Breakup: ఆ బాధ నుంచి ఇలా బయటపడేయండి..!

ఒక వ్యక్తిని ఇష్టపడడానికి ఇతరుల సహాయం అవసరం ఉండకపోవచ్చు. కానీ ఇష్టపడిన వ్యక్తికి దూరమైనప్పుడు, ఆ బాధ నుంచి బయటపడాలంటే స్నేహితుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది తమ ప్రేమను వ్యక్తపరచడానికి, ఆపై బ్రేకప్‌ చెప్పడానికి ఎంతో సమయం....

Published : 22 Dec 2022 12:34 IST

ఒక వ్యక్తిని ఇష్టపడడానికి ఇతరుల సహాయం అవసరం ఉండకపోవచ్చు. కానీ ఇష్టపడిన వ్యక్తికి దూరమైనప్పుడు, ఆ బాధ నుంచి బయటపడాలంటే స్నేహితుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది తమ ప్రేమను వ్యక్తపరచడానికి, ఆపై బ్రేకప్‌ చెప్పడానికి ఎంతో సమయం పట్టడం లేదు. అయితే ఒకరితో బంధం తెగినప్పుడు ఆ బాధ నుంచి బయటపడలేక చాలామంది కుంగిపోతుంటారు. ఇలాంటప్పుడు స్నేహితుల అవసరం ఎంతో ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొంతమంది స్నేహితులు తమ ఫ్రెండ్‌ని ఎలా ఓదార్చాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. ఈ క్రమంలో వారికి కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా...

అవి గుర్తు చేయద్దు..

ఒక వ్యక్తి ప్రేమలో ఉన్న విషయం చాలా సందర్భాల్లో వారి తల్లిదండ్రుల కంటే ముందుగా స్నేహితులకే తెలుస్తుంది. వారు కూడా ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలను స్నేహితుల నుంచే ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఆ ప్రేమ విఫలమైనప్పుడు మాత్రం కొంతమంది ‘జాగ్రత్తగా ఉండమని నేను అప్పుడే చెప్పాను.. నువ్వు నా మాటలు పట్టించుకోలేదు’ అని వారికి పాత విషయాలను గుర్తు చేస్తుంటారు. ఇలాంటి మాటలు వారికి స్వాంతన ఇవ్వకపోగా మరింత బాధపెడుతుంటాయి. కాబట్టి, పాత విషయాలను గుర్తు చేయకుండా, వాటిని మర్చిపోయేలా సహకరించాలంటున్నారు నిపుణులు.

బయటకు తీసుకెళ్లండి...

ప్రేమలో విఫలమైనప్పుడు చాలామంది తమ మాజీతో గడిపిన జ్ఞాపకాలను తలచుకుంటూ బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో స్నేహితులుగా వారు ఆ ఆలోచనల నుంచి బయటపడేలా చేయడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం వారికి ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లడం, నచ్చిన ఆటలు ఆడేలా ప్రోత్సహించడం వంటివి చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల వారు ఆ ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

ఆ ప్రాంతాన్ని వదిలి...

ప్రేమించిన వ్యక్తితో ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. ముఖ్యంగా వారు తిరిగిన ప్రాంతంలో ఈ జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఆ ఆలోచనల నుంచి వారిని బయటకు తీసుకురావాలంటే వారిని ఆ ప్రాంతానికి దూరంగా తీసుకెళ్లడం మంచిది. ఇందుకోసం మీ ఫ్రెండ్‌ని ఏదైనా ట్రిప్‌కు తీసుకెళ్లమని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ అది సాధ్యపడకపోతే వారిని ఒక కంట గమనిస్తూనే వ్యక్తిగత సమయం ఇవ్వమని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది తమ బాధను ఎదుటి వ్యక్తితో పంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు వారు చెప్పే మాటలకు అడ్డు చెప్పకుండా శ్రద్ధగా వినమని సూచిస్తున్నారు.

ఆరోగ్యం కూడా...

బ్రేకప్‌ అనేది మనసుకు కలిగే సమస్య. కానీ దాని ప్రభావం ఆరోగ్యంపై కూడా పడుతుంది. ప్రేమలో విఫలమైన వ్యక్తులు తమ జీవితంలో ఇంకా ఏమీ మిగల్లేదని కుంగిపోతుంటారు. ఈ క్రమంలో సమయానికి ఆహారం తీసుకోవడం మానేస్తుంటారు. కొంతమంది ఎక్కువగా తినేస్తుంటారు. రెండూ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి, ఈ విషయంలో మీ వంతు తోడ్పాటు అందించి వారికి సహాయపడచ్చంటున్నారు నిపుణులు.

నిపుణుల వద్దకు..

ఒక్కొక్కరి దృక్కోణం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి, కొన్ని సందర్భాల్లో ఎన్ని జాగ్రత్తలు పాటించినా అవతలి వ్యక్తిలో మార్పు రాకపోవచ్చు. మీ ఫ్రెండ్‌ విషయంలో కూడా మీ ప్రయత్నాలు ఫలించకపోతే వెంటనే నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. వారు అన్ని వివరాలు అడిగి తగిన పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్