పొడిబారిన పాదాల కోసం.. ఇవి!

చాలామందికి కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మం పొడిగా మారి పొలుసుల్లా ఊడిపోతుంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీంతో వాటిని కవర్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు.

Published : 25 Jan 2024 20:49 IST

చాలామందికి కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మం పొడిగా మారి పొలుసుల్లా ఊడిపోతుంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీంతో వాటిని కవర్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇంట్లో లభ్యమయ్యే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించే కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు.

బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం, ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లడం, రసాయనాలు అధికంగా ఉన్న సబ్బులు ఉపయోగించడం, శీతల గాలులు.. వంటి కారణాల వల్ల కాళ్లు, పాదాల వద్ద ఉన్న చర్మం తేమని కోల్పోయి పొడిబారినట్లుగా కనిపిస్తుంది.. పొలుసుల్లా రాలిపోతుంటుంది. తగినంత తేమని తిరిగి అందించడం ద్వారా అక్కడి చర్మాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

ఓట్స్‌తో..

కొద్దిగా ఓట్స్‌కు తగినన్ని రోజ్‌వాటర్ జత చేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లు, పాదాలపై అప్లై చేసి కాసేపు మృదువుగా మర్దన చేయాలి. తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. అనంతరం పొడి వస్త్రంతో తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రోజుకి 3 సార్ల చొప్పున 15 రోజుల నుంచి నెల రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక్కడ రోజ్‌వాటర్‌కి బదులుగా పచ్చిపాలు కూడా ఉపయోగించచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్‌తో..

బకెట్ గోరువెచ్చని నీళ్లలో అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఇందులో 15 నుంచి 20 నిమిషాల పాటు పాదాల్ని ముంచి ఉంచాలి. తర్వాత పాదాల్ని బయటికి తీసి చర్మం పైపొరల్లో ఉన్న మృతకణాలు పోయేలా చేతులతోనే మృదువుగా రుద్దుకోవాలి. ఆపై మరోసారి కాళ్లు కడుక్కొని ఆరాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే చర్మం తేమను సంతరించుకుంటుంది.

పెట్రోలియం జెల్లీతో..

కాళ్లు, పాదాలు శుభ్రంగా కడుక్కొని ఆరనివ్వాలి. తర్వాత పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకొని చర్మం లోపలి పొరల్లోకి ఇంకేలా మృదువుగా మర్దన చేసుకోవాలి. ఈ చిట్కా రోజూ రాత్రి నిద్రించే ముందు క్రమం తప్పకుండా పాటించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పెట్రోలియం జెల్లీ చర్మానికి సహజసిద్ధంగా తేమని అందించడమే కాకుండా పొడిబారిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో సమర్థంగా పనిచేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్