నా. ఎంతో సరదాగా సాగిపోతూ, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపించేంత ఆసక్తిగా ఉంటుందీ పుస్తకం..’ అంటూ ఓ సందర్భంలో తన పుస్తకం గురించి చెప్పుకొచ్చిందీ క్యూట్‌ మామ్‌. ప్రతి విషయంలోనూ సూటిగా, ధైర్యంగా మాట్లాడే కల్కి.. తన చిన్నారీ తనలాగే ధైర్యవంతురాలంటూ పుస్తకానికి పెట్టిన టైటిల్‌తోనే చెప్పకనే చెప్పింది.


ఏం చేయాలి? ఏం చేయకూడదు?

ప్రెగ్నెన్సీ అనేది ఒకట్రెండు రోజుల్లో ముగిసేది కాదు.. తొమ్మిది నెలల పాటు సాగే సుదీర్ఘ ప్రయాణం. ఈ క్రమంలో శరీరంలో వచ్చే మార్పుల్ని సానుకూలంగా స్వీకరించినప్పుడే దాన్ని పూర్తిగా ఆస్వాదించగలం అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవడం దగ్గర్నుంచి బిడ్డ పుట్టే దాకా మహిళలు చేయాల్సిన పనులేంటి? చేయకూడనివేంటో వివరిస్తూ ఓ పుస్తకం రాశారామె. ‘Pregnancy Notes: Before, During and After’ అనే పేరుతో 2017లో విడుదల చేసిన తన పుస్తకం గురించి మాట్లాడుతూ..

‘ప్రెగ్నెన్సీ అనేది ఓ సుదీర్ఘమైన ప్రయాణం. గర్భం ధరించడానికి ఓ ప్రణాళిక వేసుకోవడం దగ్గర్నుంచి.. తొమ్మిది నెలల పాటు ఏం చేయాలి? ఏం చేయకూడదు?, బిడ్డ పుట్టాక ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇలా ప్రతి దశా కీలకమే! అంతేకాదు.. గర్భం ధరించాక మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. త్రైమాసికాలు మారే కొద్దీ పలు అనారోగ్యాలూ సవాలుగా మారుతుంటాయి. చక్కటి పోషకాహారం, వ్యాయామాలతోనే వీటిని అధిగమించచ్చు. ఇక వీటికి తోడు ఈ సమయంలో ప్రయాణాలు చేయచ్చా? ఎలాంటి ఆహారం, ఎంత మొత్తంలో తీసుకోవాలి? మార్నింగ్‌ సిక్‌నెస్‌ నుంచి ఎలా బయటపడాలి? రోజులు గడుస్తున్న కొద్దీ వారి మదిలో ఇలాంటి సందేహాలెన్నో మెదులుతుంటాయి. వాటన్నింటికీ ఈ పుస్తకం సమాధానం చెబుతుంది..’ అంటారు రుజుత. అంటే.. అమ్మ కావాలన్న ఆలోచన చేసిన దగ్గర్నుంచి పాపాయిని చేతుల్లోకి తీసుకునే దాకా.. ఇలా ప్రతి విషయంలో కాబోయే తల్లులకు మార్గనిర్దేశనం చేశారామె. అంతేకాదు.. కరీనా రెండుసార్లు గర్భిణిగా ఉన్నప్పుడు.. తనకు వ్యక్తిగత న్యూట్రిషనిస్ట్‌గా వ్యవహరించిన రుజుత.. బెబో మాతృత్వపు అనుభవాలను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇదొక్కటనే కాదు.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించి ఇంకా బోలెడన్ని పుస్తకాలు రాశారు రుజుత.


సంతోషమే సగం బలం!

గర్భిణిగా ఉన్న సమయంలో కాబోయే అమ్మగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్న మహిళలు.. అమ్మయ్యాక మాత్రం మాతృత్వపు అనుభూతుల్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారనే చెప్పాలి. ఇందుకు ప్రసవానంతరం బరువు పెరిగిపోవడం, శారీరక మార్పుల్ని అంగీకరించలేకపోవడమే ముఖ్య కారణాలుగా చెప్పచ్చు. అయితే ప్రెగ్నెన్సీ అనుభవాలతో పాటు ప్రసవానంతర ఒత్తిళ్లను అధిగమించడానికి తాను రాసిన పుస్తకం చక్కగా ఉపయోగపడుతుందని చెబుతోంది బాలీవుడ్‌ బ్యూటీ కరిష్మా కపూర్‌. ‘మై యమ్మీ మమ్మీ గైడ్‌’ పేరుతో తాను రాసిన ఈ పుస్తకాన్ని 2013లో కాబోయే అమ్మల కోసం తీసుకొచ్చిందీ కపూర్‌ బ్యూటీ. డెలివరీ తర్వాత బరువు తగ్గడం, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి తన పుస్తకంలో ఎన్నో విషయాలు పొందుపరిచానంటోంది.

‘తల్లయ్యాక ఇటు ఇంటిని, అటు పనిని బ్యాలన్స్‌ చేసుకోవడమంటే అదో పెద్ద సవాలు. ఈ క్రమంలో ఎన్నో భావోద్వేగాలకు లోనవుతుంటాం. నేనైతే నా పిల్లల్ని ఇంటి వద్దే వదిలి షూటింగ్స్కి వెళ్లిన ప్రతిసారీ ఏదో తప్పు చేస్తున్న భావన (గిల్టీ) నాకు కలిగేది. కానీ నేను పిల్లల్ని ఎంతగా ప్రేమించేదాన్నో.. పనినీ అంతే ఆరాధించేదాన్ని. ఇలా పనిలో కలిగే ఉత్సాహంతోనే నాలో ఉన్న భావోద్వేగాలను అధిగమించేదాన్ని. నిజానికి కొత్తగా తల్లైన వారికి కావాల్సింది ఇలాంటి మానసిక సంతోషమే! అప్పుడే పిల్లల్నీ ఓపిగ్గా చూసుకోగలం. మరొక విషయం ఏంటంటే.. ప్రసవం తర్వాత శరీరంలో జరిగే శారీరక మార్పుల్ని అంగీకరించినప్పుడే ఎలాంటి ఒత్తిడి ఎదురు కాదు. కాబట్టి అమ్మయ్యాక ఆరోగ్యకరమైన జీవనశైలిపై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యం..’ అంటోంది కరిష్మా. సంజయ్‌ కపూర్‌ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు సమైరా, కియాన్‌ రాజ్‌ కపూర్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం తన భర్త నుంచి విడిపోయి సింగిల్‌ మదర్‌గానే తన చిన్నారుల ఆలనా పాలన చూస్తోందీ బాలీవుడ్‌ మామ్.
వీరితో పాటు మరికొంతమంది తారలు కూడా తమ ప్రెగ్నెన్సీ అనుభవాలను, ప్రసవానంతర ఒత్తిళ్లను.. వాటిని అధిగమించిన తీరును సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో పంచుకుంటూ కాబోయే అమ్మలందరిలో స్ఫూర్తి నింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్