Published : 13/03/2022 13:07 IST

Operation Ganga: అర్ధరాత్రి ఫోన్‌ చేసి ఆ విషయం చెప్పారు!

(Photos: Facebook, LinkedIn)

ఈ కాలంలో మహిళలు అరుదైన రంగాల్లోకి ప్రవేశించడమే కాదు.. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టే పలు రెస్క్యూ ఆపరేషన్లలోనూ భాగమవుతున్నారు. తద్వారా తాము పురుషులకేమీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల మహాశ్వేత చక్రవర్తి ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఇటీవలే భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ గంగ’ సహాయక చర్యల్లో పాలుపంచుకుంది. ఇందులో భాగంగా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరైన ఉక్రెయిన్‌ నుంచి సుమారు 800 మంది భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చి ఎంతోమంది ప్రముఖుల మన్ననలందుకుంటోంది. ఇలాంటి రిస్క్‌ చేస్తేనే ఉద్యోగంలో సంతృప్తి ఉంటుందని, ఈ ఆపరేషన్‌ ద్వారా జీవితకాలానికి సరిపడా అనుభవాల్ని మూటగట్టుకున్నానంటోన్న ఈ యంగ్‌ పైలట్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

కోల్‌కతాకు చెందిన మహాశ్వేత చక్రవర్తి.. చిన్నతనం నుంచి పైలట్ కావాలని కలలు కంది. అందుకు తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైంది. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉదన్‌ అకాడమీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఆమె.. గత నాలుగేళ్లుగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థలో కో-పైలట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

అర్ధరాత్రి ఫోనొచ్చింది!

పైలట్లంటే యథావిధిగా రోజువారీ విమానాలు నడపడమే కాదు.. అప్పుడప్పుడూ యుద్ధప్రాతిపదికన చేపట్టే కొన్ని రెస్క్యూ ఆపరేషన్లలోనూ భాగం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం చేపట్టింది భారత ప్రభుత్వం. ఇందుకు మహాశ్వేత కూడా ఎంపికైంది.

‘ఓ రోజు అర్ధరాత్రి మా సంస్థ నుంచి నాకు ఫోనొచ్చింది. ఆపరేషన్‌ గంగ కోసం మిమ్మల్ని ఎంపిక చేశామని చెప్పారు. మరో ఆలోచన లేకుండా రెండు గంటల్లో అన్నీ సర్దుకున్నా. వెంటనే పయనమై ఇస్తాంబుల్‌ వెళ్లాను. అక్కడ్నుంచి పోలండ్‌ వెళ్లడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. పోలండ్‌ నుంచే విద్యార్థుల్ని తరలించమని మాకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 7 వరకు మొత్తంగా ఆరు విమానాలు నడిపాను. ఇందులో పోలండ్‌ నుంచి నాలుగు, హంగరీ నుంచి రెండు విమానాల ద్వారా మొత్తం 800 మంది విద్యార్థుల్ని స్వదేశానికి చేర్చాను..’ అంటూ గర్వంగా చెబుతోందీ యంగ్‌ పైలట్.

వాళ్ల ధైర్యానికి సెల్యూట్!

రోజూ 13-14 గంటల పాటు తన విధుల్లో కొనసాగే మహాశ్వేతకు ఈ ఆపరేషన్‌ ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇది చిరకాలం మర్చిపోలేని అనుభూతి అంటోందామె. ‘అందరూ మమ్మల్ని రియల్‌ హీరోస్‌ అంటూ కీర్తిస్తున్నారు. నిజానికి మేం కాదు.. ఉక్రెయిన్‌లో చదువుకునే మన విద్యార్థులే అసలైన హీరోలు! ఎందుకంటే అక్కడి ప్రతికూల పరిస్థితులు, ఆకలి-దప్పికలు, క్షణక్షణం భయంగొల్పే బాంబుల మోతలు.. వీటన్నింటినీ తట్టుకోవడం అసలైన సవాలు! అయితే కొంతమంది విద్యార్థులు మాత్రం యుద్ధభీతిలోనే ఉండిపోయారు. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుతామా అన్న ధ్యాసలోనే మునిగిపోయారు. ఈ భయంతోనే ఒకమ్మాయికి ఫిట్స్‌ కూడా వచ్చాయి. అయితే విమానంలో జూనియర్‌ డాక్టర్స్ ఉండడంతో.. ఆమెకు వెంటనే వైద్యం అందింది. ఏదైతేనేం.. వాటన్నింటినీ ఎదుర్కొని సురక్షితంగా స్వదేశం చేరడం సంతోషకరమైన విషయం..’ అంటూ తన అనుభవాలను పంచుకుందీ డ్యాషింగ్‌ పైలట్.

అది నా అదృష్టం!

కేవలం ఇప్పుడే కాదు.. కరోనా సమయంలో ప్రభుత్వం చేపట్టిన ‘వందే భారత్‌’ మిషన్‌లోనూ భాగమైంది మహేశ్వరి. ఈ క్రమంలోనే వివిధ దేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి చేర్చడంతో పాటు విదేశాల నుంచి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌, వ్యాక్సిన్లు, ఇతర మందుల్ని మన దేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ‘నా వృత్తిలో భాగంగా ఇలా సమాజానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ క్రమంలో నాపై నమ్మకముంచి నన్ను ఎంచుకున్న మా సంస్థకు కృతజ్ఞతలు!’ అంటోంది మహేశ్వరి. ఇలా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన ఈ లేడీ పైలట్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు ప్రముఖులు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని