ఫోన్‌తో ఫొటోలే కాదు.. క్షణాల్లో ప్రింట్‌ కూడా..!

మనం ఏదైనా ఫంక్షన్‌కో.. శుభకార్యానికో.. వెళతాం. అక్కడ మన స్నేహితులతో, బంధువులతో ఫొటో దిగి.. క్షణాల్లో ప్రింట్‌ కూడా చేతికి వస్తే ఆశ్చర్యమే కదా..! ఫొటో ప్రింటింగ్‌కు మెషీన్ లెర్నింగ్‌ సాంకేతికత జోడించి క్షణాల్లో ప్రింట్‌ తీసుకునే ఇలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు 'పీపుల్ ఆఫ్ ప్రింట్స్'  వ్యవస్థాపకురాలు నేహా షా. ఫొటోలను సృజనాత్మకంగా, వివిధ రూపాల్లో ప్రింట్‌ తీయడంతో....

Published : 07 Jan 2023 12:52 IST

మనం ఏదైనా ఫంక్షన్‌కో.. శుభకార్యానికో.. వెళతాం. అక్కడ మన స్నేహితులతో, బంధువులతో ఫొటో దిగి.. క్షణాల్లో ప్రింట్‌ కూడా చేతికి వస్తే ఆశ్చర్యమే కదా..! ఫొటో ప్రింటింగ్‌కు మెషీన్ లెర్నింగ్‌ సాంకేతికత జోడించి క్షణాల్లో ప్రింట్‌ తీసుకునే ఇలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు 'పీపుల్ ఆఫ్ ప్రింట్స్'  వ్యవస్థాపకురాలు నేహా షా. ఫొటోలను సృజనాత్మకంగా, వివిధ రూపాల్లో ప్రింట్‌ తీయడంతో పాటు గోడలకు డ్యామేజ్‌ కాకుండా వాటిని అంటించేందుకు  వివిధ రకాల మ్యాగ్నెటిక్ ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తన బిజినెస్ జర్నీ గురించి వసుంధర.నెట్ తో ప్రత్యేకంగా పంచుకున్నారు నేహ. ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే విందాం రండి..

నేను పుట్టింది ముంబయిలోనే అయినప్పటికీ.. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నగరంలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశాక.. నేషనల్‌ లా స్కూల్‌లో న్యాయవిద్య పూర్తి చేశా. లా చదువుతున్నా ఎప్పటికైనా వ్యాపారవేత్తగా మారాలనే ఆలోచన ఉండేది. అందుకే వ్యాపార నైపుణ్యాలు పెంచుకునేందుకు ఐఎస్‌బీతో పాటు బెంగళూరులోని ఐఐఎం నుంచి ఆంత్రప్రెన్యూర్‌షిప్ కోర్సు చేశా.  చదువు ముగిసిన తర్వాత కొన్నాళ్లు పని చేయాలనుకున్నా. కానీ నాన్న ఉద్యోగం వద్దని, ఏదైనా సొంతంగా అంకుర సంస్థ ప్రారంభించాలని సూచించారు. ఆయన మాటలతో నేను మరో మార్గం ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మధ్యలో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరినా.. నా ఆలోచనలన్నీ వ్యాపారం వైపే ఉండటంతో 9 నెలల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేశా.

అలా మొదలైంది...

ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో, ఏదైనా వినూత్నంగా ఉండే వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. 2009లో హైదరాబాద్‌లో పిల్లలకు సమ్మర్‌ క్యాంపుల నిర్వహణ చేపట్టా. నగర వ్యాప్తంగా 25 కేంద్రాలు నడిపాను. అయితే ఈ విషయాలపై అంతగా అనుభవం లేకపోవడంతో.. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఇబ్బందిపడ్డా. రెండేళ్లపాటు నిర్వహించి తర్వాత విరమించుకున్నా. అనంతరం కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ వ్యాపారం ప్రారంభించాను. ఈక్రమంలో కొన్ని ఈవెంట్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది ఫొటోలు తీసుకుని, వెంటనే వాటి ప్రింట్ కూడా కావాలనుకోవడం గమనించాను. ఈ నేపథ్యంలో- ఫొటో తీసిన క్షణాల్లోనే ప్రింట్ తీసుకునే సౌకర్యం ఉంటే బాగుంటుంది కదా.. అనే ఆలోచన వచ్చింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో మంచి నాణ్యతతో కూడిన కెమెరా ఉంటోంది. అలాగే పిల్లల నుంచి వృద్ధుల వరకు వాట్సాప్‌ వినియోగం తెలుసు. ఫోన్‌లో ఫొటో తీసుకుని.. దాన్ని వాట్సాప్‌ చేస్తే చాలు.. ప్రింట్‌ అయ్యేలా సాంకేతికత రూపొందించాలనుకున్నా. ఈక్రమంలో కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి, మెషీన్ లెర్నింగ్‌ సాంకేతికతను ఉపయోగించి.. సాధారణ ప్రింటర్‌నే స్మార్ట్ ప్రింటర్‌గా రూపొందించాం. దీని సాయంతో ఫోన్‌లో తీసుకున్న ఫొటోను నేరుగా.. నిర్దేశిత నంబరుకు వాట్సాప్‌ చేస్తే చాలు ప్రింటర్‌ నుంచి ప్రింట్‌ వస్తుంది. ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించి ప్రింట్‌ చేయించాల్సిన అవసరం ఉండదు. అలాగే దీనికోసం ఎలాంటి యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసే ఫొటోలు సైతం క్షణాల్లోనే ప్రింట్‌ తీసుకోవచ్చు.

వివిధ నగరాల్లో..

పార్టీలు, ఫంక్షన్లు.. ఇలా వివిధ సందర్భాలలో వాటిని నిర్వహించే వ్యక్తులు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ పీవోపీ ప్రింటర్‌ని ఆ వేదికగా ఏర్పాటుచేస్తాం. ఉపయోగించే సమయాన్ని బట్టి ఛార్జీలు వర్తిస్తాయి. ఒకవేళ వినియోగదారుల వద్ద సాధారణ ప్రింటర్‌ ఉన్నా దానికి మా టెక్నాలజీని అనుసంధానించి వాట్సాప్ సహాయంతో ఫొటోలు ప్రింట్‌ చేసుకునేలా కూడా పీవోపీ సాంకేతికతను అభివృద్ధి చేశాం. కరోనా సమయంలో కొన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో జరిగే ఈవెంట్స్‌ నుంచి పిలుపు అందుకుంటున్నాం. పెళ్లిళ్లలో ఫొటోగ్రఫీ కోసం లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టలేని వారికి మా పీవోపీ టెక్నాలజీ చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్తా.

ప్రింట్లు ఎందుకన్నారు?

తొలుత వీహబ్‌లో కొంతకాలం ఇంక్యుబేట్‌ అయ్యాక సికింద్రాబాద్‌లో కార్యాలయం ప్రారంభించా. మొదట్లో ఆర్థిక వనరుల సమీకరణకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ముందుకు వెళ్లాను. ప్రస్తుతం నలుగురం కలిసి పని చేస్తున్నాం. నెలకు సుమారు 500 ఆర్డర్ల వరకు వస్తున్నాయి. వ్యాపారం ప్రారంభించిన మొదట్లో ఫొటో ప్రింటింగ్‌ అనేసరికి ఈ రోజుల్లో ప్రింట్లు ఎవరు తీసుకుంటారనే మాటలు వినిపించాయి. కానీ వివిధ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు వందల సంఖ్యలో ఫొటోలు తీసుకునేవారు. అప్పటికప్పుడు వచ్చిన ప్రింట్స్ చూసుకుని మురిసిపోయేవారు.

అవే మా ప్రత్యేకతలు!

ప్రస్తుతం మా పీఓపీ సాంకేతికత సహాయంతో ఫొటోలను మినీ కార్డులు, పోస్ట్‌ కార్డులు, క్యాలెండర్లు, కాన్వాస్‌ ఫొటోల రూపంలో ప్రింట్‌ తీస్తున్నాం. అలాగే వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఫొటోలను వివిధ డిజైన్లలో కస్టమైజ్‌ చేసిస్తాం. వీటితో పాటు పొడవైన ఫొటో స్ట్రిప్‌లు, లైఫ్‌ సైజ్‌ ఫొటో ప్రింట్లు, మ్యాగ్నెటిక్‌ ఫొటో రోప్‌, ప్రీమియం పోలరాయిడ్‌ ప్రింట్లు తీసే సౌకర్యం కూడా మా వద్ద అందుబాటులో ఉంది. ఇక ఈ ఫొటోలను ఫ్రిజ్‌, గోడలపై అమర్చుకోవడానికి వీలుగా వివిధ రకాల మ్యాగ్నెటిక్ ఉత్పత్తులను కూడా అందుబాటులోకి  తీసుకొచ్చాము. వీటిని ఉపయోగించడం ద్వారా గోడలకు మేకులు కొట్టాల్సిన అవసరం ఉండదు.  ఫలితంగా  గోడలు పాడవకుండా ఉంటాయి.  భవిష్యత్తులో పీవోపీ సాంకేతికతను మరింత విస్తరించాలని ఆశిస్తున్నాం.

ఆ ఆలోచన వద్దు!

ప్రస్తుతం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారికి నాది ఒక్కటే సలహా. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టు వదలకుండా ముందుకు సాగితే కచ్చితంగా విజయం సాధించే వీలుంటుంది. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే.. అనే ఆలోచన సరికాదు.

- యార్లగడ్డ అమరేంద్ర, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్