గట్టిగా అనుకుంది... చేసేస్తోంది..!

చిన్నప్పుడు విభా ఇంటి ముందు ఆడుకుంటుండగా రక్తమోడుతోన్న ఓ వీధి కుక్క ఆమె దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో అమ్మానాన్నలు ఇంట్లో లేకపోవడం, చిన్నపిల్లైన తనకేం చేయాలో తెలియక ఓ నిస్సహాయురాలిగా ఆ మూగజీవిని చూస్తూ ఉండిపోయింది.

Updated : 12 Oct 2021 19:52 IST

(Photo: Instagram)

చిన్నప్పుడు విభా ఇంటి ముందు ఆడుకుంటుండగా రక్తమోడుతోన్న ఓ వీధి కుక్క ఆమె దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో అమ్మానాన్నలు ఇంట్లో లేకపోవడం, చిన్నపిల్లైన తనకేం చేయాలో తెలియక ఓ నిస్సహాయురాలిగా ఆ మూగజీవిని చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపయ్యాక కుక్కను ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. అప్పుడే తన మనసులో గట్టిగా అనుకుంది జంతువుల ప్రాణాలను కాపాడేందుకైనా వెటర్నరీ డాక్టర్‌ అవ్వాలని..!

మూగజీవాల కడుపు నింపుతూ!

లాక్‌డౌన్లలో వైరస్‌ భయంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. హోటళ్లు, రెస్టరంట్లు కూడా మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై కనిపించే అరకొర ఆహారంతో కడుపు నింపుకొనే వీధి కుక్కలు ఆకలితో అలమటించిపోయాయి. దీనికి తోడు జంతువుల ద్వారా కరోనా సోకుతుందేమోనన్న అపోహల కారణంగా చాలామంది వీటిని దగ్గరికి రానీయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వందలాది వీధి కుక్కలతో పాటు రోడ్డుపై కనిపించే పిల్లులు, కోతులకు ఆహారాన్ని అందించింది దిల్లీకి చెందిన 23 ఏళ్ల విభా తోమర్‌. కరోనా మొదటి దశలో రోజూ 350కు పైగా మూగ జీవాలకు ఆహారాన్ని సమకూర్చిన ఆమె వైరస్‌ రెండో దశ వ్యాప్తిలో ఏకంగా 500కు పైగా వీధి జంతువులకు ఆహార సదుపాయాలు ఏర్పాటుచేసింది.

ఆ దృశ్యం చూసి..

‘నేను రాజస్థాన్‌లోని ఆరావళి వెటర్నరీ కళాశాలలో నాలుగో ఏడాది చదువుతున్నాను. కరోనా మొదటి దశ ప్రారంభం కాగానే నా సొంతూరు (దిల్లీ)కి వచ్చేశాను. అప్పటికే సూపర్‌ మార్కెట్లు, హోటళ్లు, రెస్టరంట్లు మూతపడ్డాయి. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. మూగ జీవాలకు ఆహారమే లేకుండా పోయింది. కొన్ని చెత్త కుండీల దగ్గరైతే కుక్కలు కొట్లాడుకోవడం కనిపించింది. దీంతో రైస్‌, చికెన్‌ మిక్స్ చేసి తీసుకెళ్లి మా ఇంటి సమీపంలోని వీధి కుక్కలకు అందించాను. మొదటి రోజు మొత్తం 50 వీధి కుక్కలు, పిల్లులకు ఆహారం సమకూర్చాను. ఆ తర్వాత క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూ పోయింది. తమ ప్రాంతాల్లోని వీధి కుక్కలను కూడా ఆదుకోవాలని చాలామంది సోషల్‌ మీడియాలో సందేశాలు పంపారు. అదేవిధంగా వారికి తోచిన విరాళాలు కూడా పంపించారు. కరోనా మొదటి దశలో రోజూ 350కు పైగా వీధి కుక్కలు, పిల్లులు, కోతులకు సోయా ముక్కలు, బ్రెడ్‌, పాలు అందించాను. ఇక సెకండ్‌ వేవ్‌లో కొందరి స్నేహితుల సహకారంతో 500కు పైగా జంతువులకు ఆహార సదుపాయాలు ఏర్పాటుచేశాను. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత నాలాగే మరికొంతమంది జంతు ప్రేమికులు ముందుకొచ్చారు. దీంతో నా మీద భారం కొద్దిగా తగ్గింది. ప్రస్తుతం నా దగ్గర 5 కుక్కలు, 3 పిల్లులు ఉన్నాయి. వీటితో పాటు నా ఇంటి సమీపంలో ఉండే కొన్ని మూగజీవాలకు క్రమం తప్పకుండా ఆహారాన్ని అందిస్తున్నాను’ అని చెప్పుకొచ్చిందీ పెట్‌ లవర్.

వాటికోసం ప్రత్యేక నెట్స్!

విభా తన పెట్‌ డాగ్‌ ఆస్కార్‌ జ్ఞాపకార్థం ‘ఆస్కార్‌ ఫర్ లైఫ్‌’ అనే పేరుతో కొన్నేళ్ల క్రితం ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కూడా ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా మూగ జీవాల దాహార్తిని తీర్చేందుకు రహదారుల వెంబడి వందలాది నీటి తొట్టెలు నిర్మించింది. ఇక చలిగాలుల నుంచి రక్షణ పొందేందుకు గాను వీధికుక్కల కోసం టైర్‌బెడ్స్ (పాత టైర్లతో ప్రత్యేకమైన పరుపులు), పిల్లుల కోసం క్యాట్‌ బోర్డులు ఏర్పాటుచేసింది. ఇక రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వీధి కుక్కల మెడ చుట్టూ రేడియం బ్యాండ్లను తగిలిస్తోంది.

‘గాయపడిన జంతువులను కాపాడాలని, చికిత్స చేయించాలని చాలామందికి ఉంటుంది. కానీ అవెక్కడ కరుస్తాయేమోనని వాటి దగ్గరకు వెళ్లడానికే జంకుతుంటారు. ఇలాంటి వారి కోసం నేను యానిమల్‌ క్యాప్చరింగ్‌ నెట్స్‌ను తయారుచేస్తున్నాను. సాధారణంగా జంతువులను పట్టుకోవడానికి ఉపయోగించే వలలు చాలా కఠినంగా ఉంటాయి. ఉచ్చులో చిక్కుకున్నప్పుడు వాటికి గాయాలు కూడా తగులుతుంటాయి. కానీ నేను రూపొందించే వల ఎంతో సున్నితంగా ఉంటుంది. దీనివల్ల మూగజీవాలకు ఎలాంటి అసౌకర్యం కలగదు. ఎంతో సులభంగా వీధి కుక్కలను పట్టుకోవచ్చు’ అని తన భవిష్యత్‌ ప్రణాళికలు చెప్పుకొచ్చిందీ యానిమల్‌ లవర్.

వెటర్నరీ కోర్సు పూర్తయ్యాక జంతువుల కోసం సొంతంగా ఓ పెద్ద షెల్టర్‌ను కట్టించాలనుకుంటోంది విభా తోమర్‌. అందులోనే మూగజీవాలకు అవసరమైన ఆహారం, వైద్యం తదితర సౌకర్యాలు సమకూరుస్తానంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్