Katrina Kaif : ‘టవల్‌ ఫైట్‌’ కష్టమైంది!

సినిమాల్లో యుద్ధాలు, పోరాట సన్నివేశాలు హీరోలే కాదు.. హీరోయిన్లూ చేసేస్తున్నారు. తెరపై రియాల్టీని పండించడానికి తామే స్వయంగా ఆ యుద్ధవిద్యల్నీ నేర్చేసుకుంటున్నారు. వ్యాయామాలతో తమ శారీరక దృఢత్వాన్ని మరింతగా పెంచుకుంటున్నారు.

Published : 08 Nov 2023 12:34 IST

(Photos: Instagram)

సినిమాల్లో యుద్ధాలు, పోరాట సన్నివేశాలు హీరోలే కాదు.. హీరోయిన్లూ చేసేస్తున్నారు. తెరపై రియాల్టీని పండించడానికి తామే స్వయంగా ఆ యుద్ధవిద్యల్నీ నేర్చేసుకుంటున్నారు. వ్యాయామాలతో తమ శారీరక దృఢత్వాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. ‘టైగర్‌-3’ సినిమా కోసం తానూ ఇలాంటి కసరత్తులే చేశానంటోంది బాలీవుడ్‌ టాల్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. పాత్రకు పరిపూర్ణత తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కష్టపడే ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమించానంటోంది. ఈ క్రమంలోనే తన వర్కవుట్‌ వీడియోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన క్యాట్‌.. ఈ సినిమా కోసం తాను కష్టపడిన తీరును ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది. ఇలా పని పట్ల ఆమె చూపిన అంకితభావాన్ని ప్రతిబింబిస్తోన్న ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సాధారణంగా సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలు ప్రదర్శించడానికి డూప్స్‌ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా స్వయంగా ఆ సాహసం చేసేస్తున్నారు కొందరు తారలు. వారిలో హీరోలే కాదు.. కొందరు హీరోయిన్లూ అలవోకగా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేస్తున్నారు. ‘టైగర్‌-3’ సినిమా కోసం కత్రినా కైఫ్‌ కూడా ఇలాంటి సాహసమే చేసింది. ఈ చిత్రంలో మాజీ ఐఎస్‌ఐ ఏజెంట్‌ ‘మాయ’ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్ని సన్నివేశాల్లో చిత్రీకరించిన యాక్షన్‌ సీన్స్‌ కోసం తీవ్ర కసరత్తులు చేశానంటోంది. ఒక దశలో శరీరం అలసిపోయినా విశ్రమించకుండా.. మనోబలంతో ముందుకు సాగానంటోంది.

ఒళ్లు హూనమైంది!

ఈ క్రమంలోనే తాను చేసిన కఠిన వ్యాయామాలకు సంబంధించిన వీడియోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన కత్రినా.. తన అనుభవాల్ని ఇలా పంచుకుంది.

‘టైగర్‌-3 సినిమా కోసం శక్తివంచన లేకుండా కష్టపడ్డా. నా ఆత్మబలం, ఓర్పు/సహనానికి ఇదో పరీక్షలా అనిపించింది. నేను చేసిన కఠిన వ్యాయామాలతో ఒక దశలో నా శరీరం హూనమైంది. విపరీతమైన శారీరక నొప్పులు వేధించాయి. కానీ ఆ సమయంలో ఓ వ్యక్తి చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. ‘నొప్పి అనేది బాధ కాదు.. అదో అనుభూతి. దానికి భయపడి అక్కడే ఆగిపోవడం కంటే భరిస్తూ ముందుకు సాగడం వల్ల ఫలితం ఉంటుంది’ అని! అందుకే వర్కవుట్లతో విపరీతంగా అలసిపోయినా దీన్నో సవాలుగా స్వీకరించా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగా. ముఖ్యంగా ట్రైనింగ్‌ సమయంలో నా అంతరాత్మను దృఢపరచుకునే ప్రయత్నం చేశా. అందుకే అలసిపోకుండా రెట్టింపు ఉత్సాహంతో వ్యాయామాలు చేయగలిగా. ఇక ఏదైనా అనుకుంటే అది చేసి తీరడం నాకు అలవాటు! అలా వచ్చిన ఫలితం ఈ కష్టాన్నంతా మరిపిస్తుంది. టైగర్‌-3 చిత్ర విజయం కూడా అలాంటి అనుభూతినే పంచుతుందనుకుంటున్నా. నిజంగా చెప్పాలంటే.. గత సినిమాలు, పాత్రలతో పోల్చితే ఇప్పుడు మరింత ఎక్కువగా కష్టపడ్డా. ప్రతి ప్రయత్నంలోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనుకోవడం మంచిదే కదా!’ అంది కత్రినా.

‘టవల్‌ ఫైట్‌’ కష్టమైంది!

ఇక ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల కోసం వ్యాయామాలే కాదు.. మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి యుద్ధవిద్యల్నీ సాధన చేసింది కత్రినా. ఈ క్రమంలో యాక్షన్‌ డైరెక్టర్‌ ఓ సీ యంగ్‌ వద్ద మెలకువలు నేర్చుకున్న ఆమె.. సినిమాలోని ఓ సన్నివేశంలో అమెరికన్‌ తార మిచెల్‌తో ఫైట్‌ చేయాల్సి వచ్చింది. అయితే అక్కడి వాతావరణం మూలంగా ఆ సీన్‌ చేయడం కాస్త కష్టమే అయిందంటోంది కత్రినా.

‘టైగర్‌-3 సినిమాలో అమెరికన్‌ నటి మిచెల్‌తో ఓ ఫైట్‌ సీన్‌ ఉంది. దీన్ని టర్కీలో చిత్రీకరించారు. ఇందులో భాగంగా ఇద్దరం టవల్స్‌ ధరించి ఫైట్‌ చేయాలి. ఆవిరి ఉన్న గదిలో (స్టీమ్‌ బాత్‌) నేను, మిచెల్‌ చేతులతో కొట్టుకునే సన్నివేశం అది. అయితే ఆవిరి కారణంగా ఒకరినొకరు పట్టుకోవడం, పంచ్‌లు/కిక్స్‌ ఇచ్చుకోవడం, ఒకరినొకరు లేపి భూమిపై పడేయడం.. వంటివన్నీ కష్టమయ్యాయి. ఒక్కోసారి గ్రిప్‌ కోల్పోయి ఇద్దరం జారిపోయేవాళ్లం. అయితే మన సినిమాల్లో ఇలా ఇద్దరు మహిళలు కొట్టుకొనే సీన్‌ ఒకటి ఉంటుందని ముందు నేను ఊహించలేదు.. మొత్తానికి కష్టపడ్డా ఈ సన్నివేశాన్ని ఆస్వాదించా..’ అంటోందీ బాలీవుడ్‌ బ్యూటీ. దర్శకుడు మనీష్‌ శర్మ రూపొందించిన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా (రా ఏజెంట్‌గా) నటించాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్