Published : 06/01/2022 21:10 IST

ఈ పండ్లతో ఇమ్యూనిటీని పెంచుకుందాం..!

కాలాలు మారే కొద్దీ మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా మారుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో వాతావరణ ప్రభావం మన ఆరోగ్యంపై తీవ్రంగానే ఉంటుంది. ఈ కాలంలో మన రోగ నిరోధక వ్యవస్థ మందగించి పలు అనారోగ్య సమస్యలు తలెత్తడం సహజం. ఈ క్రమంలో జలుబు, దగ్గు, ఆస్తమా... వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యల దగ్గర్నుంచి చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం... వంటి సౌందర్య సమస్యల దాకా పలు రకాల అనారోగ్యాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వీటికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కూడా మన రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది.

సాధారణంగా చలి కాలంలో రకరకాల సీజనల్‌ వ్యాధులు, అనారోగ్య సమస్యలు మనపై దాడి చేస్తాయి. దీనికి ప్రధాన కారణం శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండడమే. దీంతో శరీరంలో డి-విటమిన్‌ లోపించి రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. ఇక చలిగాలుల వల్ల రక్త నాళాలు కుచించుకుపోయే అవకాశముంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గితే రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది. పైగా ఇది అసలే కరోనా కాలం... ఉబ్బసం, బ్రాంకైటిస్‌ లాంటి దీర్ఘకాలిక రోగుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. అయితే ఈ సీజన్‌లో లభించే కొన్ని రకాల పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

కమలా పండు

శీతాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో కమలా ఫలం ఒకటి. ఇవి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సిట్రస్‌ కుటుంబానికి చెందిన ఈ పండ్లలో సి-విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటితో పాటు డి-విటమిన్‌ కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు...ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరెంజ్‌ జ్యూస్‌ రోజూ ఒక గ్లాస్‌ తాగితే ఎంతో మేలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

యాపిల్

అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే యాపిల్‌ను సూపర్ ఫుడ్‌ అంటారు. వీటిల్లో సి, బి, కె -విటమిన్లు, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. యాపిల్‌లోని పీచు పదార్థం కారణంగా అజీర్తి సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. అదేవిధంగా చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

దానిమ్మ

ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంట్లో ఉండే ఔషధ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అదేవిధంగా అతిసారం, గుండెజబ్బులు, రక్తహీనత, రక్తపోటు, ఊబకాయం లాంటి సమస్యలను అరికడతాయి. దానిమ్మలో ఉండే ఎ,సి,ఇ-విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఫ్రీ రాడికల్స్‌ని తొలగిస్తాయి. దీంతో చర్మంతో పాటు జుట్టుకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

జామ

సంవత్సరం పొడవునా లభించే పండ్లలో జామ కూడా ఒకటి. ఈ పండ్లలో సి-విటమిన్‌ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్‌ రాకుండా కాపాడుతుంది. జలుబు, దగ్గు ఉన్న వారు జామకాయను తినడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందచ్చు. ఈ పండులో ఎ, బి6, బి3 విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని నాడీ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జామలో అధిక స్థాయిలో లభించే పొటాషియం, ఫైబర్‌ వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

బత్తాయి

సిట్రస్‌ జాతికి చెందిన ఈ పండులో సి-విటమిన్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇక శీతాకాలంలో ఎదురయ్యే సీజనల్‌ వ్యాధులను నివారించడానికి బత్తాయి ఎంతగానో సహాయపడుతుంది.

కివీ పండ్లు

కివీ పండ్లలో సి, ఇ, కె-విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌, పొటాషియం అధికంగా లభిస్తాయి. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ పోషకాలు శరీరానికి అంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో లభించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చర్మానికి మృదుత్వాన్ని తీసుకొస్తాయి.

ఆలూ బుఖారా

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే జలుబు సమస్యను తగ్గించి, రోగ నిరోధక శక్తి మెరుగుపడేలా చేస్తాయి. మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, రొమ్ము క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తాయి. వీటితో పాటు ఆస్తమా, జ్ఞాపకశక్తి తగ్గడం, అధిక బరువు వంటి సమస్యల నుంచి బయటపడేస్తాయి.

ఇవే కాదు... సీతాఫలం, అవకాడో, అరటి, ఉసిరి... ఇలా అన్నీ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. మరి పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఈ పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచుకుని ఈ శీతాకాలంలో కరోనా లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని