ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!

నవమాసాలూ గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి రావాలి. కానీ చాలామంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. దీనివల్ల కొంతమంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతుంటారు.

Published : 27 Mar 2024 12:49 IST

నవమాసాలూ గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి రావాలి. కానీ చాలామంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. దీనివల్ల కొంతమంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అయితే ఈ సమస్యను కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి...

చిన్న చిట్కాలే మేలు చేస్తాయ్‌!

⚛ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చటి నీళ్లు తాగడం మంచిది. దీనికి ఒక చెంచా నిమ్మరసం, అరచెంచా తేనె.. కూడా కలిపితే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని భోజనానికి ముందు కూడా తాగచ్చు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

⚛ ​​​​​​​రెండు లీటర్ల నీటిలో రెండు మూడు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని వరుసగా 40 రోజుల పాటు తాగడం వల్ల పొట్ట తగ్గి నాజూగ్గా తయారవ్వచ్చు. ఇదే చిట్కాను లవంగాలు, దాల్చిన చెక్క ముక్కకు బదులుగా బార్లీ, వాము.. చెంచా చొప్పున వేసి కూడా ప్రయత్నించవచ్చు.

⚛ ​​​​​​​రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి.

⚛ ​​​​​​​పండ్లలో ముఖ్యంగా యాపిల్ మంచిది. ఆహారం ద్వారా వచ్చే కొవ్వుల్ని శరీరం గ్రహించకుండా చేయడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తుందిది. ఫలితంగా పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఆయా సీజన్లలో లభించే తాజా పండ్లు, కాయగూరల్ని సైతం ఆహారంలో భాగం చేసుకోవాలి.

⚛ ​​​​​​​పిల్లలకు డబ్బా పాలు కాకుండా తల్లి పాలు పట్టడం వల్ల కూడా పొట్ట ఎత్తును తగ్గించుకోవచ్చు. తల్లి ప్రతిరోజూ పాలివ్వడం వల్ల రోజుకు శరీరంలో 500 క్యాలరీల దాకా ఖర్చవుతాయి. కాబట్టి పాలివ్వడం కూడా ప్రసవానంతరం పొట్ట తగ్గించుకోవడానికి ఒక మార్గం అంటున్నారు నిపుణులు.

⚛ ​​​​​​​పొట్ట తగ్గడం కోసమైనా లేదంటే మామూలుగానైనా.. మీకు నచ్చిన ఆహారం, మీకు నచ్చిన సమయంలో తీసుకోవడం, డైటింగ్‌ చేయడం.. అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రభావం మీ పాలు తాగి పెరిగే మీ బిడ్డపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఉత్తమం.

ఇవి గుర్తుంచుకోండి!

⚛ ​​​​​​​ప్రసవం తర్వాత మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఎదురవడం కామన్‌. దీనివల్ల పొట్ట తగ్గడానికి బదులుగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఒత్తిడిని దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండడం మేలు. ఇందుకోసం మీ చిన్నారి పడుకున్నప్పుడే మీరూ విశ్రాంతి తీసుకోవడం, మీకు నచ్చిన పనులు (ఉదాహరణకు.. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం మొదలైనవి) చేయడం మంచిది.

⚛ ​​​​​​​సిజేరియన్, నార్మల్.. వీటిలో మీకు ఏ పద్ధతిలో ప్రసవం జరిగినా ఆరు నెలల వరకు బరువులెత్తడం, త్వరగా పొట్ట తగ్గాలని బలవంతంగా వ్యాయామాలు చేయడం అస్సలు మంచిది కాదు.

⚛ ​​​​​​​పిల్లల్ని స్ట్రోలర్‌లో కూర్చోబెట్టుకుని దాన్ని తోసుకుంటూ దగ్గర్లో ఉండే పార్కుకు వెళ్లండి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి వ్యాయామం అందడంతో పాటు మనసుకు ఆహ్లాదంగానూ ఉంటుంది. ప్రసవానంతర ఒత్తిడి, ఆందోళనలకు ఈ ప్రక్రియ చక్కటి పరిష్కారం చూపుతుంది.

⚛ ​​​​​​​డెలివరీ అయిన తర్వాత త్వరగా పొట్ట తగ్గించుకోవాలని మనలో చాలామంది ఆరాటపడడం సహజం. కానీ ఈ ఆతృత పనికిరాదంటున్నారు నిపుణులు. కాబట్టి డెలివరీ తర్వాత పొట్ట తగ్గించుకునే విషయంలో, తిరిగి పూర్వపు శరీరాకృతిని పొందే విషయంలో ఎప్పుడు వ్యాయామం మొదలుపెట్టాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఎంతసేపు చేయాలి? వంటి విషయాలన్నీ సంబంధిత నిపుణులను సంప్రదించాకే మొదలుపెట్టడం మంచిదంటున్నారు.

⚛ ​​​​​​​భోజనం చేసిన తర్వాత చాలామంది కూర్చోవడమో లేక పడుకోవడమో చేస్తుంటారు. మరి ప్రసవానంతరం కూడా ఇలాగే చేస్తే మీ పొట్ట తగ్గడమేమో గానీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భోజనం తర్వాత దాదాపు పావుగంట అయినా అటూ ఇటూ నడవాలి. ఇది ఆరోగ్యానికి, పొట్ట తగ్గడానికి.. రెండింటికీ మంచిది. మీ బేబీని ఎత్తుకొని నడిస్తే మరీ మంచిది.

⚛ ​​​​​​​అలాగే వీటన్నింటితో పాటు డాక్టర్‌ సూచించిన పోస్ట్‌ ప్రెగ్నెన్సీ బెల్ట్‌ వాడడం లేదంటే ఇంట్లో ఉండే చున్నీనే నడుం చుట్టూ కాస్త గట్టిగా బిగించుకోవడం.. వంటివి చేసినా కొన్ని రోజుల్లోనే పొట్ట తగ్గి పూర్వపు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్