ఇటు బిజినెస్.. అటు బైక్ రైడింగ్..!

ఆధునిక పోకడలు ఎన్నో సంప్రదాయ కళల్ని కనుమరుగు చేస్తున్నాయి. ఎంతోమంది కొత్త మోజులో పడిపోయి.. పాతను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే తరంలో పుట్టిపెరిగిన టెంజిన్‌ మెతో అందరిలా ఆలోచించలేదు.. క్రమంగా అంతరించిపోతోన్న ఓ తెగ సంప్రదాయ వస్త్రధారణకు పునర్వైభవం తేవాలనుకుంది....

Updated : 27 Jun 2023 14:19 IST

(Photos : Instagram)

ఆధునిక పోకడలు ఎన్నో సంప్రదాయ కళల్ని కనుమరుగు చేస్తున్నాయి. ఎంతోమంది కొత్త మోజులో పడిపోయి.. పాతను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే తరంలో పుట్టిపెరిగిన టెంజిన్‌ మెతో అందరిలా ఆలోచించలేదు.. క్రమంగా అంతరించిపోతోన్న ఓ తెగ సంప్రదాయ వస్త్రధారణకు పునర్వైభవం తేవాలనుకుంది. వాటికి సమకాలీన హంగులద్దుతూ ఈతరం వారినీ ఆకట్టుకోవాలనుకుంది. ఈ ఆశయంతోనే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిందామె. అప్పటికే వృత్తిరీత్యా ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె.. బైక్‌ రైడింగ్‌లోనూ దిట్ట. ఇలా వృత్తిప్రవృత్తుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. తన వ్యాపారాన్నీ సమర్థంగా నిర్వర్తిస్తూ దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో మహిళలు ఉద్యోగం చేయడమే గొప్ప విషయం అనుకుంటే.. ఇటు వృత్తినీ, అటు ప్రవృత్తుల్నీ ఒంటి చేత్తో నిర్వర్తిస్తోన్న టెంజిన్‌ స్ఫూర్తి ప్రయాణమిది!

టెంజిన్‌ది అరుణాచల్‌ ప్రదేశ్‌లోని బొమ్‌డిలా అనే కొండ ప్రాంతం. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆమె.. చిన్న వయసు నుంచే పచ్చదనం అంటే ప్రేమ పెంచుకుంది. పైచదువుల కోసం దిల్లీ వెళ్లిన టెంజిన్‌.. అక్కడి ‘మిరండా హౌస్‌ కాలేజీ’లో సోషియాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ఆపై అక్కడే యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతూ.. వివిధ ప్రభుత్వ పరీక్షలు రాసేది.

బైక్‌ రైడింగ్‌ అంటే ప్రాణం!

ఈ ప్రయత్నాల్లో భాగంగానే.. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఆరోగ్య శాఖలో ‘ప్రభుత్వ ఆరోగ్య-ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌’గా ఉద్యోగం సంపాదించింది టెంజిన్‌. ఇలా కెరీర్‌లో స్థిరపడ్డాక తన అభిరుచులపై దృష్టి పెట్టాలనుకుందామె. నిజానికి ఆమెకు చిన్న వయసు నుంచి బైక్‌ రైడింగ్‌ అంటే ప్రాణం. ‘సాధారణంగా బైక్‌లు, కార్ల గురించి ఎక్కువగా అబ్బాయిలే మాట్లాడుకోవడం చూస్తుంటాం. కానీ నాకూ చిన్న వయసు నుంచి వీటి గురించి మాట్లాడాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని అనిపించేది. అందుకే మా సోదరులు ఈ విషయాలు చర్చించినప్పుడల్లా నేనూ మధ్యలో కలగజేసుకునేదాన్ని. అలా తొలిసారి బైక్‌ నడిపిన నేను ఎప్పటికైనా నా కంటూ సొంత బైక్‌ ఉండాలని నిర్ణయించుకున్నా. అటు చదువుకుంటూనే, ఇటు బైక్‌ నడపడం నేర్చుకున్నా..’ అంటోన్న టెంజిన్‌ బుల్లెట్‌ వంటి భారీ బైకులు, వేగంగా దూసుకెళ్లే స్పోర్ట్స్ బైక్‌లు నడపడంలో ప్రావీణ్యం సంపాదించుకుంది.

‘భారీ బైక్‌లు ఎలా నడుపుతున్నావ్‌?’ అనేవారు!

ఇలా తనకు ఉద్యోగం వచ్చాక.. సొంత డబ్బుతో బుల్లెట్‌ బండి కొనుక్కొని తన కల నెరవేర్చుకుంది టెంజిన్‌. అయితే అది కాస్తా చోరీ కావడంతో నిరాశ పడిన ఆమె.. ఆపై డుకాటీ వంటి మరో సూపర్‌ఫాస్ట్‌ బైక్‌ను కొనుగోలు చేసింది. ‘ఇంత భారీ బైక్‌లు ఎలా నడపగలుగుతున్నావని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఇది చాలా సింపుల్‌. కూర్చునే భంగిమను ప్రాక్టీస్‌ చేసి.. బ్యాలన్స్‌ చేయగలిగితే చాలు.. అన్ని బైక్స్‌లాగే వీటినీ ఈజీగా నడిపేయచ్చు. నేనూ ఇదే విధంగా సొంతంగా బైక్‌ రైడింగ్‌ నేర్చుకున్నా..’ అని చెప్పే టెంజిన్‌ తన బైక్‌పై కొండ ప్రాంతాలు, రాళ్లూ రప్పలున్న రహదారుల్లోనూ సులభంగా దూసుకుపోగలదు. ఇలా తన బైక్‌ రైడింగ్‌ నైపుణ్యాలతో అనతికాలంలోనే రాష్ట్రవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. ఆ రాష్ట్రంలోనే డుకాటీ స్పోర్ట్స్ బైక్‌ నడపడంలో అనుభవజ్ఞురాలైన ఏకైక మహిళా బైకర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బైక్‌ నడపగలదు టెంజిన్‌.

వ్యాపార ఆలోచన అలా!

ఇలా తన బైక్‌ రైడింగ్‌ నైపుణ్యాలతో మహిళా సాధికారతను చాటేలా పలు రేసుల్లోనూ పాల్గొన్న టెంజిన్‌.. గతేడాది ‘Explore Beyond’ అనే మరో బైక్‌ యాత్రలో పాల్గొంది. ఇలా అనుభవజ్ఞులైన బైక్‌ రైడర్లతో పోటీ పడడం ఓ అద్భుతమైన అనుభూతి అని, ఫలితంగా వాళ్ల నుంచి మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోగలుగుతున్నానని చెబుతోందీ యువ బైకర్‌. అయితే తన బైక్‌ యాత్రల్లో భాగంగా ఓసారి అక్కడి గిరిజన గ్రామాల్ని సందర్శించింది టెంజిన్‌. ఈ క్రమంలోనే ‘మోన్పా’ తెగ ప్రజల్ని కలిసిన ఆమె.. వారి ఆచార వ్యవహారాల గురించి అడిగి తెలుసుకుంది. అంతేకాదు.. వారి ఆహార్యాన్నీ దగ్గర్నుంచి గమనించింది. ఈ సమయంలోనే తన వ్యాపార ఆలోచనకు బీజం పడిందంటోంది టెంజిన్‌.

‘మా రాష్ట్రంలోని ప్రముఖ గిరిజన తెగల్లో మోన్పా తెగ ఒకటి. వారు నిత్యం మెరూన్‌ రంగులో ఉండే సంప్రదాయ దుస్తులే ధరిస్తారు. అది చూసి నాకు విచిత్రంగా అనిపించడంతో.. అసలు ఎందుకిలా? అని మా అమ్మను అడిగాను. కానీ ప్రాచీన కాలంలో ఆ తెగలో నీలం రంగు దుస్తులు ధరించే వారని అమ్మ చెప్పింది. అప్పుడే అనిపించింది.. మోన్పా తెగ వారికీ వారు ధరించే సంప్రదాయ దుస్తుల్ని విభిన్న రంగుల్లో అందించాలని! ఈ  స్ఫూర్తి తోనే 2017లో ‘Oro Bruk’ పేరుతో దుస్తుల వ్యాపారం ప్రారంభించా.’ అంటూ చెప్పుకొచ్చింది టెంజిన్‌.

రంగులతో హంగులు..!

షింకా అనే గౌన్‌, తో-డంగ్‌ అనే ఫ్రంట్‌ ఓపెన్‌ సిల్క్‌ స్కర్ట్‌, ఛుబా అనే వదులైన అవుట్‌ఫిట్‌.. ఇదీ మోన్పా తెగ మహిళల సంప్రదాయ వస్త్రధారణ. అయితే గత కొన్ని దశాబ్దాలుగా మెరూన్‌ కలర్‌నే ఎంచుకుంటోన్న ఆ తెగ మహిళల కోసం.. తన సంస్థ ద్వారా విభిన్న రంగుల్లో దుస్తులు రూపొందించడం మొదలుపెట్టింది టెంజిన్‌.
‘మోన్పా తెగ మహిళల సంప్రదాయ వస్త్రధారణ గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాక.. ఈ దుస్తుల్ని వివిధ రంగుల్లో రూపొందించాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనతోనే ఎరుపు, ఆకుపచ్చ, పసుపు-నలుపు, నీలం, నీలం-ఆకుపచ్చ.. వంటి రంగులు, కలర్‌ కాంబినేషన్స్‌లో వీటిని తయారుచేసి మార్కెట్లోకి తీసుకొచ్చా. వీటికి మంచి స్పందన రావడంతో మోన్పా మోటివ్స్‌, ఇతర డిజైన్లనూ వీటికి జోడించడం మొదలుపెట్టా. ఈ దుస్తుల్నీ కాలానుగుణంగా రూపొందిస్తున్నా. శీతాకాలం చలికి తట్టుకునేందుకు వీలుగా ఉన్ని, డెనిమ్‌; ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి కాటన్‌.. వంటి ఫ్యాబ్రిక్స్‌ని వీటి తయారీలో ఉపయోగిస్తున్నా. రోజువారీ ధరించే క్యాజువల్స్‌ దగ్గర్నుంచి.. ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే ఎత్నిక్స్‌ దాకా.. విభిన్న డిజైనర్‌ దుస్తులూ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇలా మహిళల కోసమే కాదు.. ఈ తెగలో ఉన్న పురుషుల కోసమూ కొన్ని రకాల దుస్తులు రూపొందిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ ఫ్యాషనర్‌.

యువతే.. మా లక్ష్యం!

ఇలా దుస్తులే కాదు.. కాలక్రమేణా హ్యాండ్‌బ్యాగ్స్‌, బెల్టులు, జ్యుయలరీ, ఇతర యాక్సెసరీస్‌కూ తన వ్యాపారాన్ని విస్తరించింది టెంజిన్‌. ‘మా దుస్తుల తయారీలో ఆర్గానిక్‌ డైలు వాడుతున్నాం. స్థానికంగా ఉండే మహిళా నేత కార్మికులకు మా సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం. కొంతమంది యువతులూ మా వద్ద డ్రస్‌ డిజైనింగ్‌ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వారికీ నైపుణ్యాలు నేర్పిస్తున్నాం. ఇక మా సంప్రదాయ దుస్తుల్ని మరింత విస్తరించడానికి.. వీటిని ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం, స్థానిక ఎన్జీవోలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం.. వంటివి చేస్తున్నాం. త్వరలోనే మోన్పా సంప్రదాయ దుస్తులకు డిజిటల్‌ డిజైన్స్‌, ఎంబ్రాయిడరీతో హంగులద్దే ఆలోచనలో ఉన్నాం. ఇలా ఈ ఆధునిక హంగుల్ని జోడిస్తూ నేటి యువతను ఆకర్షించే ప్రయత్నం చేయాలన్నదే మా ఆశయం!’ అంటూ చెప్పుకొచ్చిందీ ఫ్యాషన్‌ డిజైనర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని