కాయగూరల వ్యర్థాలే కాగితాలై..!

ఇంట్లో రకరకాల కూరగాయల్ని, పండ్లని తొక్క తీసి ఉపయోగించుకుంటాం. ఆ తొక్కల్ని డస్ట్‌బిన్‌లో పడేస్తాం. అయితే ఈ కూరగాయల తొక్కలతోనే పర్యావరణహిత పేపర్లు తయారుచేస్తోంది బెంగళూరుకు చెందిన మాన్య హర్ష. పర్యావరణమంటే ఎంతో ప్రేమ చూపించే ఈ 11 ఏళ్ల చిన్నారి.. చెట్లను నరకడమంటే మన వేలితో మన కళ్లు పొడుచుకున్నట్లేనంటోంది.

Published : 23 Aug 2021 18:25 IST

(Photo: Instagram)

ఇంట్లో రకరకాల కూరగాయల్ని, పండ్లని తొక్క తీసి ఉపయోగించుకుంటాం. ఆ తొక్కల్ని డస్ట్‌బిన్‌లో పడేస్తాం. అయితే ఈ కూరగాయల తొక్కలతోనే పర్యావరణహిత పేపర్లు తయారుచేస్తోంది బెంగళూరుకు చెందిన మాన్య హర్ష. పర్యావరణమంటే ఎంతో ప్రేమ చూపించే ఈ 11 ఏళ్ల చిన్నారి.. చెట్లను నరకడమంటే మన వేలితో మన కళ్లు పొడుచుకున్నట్లేనంటోంది. అందుకే చెట్ల కలపతో కాకుండా కూరగాయల వ్యర్థాలతో పేపర్‌ తయారుచేస్తూ అందరిలో పర్యావరణ స్పృహ పెంచుతోంది.

8 ఏళ్ల వయసు నుంచే!

ప్రస్తుతం బెంగళూరులోని ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది హర్ష. ఆమె తల్లిదండ్రులు ప్రకృతి ప్రేమికులు. పైగా వారికి ప్రయాణాలంటే ఎంతో ఆసక్తి. అలా వారిని చూస్తూనే పెరిగిన హర్ష.. బాల్యం నుంచే ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టింది. తన 8 ఏళ్ల వయసులోనే ‘వరల్డ్‌ వాటర్‌ డే’ సందర్భంగా నీటి వినియోగం, పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ.. పిల్లలు, పెద్దలతో కలిసి ‘కిడ్స్‌ వాక్‌థాన్‌’ నిర్వహించింది. తల్లిదండ్రులు, మరికొంతమంది సహాయంతో దొరసాని ఫారెస్ట్‌ నుంచి పుట్టెనహల్లి సరస్సు వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.

ఉల్లిపాయల తొక్కలతో పేపర్‌ షీట్లు!

కరోనా కారణంగా పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. చాలామంది స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలో వీడియో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేశారు. అయితే సామాజిక స్పృహ ఉన్న హర్ష మాత్రం ఓ మంచి పనికి పూనుకొంది. పర్యావరణ కాలుష్యం నుంచి భూమాతను కాపాడుకోవాలంటే పచ్చదనంతోనే సాధ్యమని గట్టిగా నమ్ముతోందీ చిన్నారి. అదే సమయంలో పేపర్‌ తయారీ, ఇతర అవసరాల కోసం చెట్లను ఇష్టారీతిన నరకడం తనను బాగా కలచివేసింది. అందుకే లాక్‌డౌన్‌ సమయంలో ఉల్లిపాయల తొక్కలతో పేపర్‌ను తయారుచేసింది. మొదట విఫలమైనా ఎట్టకేలకు తను అనుకున్నది సాధించింది హర్ష. ఇందులో భాగంగా మొదట కేవలం 10 ఉల్లిపాయల తొక్కలను ఉపయోగించి 2-3 A4 పేపర్‌షీట్లను తయారుచేసింది. ఆ తర్వాత వెల్లుల్లి, టమాటాలు, బంగాళాదుంపలు, బీన్స్‌, ముల్లంగి తదితర కూరగాయల తొక్కలతోనూ పేపర్‌ తయారుచేయడంలో సఫలమైంది.

భూమాత బిడ్డలుగా అది మన బాధ్యత!

‘అందరూ ఏడాదికోసారి ప్రపంచ ధరిత్రీ దినోత్సవం జరుపుకొంటారు. కానీ నేను మాత్రం రోజూ ఎర్త్‌ డేను జరుపుకొంటాను. ఎందుకంటే నేను భూమాతను తల్లిలా భావిస్తాను. మరి అలాంటిది నాకళ్ల ముందే పచ్చని ప్రకృతి నాశనమవుతోంటే నేను నిశ్శబ్దంగా చూస్తూ ఉండలేను. అందుకే పేపర్‌ కోసం అడవులను నిర్మూలించకుండా కూరగాయల తొక్కలతో కూడా పేపర్‌ను తయారుచేయవచ్చని నిరూపించాను. ఈ ప్రయత్నం వెనక మా అమ్మానాన్నల కృషి ఎంతో ఉంది. కేవలం నేనేక్కదాన్నే కాదు మనమంతా ఆ భూమాత బిడ్డలమే. ఆమెను రక్షించుకోవడం మనందరి బాధ్యత’ అంటోందీ సూపర్‌ కిడ్‌.

పేపర్‌ బ్యాగ్స్ పంచుతూ!

కేవలం కూరగాయల తొక్కలే కాదు.. తన దగ్గరున్న పాత నోట్‌ పుస్తకాలనూ రీసైక్లింగ్‌ చేసి ఎకో ఫ్రెండ్లీ పేపర్‌షీట్లను తయారుచేస్తోంది హర్ష. అంతేకాదు వాటితో పేపర్‌ సంచులను తయారుచేసి సమీపంలోని దుకాణాదారులు, వ్యాపారులకు పంచుతోంది. ప్లాస్టిక్‌ బ్యాగుల స్థానంలో వీటిని ఉపయోగించమని కోరుతోంది. అదేవిధంగా ఇంట్లోనే వీటిని తయారుచేసుకునేలా అవగాహన కల్పిస్తోంది.

‘రైజింగ్ స్టార్‌’ అంటూ!

తన రచనలతోనూ స్ఫూర్తి నింపుతోన్న హర్ష.. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ అంశాలకు సంబంధించి ఇప్పటికే 5 పుస్తకాలు రాసింది. త్వరలో తను రాసిన మరో రెండు బుక్స్‌ కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఇక తన సామాజిక స్పృహకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకుందీ ఎకో వారియర్‌. ఇటీవల 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా Earth.Org హర్షను ‘రైజింగ్‌ స్టార్’ బిరుదుతో గౌరవించింది. దీంతో పాటు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘వరల్డ్‌ రికార్డ్స్‌ ఇండియా’, ‘కర్ణాటక అఛీవర్స్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించింది.

ఈ భూమిని అందంగా చూడాలనుకుంటోంది!

ఇలా చిన్నతనంలోనే ప్రకృతి ప్రేమికురాలిగా మారిన హర్ష గురించి ఆమె తల్లి చైత్ర శ్రీ మాట్లాడుతూ.. ‘నా కూతురును చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకోవడమన్నా, నేర్చుకోవడమన్నా తనకెంతో ఆసక్తి. ఇందులో భాగంగానే ఇలా ప్రయోగాలు చేస్తుంటుంది. నా గారాల పట్టి ఈ భూగ్రహాన్ని అందంగా మార్చాలనుకుంటోంది. ఈ ప్రయత్నంలో మేం కూడా తనకు తోడ్పాటు అందిస్తున్నాం..’ అని చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్