పదేళ్ల వయసులోనే రెడ్ కార్పెట్ పైన మెరిసిపోతూ..!

ఇది సామాజిక మాధ్యమాల యుగం. వీటి ద్వారా ఎంతోమంది తమ ప్రతిభను చాటుకుని ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. ఈ క్రమంలో తమకు ఇష్టమైన రంగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తద్వారా వయసుతో సంబంధం లేకుండా సెలబ్రిటీలుగా మారుతున్నారు.

Published : 07 Oct 2023 12:05 IST

(Photos: Instagram)

ఇది సామాజిక మాధ్యమాల యుగం. వీటి ద్వారా ఎంతోమంది తమ ప్రతిభను చాటుకుని ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. ఈ క్రమంలో తమకు ఇష్టమైన రంగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తద్వారా వయసుతో సంబంధం లేకుండా సెలబ్రిటీలుగా మారుతున్నారు. మియామీకి చెందిన టేలన్ బిగ్స్ కూడా ఇదే కోవకు చెందుతుంది. కేవలం పదేళ్ల వయసులోనే ప్రముఖ ఫ్యాషన్ వీక్స్‌లలో పాల్గొంటూ సందడి చేస్తోంది. అలాగే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ క్రమంలో ఇటీవలే ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఈ చిన్నారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా...

ఫ్యాషన్‌ వీక్‌ అనగానే ప్రపంచంలోని అందాల తారలు సరికొత్త డిజైన్లతో రూపొందించిన దుస్తులు ధరించి రెడ్‌కార్పెట్‌పై సందడి చేస్తుంటారు. ఇందులో ప్యారిస్ ఫ్యాషన్‌ వీక్‌కు ఆదరణ ఎక్కువ. ఇటీవలే జరిగిన ఈ ఈవెంట్‌లో పదేళ్ల టేలన్ బిగ్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. తెల్లటి జాకెట్‌, మ్యాచింగ్‌ స్కర్ట్‌, స్టైలిష్‌ బూట్లు, డిజైనర్‌ హ్యాండ్‌బ్యాగ్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుని నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

18 నెలల వయసు నుంచే..!

టేలన్ తల్లికి ఫ్యాషన్‌ అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతో చిన్నప్పటి నుంచే తన కూతురిని విభిన్నమైన దుస్తులతో అలంకరించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునేది. ఆ ఫొటోలు ఒక ప్రకటన సంస్థ దృష్టిని ఆకర్షించాయి. అలా టేలన్ ఫ్యాషన్‌ ప్రయాణం 18 నెలల వయసులోనే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా టేలన్ సోషల్‌ మీడియా ఖాతాలను తన తల్లే నిర్వహిస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఈ అమ్మాయికి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. తనను టిక్‌టాక్‌లో 15 లక్షల మంది అనుసరిస్తుండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4 లక్షల మంది ఫాలో అవుతున్నారు. రెడ్‌ కార్పెట్‌పై టేలన్‌కు మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు 15 ఫ్యాషన్‌ వీక్స్‌లో పాల్గొంది.

ఉద్యోగం మానేసి..

సాధారణంగా పిల్లలకు ఏవైనా వ్యాపకాలు ఉంటే తల్లిదండ్రులు ‘ముందు చదువుపై దృష్టి పెట్టి ఆ తర్వాత వ్యాపకాల గురించి ఆలోచించు’ అని చెబుతుంటారు. కానీ టేలన్ తల్లిదండ్రులు మాత్రం ఇందుకు భిన్నం. టేలన్ తండ్రి జోష్ కూతురి కోసం ఏకంగా తన ఉద్యోగాన్నే వదులుకున్నారు. ఈ క్రమంలో కూతురికి కెమెరామెన్‌గా వ్యవహరిస్తూ ఆమె ఇష్టానికి మద్దతు తెలుపుతున్నారు. టేలన్ వెళ్లే ప్రతి ఫ్యాషన్‌ ఈవెంట్‌కు తను కూడా వెడుతూ ఎప్పుడూ కూతురి వెంటే ఉంటారు. అయితే నచ్చిన పని చేయడం ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ప్రధానమని టేలన్ తల్లిదండ్రులు నమ్ముతుంటారు. అందుకే చదువులో వెనకబడకూడదని తమ కూతురికి ఇంటి దగ్గరే పాఠాలు నేర్పుతుంటారు. అలా ఒకవైపు చదువుకుంటూనే టేలన్ తనకు ఇష్టమైన ఫ్యాషన్‌ రంగంలోనూ సత్తా చాటుతోంది.

ప్రముఖుల ఇంటర్వ్యూలతో..

ఈ క్రమంలో- ‘నాకు ఫ్యాషన్‌ అంటే ఇష్టం. కొత్త వ్యక్తులను కలవడం.. వారిని ఇంటర్వ్యూ చేయడం.. వారు చెప్పే విషయాలను గమనించడం అంటే ఇష్టం’ అంటుంది టేలన్.
తనకున్న మక్కువతో టేలన్ వివిధ రంగాల్లోని ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తను ఇప్పటివరకు డీజే ఖలీద్, పాప్ స్టార్ కలి ఉచిస్, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్యాట్రిక్‌ మహోమ్స్‌తో పాటు పలువురు మోడళ్లు, డిజైనర్లు, ఫ్యాషనిస్ట్‌లను కూడా ఇంటర్వ్యూ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్