టైల్స్ మధ్య మురికిని పోగొట్టాలంటే..
నేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా సరే.. టైల్స్ మధ్య మురికి చేరుతుంటుంది. ఇంట్లో చేరిన దుమ్ముకి, తేమ తోడవడంతో అది కాస్తా గట్టిపడిపోయి.. టైల్స్ మధ్యన చేరుతుంది. ఫలితంగా ఫ్లోర్‌ని....
నేలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా సరే.. టైల్స్ మధ్య మురికి చేరుతుంటుంది. ఇంట్లో చేరిన దుమ్ముకి, తేమ తోడవడంతో అది కాస్తా గట్టిపడిపోయి.. టైల్స్ మధ్యన చేరుతుంది. ఫలితంగా ఫ్లోర్‌ని తరచూ శుభ్రం చేస్తున్నా.. పెద్దగా ఫలితం కనిపించదు. అయితే టైల్స్ మధ్య చేరిన మురికిని తక్కువ శ్రమతో ఎలా తొలగించాలని ఆలోచిస్తున్నారా? దీనికోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందామా..
✯ వెనిగర్, గోరువెచ్చని నీటిని సమపాళ్లలో తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేయాలి. ఐదు నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.
✯ గిన్నెలో ముప్పావు కప్పు బేకింగ్ సోడా, పావు కప్పు లిక్విడ్ బ్లీచ్ వేసి చిక్కటి పేస్ట్‌లా కలుపుకోవాలి. దీన్ని టైల్స్ మధ్య పూసి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్ లేదా స్క్రబ్ బ్రష్ సాయంతో రుద్దితే మురికి మెత్తం వదిలిపోతుంది. అనంతరం తడి వస్త్రంతో నేలను శుభ్రంగా తుడుచుకోవాలి.
✯ దెబ్బలు తగిలినప్పుడు ఆ భాగాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని సైతం టైల్స్ మధ్య చేరిన మురికిని పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. దీన్ని నేరుగా ఫ్లోర్‌ని శుభ్రం చేయడానికి వాడుకోవచ్చు. లేదంటే దీనిలో బేకింగ్ సోడాను కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసి టైల్స్ మధ్య రాసి ఆ తర్వాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
✯ కొన్నిసార్లు టైల్స్ మధ్య చేరిన మురికి పసుపు రంగులో కనిపిస్తుంది. దీన్ని పోగొట్టడానికి బ్లీచ్‌తో తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల ఆక్సిజనేటెడ్ బ్లీచింగ్ పౌడర్‌ను రెండు కప్పుల వేడి నీటిలో వేసి మిశ్రమంగా చేసుకోవాలి. దీనిలో పాత టూత్ బ్రష్‌ని ముంచి మురికి ఉన్న చోట బాగా రుద్దితే వెంటనే అది వదిలిపోతుంది.
✯ నిమ్మరసాన్ని నీటిలో కలిపి మురికిగా ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేస్తే మురికి వదిలిపోతుంది. అయితే నిమ్మ వల్ల టైల్స్ నునుపుదనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి.. కాస్త ఎక్కువ నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపితే సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.