Updated : 21/04/2022 15:04 IST

Twitter Girl: ఈ ‘లేడీ’ సోనూసూద్ గురించి విన్నారా?

(Photo: Twitter)

‘అన్నా.. నా కష్టం ఇదీ!’ అని ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు.. క్షణాల్లో స్పందించి సహాయం అందిస్తుంటాడు బాలీవుడ్‌ కండల వీరుడు సోనూసూద్‌. ఇదే తరహాలో తన గ్రామ ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా తానున్నానని అండగా నిలబడుతోంది ఒడిశాకు చెందిన చారుబాలా బారిక్‌/దీపా బారిక్‌. ఒక్క ట్వీట్‌తో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తోందామె. ఇలా ఇప్పటివరకు కొన్ని వేల సమస్యల్ని పరిష్కరించి అక్కడి ప్రజలతో ‘ట్విట్టర్‌ గర్ల్‌’ అని ముద్దుగా పిలిపించుకుంటోంది. కష్టం చిన్నదైనా, పెద్దదైనా వేగంగా స్పందించి దాన్ని ఆ గ్రామ పొలిమేర దాటిస్తోన్న బారిక్‌.. సమాజ సేవలోనే సంతోషం, సంతృప్తి దాగున్నాయని చెబుతోంది.

పెరిగి పెద్దయ్యే క్రమంలో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరికి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఉంటే.. మరికొందరు సమాజ సేవలోనే సంతృప్తిని వెతుక్కుంటుంటారు. ఒడిశాలోని తెమ్రి గ్రామానికి చెందిన చారుబాలా బారిక్‌ రెండో కోవకు చెందుతుంది.

ఆ ఫోనే టర్నింగ్‌ పాయింట్!

చిన్న వయసు నుంచే సమాజ సేవ పట్ల ప్రేమ పెంచుకున్న చారుబాలాకు దీపా బారిక్‌ అనే మరో పేరు కూడా ఉంది. ఆమె తండ్రి రైతు.. తల్లి అంగన్‌వాడీ కార్యకర్త. స్కూలింగ్‌ దశ నుంచే చదువులో, ఇతరులకు సహాయపడడంలో ముందుండే తమ కూతురిని చూసి ఎప్పటికప్పుడు ఉప్పొంగిపోయే వారు ఆమె తల్లిదండ్రులు. ఈ క్రమంలో వివిధ రకాల బహుమతులిస్తూ ఆమెను సర్‌ప్రైజ్‌ చేసేవారు. అలా 2019లో తమ పేరెంట్స్‌ దగ్గర్నుంచి ఓ స్మార్ట్‌ఫోన్‌ గిఫ్ట్‌గా అందుకుందీ ఒడిశా గర్ల్‌. ఆపై ట్విట్టర్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల గురించి అవగాహన పెంచుకుంది. ఈ క్రమంలోనే దీన్ని ఉపయోగించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచన వచ్చిందామెకు. అనుకున్నదే తడవుగా ఈ మంచి పనికి శ్రీకారం చుట్టింది బారిక్.

వాటిపై అవగాహన పెంచుకొని..!

అయితే ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే.. అందుకు ప్రభుత్వం ప్రజల కోసం ప్రారంభించిన పథకాలపై అవగాహన పెంచుకోవాలి. తొలుత వీటి పైనే దృష్టి పెట్టింది బారిక్‌. ఈ క్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 5T Model (పారదర్శకత, బృంద కృషి, సాంకేతికత, సమయపాలన.. వంటి అంశాల్ని ఉపయోగించి ప్రజా జీవితాల్లో మార్పు తీసుకురావడం..) గురించి తెలుసుకుందామె. అలాగే దీనికి అనుసంధానిస్తూ మొదలుపెట్టిన ‘My Government Initiative (అధికారుల నుంచి అందుతోన్న సేవల గురించి ప్రజల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడానికి రూపొందించిన కార్యక్రమం)’ గురించి అవగాహన పెంచుకుంది. ఇలా వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని.. ప్రజా సమస్యలపై దృష్టి సారించిందీ ఒడిశా గర్ల్‌. ఈ క్రమంలో ఆర్జీ పెట్టుకున్నా పరిష్కారం కాని సమస్యల గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. సంబంధిత అధికారుల అకౌంట్స్‌ను దీనికి ట్యాగ్‌ చేస్తూ.. ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది బారిక్.

కష్టం వస్తే ఆమె తలుపు తడతారు!

వృద్ధులకు పెన్షన్‌ సకాలంలో అందేలా చూడడంతో మొదలుకొని.. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఓ నీడను కల్పించేదాకా.. ఇలా బారిక్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని సమస్యంటూ లేదంటే అది అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే పక్క గ్రామానికి చెందిన ఓ ఇల్లాలు తన భర్తను కోల్పోయి ఐదుగురు పిల్లలతో రోడ్డున పడింది. ఈ సమస్యను ఆమె బారిక్‌తో పంచుకోగా.. ట్విట్టర్‌ వేదికగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందామె. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి వారం రోజుల్లోనే ఆ పిల్లలకు ‘ఆశీర్వాద్‌ యోజన’ కింద తలా రూ. 1500 చొప్పున అందేలా చొరవ చూపింది.

ఇక మరో సందర్భంలో.. ఫణి తుపాను కారణంగా గూడు కోల్పోయిన ఓ జంట వెతల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె ట్వీట్‌కు ప్రభుత్వం 48 గంటల్లోనే స్పందించి సహాయ సహకారాలు అందించడం విశేషం. ఈ క్రమంలోనే కూలిపోయిన ఇంటిని పునర్నిర్మించుకోవడానికి సదరు కుటుంబానికి సుమారు లక్ష రూపాయల దాకా సహాయం అందింది.

అలాగే.. ఓ మానసిక వికలాంగురాలికి అంగ వైకల్య పింఛను అందే ఏర్పాటు కూడా చేసింది. ఇలా ఇప్పటిదాకా మూడు వేలకు పైగానే ప్రజా సమస్యల్ని పరిష్కరించిందీ ట్విట్టర్‌ గర్ల్.

అందుకే రోజూ పేపర్‌ చదువుతా!

ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే అసలు సమస్య ఎక్కడుందో తెలియాలి. అందుకే రోజూ న్యూస్‌ పేపర్‌ చదువుతానంటోంది బారిక్‌. ‘ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నేను రోజూ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుంటా. అక్కడి ప్రజలతో మమేకమవుతా. మరోవైపు వార్తాపత్రికల ద్వారా కూడా ప్రజల వెతలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా. అయితే చాలామంది అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, వారి పనులు పూర్తి చేయడానికి నెలల సమయం తీసుకుంటారు. పైగా డబ్బు డిమాండ్‌ చేస్తుంటారు. ఇదంతా తెర వెనుక జరిగే ప్రక్రియ. దీని గురించి ఎవరికీ తెలియదు కూడా! అదే సంబంధిత అధికారిని ట్యాగ్‌ చేస్తూ సమస్య గురించి ట్వీట్‌ చేస్తే.. ఇలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు.. ఏ పనైనా గంటల్లో, రోజుల్లో పూర్తవుతుంది. ఇలాంటి పారదర్శకతను సోషల్‌ మీడియా మనకు అందిస్తోంది. కాబట్టి మీకు, మీ ఇరుగు పొరుగు వారికి ఎలాంటి సమస్య ఉన్నా.. ప్రభుత్వాన్ని ట్యాగ్‌ చేస్తూ ఒక్క ట్వీట్‌ చేయండి చాలు.. వెంటనే పరిష్కారమవుతుంది!’ అంటోందీ ఒడిశా టీన్‌. ఇలా తన సేవలకు గుర్తింపుగా ప్రముఖుల ప్రశంసలే కాదు.. పలు అవార్డులు, రివార్డులు కూడా అందుకుంది బారిక్.

ప్రస్తుతం సైన్స్‌ విభాగంలో మాస్టర్స్‌ చదువుతోన్న బారిక్‌ భవిష్యత్తులో ప్రొఫెసర్‌గా సేవలందించాలనుకుంటోంది. ఓవైపు చదువు కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రజా సేవలో సంతృప్తిని వెతుక్కుంటూ ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపుతోంది.

హ్యాట్సాఫ్‌ ట్విట్టర్‌ గర్ల్!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని