ఆగిపోయిన ఆ పిల్లల చదువుల కోసం..!

పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు కరోనా కారణంగా ఇళ్లలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు చేతుల్లో పట్టుకుని డిజిటల్ తరగతులకు హాజరవుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది...మరి స్మార్ట్‌ఫోన్లు, నెట్‌ కనెక్షన్లు లేని పిల్లల పరిస్థితేంటి? వారు చదువుకు దూరమవ్వాల్సిందేనా?...సరిగ్గా ఇలాగే ఆలోచించింది ముంబయికి చెందిన 17 ఏళ్ల అరియా గుప్తా.

Published : 13 Aug 2021 17:29 IST

(Photos: ariagupta.info)

పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు కరోనా కారణంగా ఇళ్లలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు చేతుల్లో పట్టుకుని డిజిటల్ తరగతులకు హాజరవుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది... మరి స్మార్ట్‌ఫోన్లు, నెట్‌ కనెక్షన్లు లేని పిల్లల పరిస్థితేంటి? వారు చదువుకు దూరమవ్వాల్సిందేనా?... సరిగ్గా ఇలాగే ఆలోచించింది ముంబయికి చెందిన 17 ఏళ్ల అరియా గుప్తా.

పిల్లల చదువులు ఆగిపోకూడదని!

ఓ పాఠశాలలో రోబోటిక్ మెంటర్‌గా పని చేస్తోన్న ఈ టీనేజర్‌ తన దగ్గర చదువుతోన్న పేద విద్యార్థుల భవిష్యత్‌ కరోనా కారణంగా ప్రమాదంలో పడకూడదనుకుంది. వారి ఆన్‌లైన్‌ పాఠాల కోసం ట్యాబ్లెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయించుకుంది. అందుకే ప్రముఖ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఇంపాక్ట్‌గురు. కామ్‌’ ద్వారా విరాళాలు సేకరిస్తోంది.

‘రోబో’ పాఠాలు చెబుతూ!

ఆదిత్య బిర్లా వరల్డ్‌ అకాడమీ స్టూడెంట్‌ అయిన అరియాకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంటే బాగా ఆసక్తి. నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలని పరితపిస్తుంటుంది. ఈ క్రమంలోనే రోబోటిక్‌ టెక్నాలజీలో విశేష ప్రావీణ్యం సంపాదించింది. సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ సైన్స్‌ క్యాంప్‌తో పాటు పలు రోబోటిక్‌ కాంపిటీషన్లలోనూ పాల్గొంది. ఇలా ఒకవైపు టెక్నాలజీ పాఠాలు నేర్చుకుంటూనే మరోవైపు 2018 నుంచి శ్రీ శ్రీ రవిశంకర్‌ విద్యా మందిర్ (SSVRM) పాఠశాలలో రోబోటిక్‌ మెంటర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇందులో భాగంగా తన బృందం సహాయంతో STEM (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మేథమేటిక్స్‌) టెక్నాలజీ, రోబోల డిజైనింగ్‌, ప్రోగ్సామింగ్పై పిల్లలకు శిక్షణ అందిస్తోంది.

వారి కష్టాలేంటో తెలుసుకున్నాను!

అరియా దగ్గర శిక్షణ పొందుతున్న పిల్లల్లో చాలామంది ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావికి చెందిన వారే. గత కొన్నేళ్లుగా వారిని దగ్గర్నుంచి గమనించిన ఆమె...పిల్లల జీవన స్థితిగతులు, కుటుంబ నేపథ్యం, చదువుకునేందుకు వారు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుంది. అందుకే ఆ పేద పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించేదామె.

‘మా పాఠశాలలో మొత్తం 450 మంది పిల్లలు ఉంటారు. అందులో చాలామంది ధారావి మురికివాడతో పాటు పేద కుటుంబాల నుంచి వచ్చినవారే. పాఠశాలకు రావడానికి వారు పడుతున్న కష్టాలేంటో నాకు బాగా తెలుసు. అందుకే కరోనా కారణంగా వారి చదువులు ఆగిపోకూడదనుకున్నాను. ఆన్‌లైన్‌ తరగతులను అందరికీ చేరువ చేద్దామనుకున్నాను’..

ఆ పిల్లల ఆన్‌లైన్‌ పాఠాల కోసం..

‘మా విద్యార్థుల్లో చాలామంది తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్లలోనే పాఠాలు వింటున్నారు. మరికొందరికి స్కూల్‌ తరఫున సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్లు అందించి ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేలా చేశాం. అయితే అప్పుడే 8-10 తరగతులకు చెందిన ఓ 15 మంది విద్యార్థులు రెగ్యులర్‌గా ఈ ఆన్‌లైన్‌ పాఠాలకు హాజరవ్వట్లేదని తెలిసింది. కారణమేంటో తెలుసుకుందామని మా సిబ్బందిని ధారావిలోని వారి ఇళ్లకు పంపాం. ఆన్‌లైన్‌ తరగతులకు అవసరమైన సౌకర్యాలేవీ వారి ఇళ్లలో లేవని తెలిసింది. అప్పుడే వారికి ఉచితంగా ట్యాబ్లెట్లను అందిద్దామని నిర్ణయించుకున్నాను. ఇందుకోసం ప్రముఖ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఇంపాక్ట్‌ గురు.కామ్‌’ సహాయం తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చిందీ టీనేజర్.

మళ్లీ చదువుకుంటారు!

నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌లో మొదట 1.50 లక్షల రూపాయలను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది అరియా. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి దాతలు బాగానే స్పందిస్తున్నారు. ఇప్పటివరకు 1.13 లక్షల రూపాయలు విరాళాలుగా అందాయి. ‘త్వరలోనే మేం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటాం. ఆగిపోయిన ఆ పేద పిల్లల చదువులు మళ్లీ ప్రారంభమవుతాయి’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది అరియా.

ఈ సందర్భంగా అరియా కృషిని అభినందిస్తూ క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫీజును కూడా రద్దు చేశారు ఇంపాక్ట్‌ గురు.కామ్‌ సహ వ్యవస్థాపకురాలు ఖుష్బూ జైన్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్