Guinness Record: ఏకధాటిగా ఐదు రోజులు డ్యాన్స్ చేసింది!
డ్యాన్స్.. నిరంతరాయంగా ఎన్ని గంటలు చేయగలం? మహా అయితే గంట లేదా రెండు గంటలు! కానీ మహారాష్ట్రకు చెందిన పదహారేళ్ల సృష్టి సుధీర్ మాత్రం ఏకధాటిగా ఐదు రోజులు నృత్యం చేసింది. ఎందుకో తెలుసా? గత గిన్నిస్ రికార్డును బద్దలు.....
(Photos: Instagram)
డ్యాన్స్.. నిరంతరాయంగా ఎన్ని గంటలు చేయగలం? మహా అయితే గంట లేదా రెండు గంటలు! కానీ మహారాష్ట్రకు చెందిన పదహారేళ్ల సృష్టి సుధీర్ మాత్రం ఏకధాటిగా ఐదు రోజులు నృత్యం చేసింది. ఎందుకో తెలుసా? గత గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టడానికి! శాస్త్రీయ నృత్యంలో ఆరితేరిన ఆమె.. తన డ్యాన్స్ నైపుణ్యాల్ని, దేశ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలని కంకణం కట్టుకుంది. ఈ ఆలోచనతోనే ఏకంగా ప్రపంచ రికార్డుకే గురిపెట్టిన ఆమె.. ఇటీవలే సఫలీకృతురాలైంది. 127 గంటలు ఏకధాటిగా డ్యాన్స్ చేసి.. ‘లాంగెస్ట్ డ్యాన్స్ మారథాన్ (వ్యక్తిగత)’ విభాగంలో గిన్నిస్ రికార్డు సృష్టించింది. మరి, ఇంతటి సాహసం ఆమెకెలా సాధ్యమైంది? రండి.. తెలుసుకుందాం!
సృష్టిది మహారాష్ట్రలోని లాతూర్. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోన్న ఆమెకు చిన్న వయసు నుంచే కళలపై పట్టు ఎక్కువ. ముఖ్యంగా డ్యాన్స్, నటనపై మక్కువ చూపిన సృష్టి.. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో నిర్వహించిన నృత్య పోటీల్లో 70కి పైగా అవార్డులు గెలుచుకుంది. అటు స్కూల్లోనూ, ఇటు పలు పోటీల్లోనూ ఏకపాత్రాభినయం చేస్తూ.. తన నటనతో సమాజంలోని వివిధ సమస్యలపై అందరిలో అవగాహన కల్పించేది.
‘లవని’ డ్యాన్స్‌లో మేటి!
సృష్టికి పలు భారతీయ శాస్త్రీయ, జానపద నృత్య కళల్లో ప్రవేశముంది. మహారాష్ట్రకు చెందిన జానపద నృత్య కళ అయిన ‘లవని’ అందులో ఒకటి. తొమ్మిది గజాల నౌవారీ చీర ధరించి.. సంప్రదాయబద్ధమైన పాటకు జానపద స్టెప్పులేయడం ఈ డ్యాన్స్ ప్రత్యేకత! ఈ నృత్య కళలో పట్టు సాధించిన ఆమె.. రెండేళ్ల క్రితం ఇందులో అరుదైన రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఏకధాటిగా 27 గంటల పాటు నృత్యం చేసి.. ‘లాంగెస్ట్ లవనీ డ్యాన్స్ మారథాన్ (వ్యక్తిగత)’ విభాగంలో ‘ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ కెక్కింది. గంటగంటకూ మూడు నిమిషాల విరామం తీసుకుంటూ అలుపు లేకుండా ఆమె చేసిన ప్రదర్శన అప్పట్లో వైరలైంది. ఆపై జాతీయంగా, అంతర్జాతీయంగా పలు డ్యాన్స్ ప్రదర్శనలతోనూ ఆకట్టుకుందీ మరాఠా డ్యాన్సర్.
‘గిన్నిస్’ రికార్డే లక్ష్యంగా!
తన డ్యాన్స్ నైపుణ్యాల్ని, తద్వారా దేశ శాస్త్రీయ నృత్య కళల ప్రాముఖ్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న పట్టుదల సృష్టిలో ఎక్కువ. ఇదే ఆమెను ఇటీవల ‘గిన్నిస్’ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగేలా చేశాయి. స్థానికంగా తన కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ డ్యాన్స్ మారథాన్‌లో.. ఏకధాటిగా ఐదు రోజుల పాటు నృత్యం చేసింది సృష్టి. ఈ డ్యాన్స్ మారథాన్‌లో భాగంగా.. 127 గంటల పాటు కథక్ నృత్యాన్ని ప్రదర్శించిందామె. తద్వారా ‘లాంగెస్ట్ డ్యాన్స్ మారథాన్ (వ్యక్తిగత)’ విభాగంలో గత గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి.. సరికొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు.. నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి బందానా పేరిట ఉంది.
15 నెలల కృషికి ఫలితమిది!
డ్యాన్స్‌పై ఎంత పట్టున్నా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నా.. రోజుల తరబడి నృత్యం చేయడమంటే మాటలు కాదు. నిద్ర, విశ్రాంతిని త్యాగం చేసి మరీ ఈ సాహసం చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం 15 నెలల పాటు శ్రమించానంటోంది సృష్టి.
‘దేశ నృత్య కళను విశ్వవ్యాప్తం చేసినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ రికార్డు కోసమే ఎప్పట్నుంచో కలలు కంటున్నా. సుమారు 15 నెలల నుంచీ దీని కోసం సన్నద్ధమయ్యా. నిద్రను అదుపు చేసుకోవడానికి మా తాతయ్య సూచనల మేరకు యోగనిద్ర సాధన చేశాను. రాత్రి 10కి పడుకొని ఉదయాన్నే 3 గంటలకు నిద్ర లేచేదాన్ని. రోజూ ఆరు గంటలు డ్యాన్స్ సాధన, మూడు గంటలు వివిధ రకాల వ్యాయామాలు సాధన చేశాను. ఇక ఈ 127 గంటల డ్యాన్స్ మారథాన్‌లో భాగంగా.. కొన్ని గంటలకోసారి ఐదు నిమిషాల పాటు విరామం తీసుకునేదాన్ని. అది కూడా అర్ధరాత్రి సమయంలోనే! రోజంతా ఉత్సాహంగా ఉండడానికి విరామ సమయాల్లో కొబ్బరి నీళ్లు, చాక్లెట్.. వంటివి తీసుకునేదాన్ని. తొలి నాలుగు రోజులు ఎంతో యాక్టివ్‌గా ఉన్నా. కానీ ఐదో రోజు మాత్రం నీరసించిపోయా. శరీరం బిగుసుకుపోయినట్లు, కాళ్లలో నొప్పులు వేధించాయి. అయినా మానసిక స్థైర్యంతో లక్ష్యాన్ని పూర్తి చేశా. నేను చేసిన కఠోర సాధనే ఈ సమయంలో నాకు బాగా ఉపయోగపడింది. అలాగే నా విజయంలో అమ్మానాన్నలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం ఎంతో!’ అంటూ చెప్పుకొచ్చిందీ డ్యాన్సర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.