Year Ender 2023: త్రివిధ దళాల్లో ఈ ఏటి ‘తొలి’ సంతకం వీరిదే!

దేశ సేవ.. ఎంతో పట్టుదల, త్యాగ నిరతి ఉన్న వాళ్లకు తప్ప అన్యులకు దొరకదీ అదృష్టం! చిన్న వయసులోనే ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొని రక్షణ రంగంలోకి అడుగుపెట్టారు ఎంతోమంది మహిళలు.

Published : 22 Dec 2023 12:12 IST

(Photos: Twitter)

దేశ సేవ.. ఎంతో పట్టుదల, త్యాగ నిరతి ఉన్న వాళ్లకు తప్ప అన్యులకు దొరకదీ అదృష్టం! చిన్న వయసులోనే ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొని రక్షణ రంగంలోకి అడుగుపెట్టారు ఎంతోమంది మహిళలు. వారిలో కొందరు ఈ ఏడాది గాజు తెరల్ని బద్దలుకొడుతూ అందలమెక్కారు. త్రివిధ దళాల్లో ఉన్నత బాధ్యతల్ని స్వీకరించి ‘తొలి’ మహిళలుగా తమదైన ముద్ర వేశారు. అలాంటి కొందరు సాహస వనితల స్ఫూర్తి కథనమే ఇది!

ప్రేర్నా డియోస్థలీ

అనుక్షణం సముద్రంలో పహారా కాస్తూ.. శత్రు సైన్యంలో వణుకు పుట్టించే యుద్ధ నౌక నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఈ సాహసోపేత విధుల్లో పురుషులే కాదు.. కొందరు మహిళా అధికారులూ భాగమవుతున్నారు. వారిలో నౌకాదళ కమాండర్‌ ప్రేర్నా డియోస్థలీ ఒకరు. ‘ఐఎన్‌ఎస్‌ చెన్నై’ అనే యుద్ధ నౌకకు తొలి లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఇటీవలే మరో అరుదైన ఘనత సాధించారు. పశ్చిమ నౌకాదళానికి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ త్రిన్కాత్‌’ అనే అత్యంత వేగవంతమైన పెట్రోలింగ్‌ నౌకకు కమాండింగ్‌ ఆఫీసర్‌గా భారత నౌకాదళం ఆమెకు బాధ్యతలు అప్పగించింది. తద్వారా భారత నౌకాదళం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చరిత్రకెక్కారు ప్రేర్నా. దీనికి సంబంధించిన నియామక పత్రాన్ని భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్‌ హరి కుమార్‌ చేతుల మీదుగా అందుకున్నారామె.

ముంబయిలో పుట్టి పెరిగిన ప్రేర్నా.. చిన్న వయసు నుంచే రక్షణ రంగంలోకి రావాలని కలలు కన్నారు. సైకాలజీలో పీజీ పూర్తిచేసిన ఆమె.. 2009లో నేవీలో చేరారు. ‘Tupolev Tu-142’ అనే సముద్ర నిఘా, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు తొలి మహిళా పరిశీలకురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ‘P-8I’ అనే సముద్ర నిఘా విమానంలోనూ విధులు నిర్వర్తించారు. తోటి నేవీ అధికారిని పెళ్లాడిన ప్రేర్నాకు ఓ కూతురు ఉంది.


మనీషా పధి

సాధారణంగా ముఖ్యమంత్రి, గవర్నర్‌ వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారు.. తమకు వ్యక్తిగత సహాయకుడు/కార్యదర్శిగా.. సీనియర్‌ అధికారుల్ని నియమించుకోవడం తెలిసిందే! మిలిటరీ, పోలీస్‌, ప్రభుత్వ రంగాలకు చెందిన వారిలో సీనియర్లకు ఈ అవకాశం దక్కుతుంది. ఇటీవలే ఈ అరుదైన అవకాశం దక్కించుకుంది భారత వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ మనీషా పధి. మిజోరం గవర్నర్‌ డా. హరిబాబు కంభంపాటికి వ్యక్తిగత సహాయకురాలిగా నియమితురాలైందామె. భారత సాయుధ దళాలకు చెందిన ఓ మహిళా అధికారి గవర్నర్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఎంపికవడం ఇదే తొలిసారి కావడం విశేషం! ఇలా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కింది మనీషా.

ఒడిశా గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌లో పుట్టి పెరిగిన మనీషా.. భువనేశ్వర్‌లోని సీవీ రామన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. త్రివిధ దళాల్లో చేరాలన్న మక్కువతో భారత వాయుసేనలో స్క్వాడ్రన్‌ లీడర్‌గా తొలి పోస్టింగ్‌ అందుకుంది. బీదర్‌, పుణే, భాటిండా.. తదితర వైమానిక దళ స్థావరాల్లో సేవలందించిందామె.


కల్నల్‌ సునీతా బీఎస్‌

భారత సాయుధ దళాలకు చెందిన అతి పెద్ద రక్త మార్పిడి కేంద్రం (AFTC) దిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉంది. దీనికి కమాండింగ్‌ ఆఫీసర్‌గా గత నెలలో బాధ్యతలందుకున్నారు కల్నల్‌ సునీతా బీఎస్‌. ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌ ఆఫీసర్‌ అయిన ఆమె.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. వైద్య సేవలందించడంలో ఆమె చూపిన నిబద్ధత, పనితీరే ఆమెకు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించేలా చేసిందని అధికారులు తెలిపారు.

రోహ్‌తక్‌ వైద్య కళాశాలలో ‘పాథాలజీ’ విభాగంలో పీజీ పూర్తిచేసిన ఆమె.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మిలిటరీ ఆస్పత్రిలో కమాండింగ్‌ ఆఫీసర్‌గా సేవలందించారు. ప్రస్తుతం AFTC కమాండింగ్‌ ఆఫీసర్‌గా.. ఇక్కడున్న ‘స్టెమ్‌ సెల్‌ క్రిప్టోప్రిజర్వేషన్‌’, ‘గామా రేడియేషన్‌ ఛాంబర్స్’, ‘న్యూక్లిక్‌ యాసిడ్‌ టెస్టింగ్‌’.. వంటి పలు కీలక వైద్య సదుపాయాల అమలుపై దృష్టి సారించారామె.


షాలిజా ధామి

ఈ ఏడాది మహిళా దినోత్సవం వేళ.. గ్రూప్‌ కెప్టెన్‌ షాలిజా ధామికి ‘ఫ్రంట్‌లైన్‌ ఐఏఎఫ్‌ కంబాట్‌ యూనిట్‌’కు కమాండర్‌గా బాధ్యతలు అప్పగించింది భారత వాయుసేన. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా వాయుసేన అధికారిగా చరిత్ర సృష్టించింది షాలిజా. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం పశ్చిమ సెక్టార్‌లోని క్షిపణుల స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహిస్తోంది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌ 8న ‘భారత వైమానిక దళ దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌కు నేతృత్వం వహించిన తొలి మహిళా అధికారిగానూ కీర్తి గడించిందామె.

పంజాబ్‌లోని సరభా గ్రామానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన షాలిజా.. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. భారత వాయుసేనకు చెందిన మెంటర్‌ పీవీ సింగ్‌ స్ఫూర్తితో ఎన్‌సీసీలో చేరింది. ఇక్కడి అనుభవాలే తనను సాయుధ దళాల్లో చేరేలా ప్రేరేపించాయంటోందామె. 2003లో భారత వాయుసేనలో హెలికాప్టర్‌ పైలట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమెకు.. 2,800 గంటలు హెలికాప్టర్‌ నడిపిన అనుభవం ఉంది. చేతక్‌, ఛీతా.. వంటి పురాతన యుద్ధ విమానాలు/హెలికాప్టర్లను నడపడంలోనూ షాలిజా దిట్ట.


కల్నల్‌ గీతా రాణా

ఇండియన్‌ ఆర్మీ తమ ఫీల్డ్ కమాండర్లకు వ్యూహాత్మక చర్చలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలపై.. ఇండో-చైనా బోర్డర్‌లోని లద్దాఖ్‌ ప్రాంతంలో ఉన్న ‘స్వతంత్ర ఫీల్డ్‌ వర్క్‌షాప్‌’లో వివిధ రకాల వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తుంటుంది. ఈ వర్క్‌షాప్‌కు ఇప్పటివరకు పురుషులే నాయకత్వం వహించారు. కానీ ఈ ఏడాది ఈ అవకాశం కల్నల్‌ గీతా రాణాను వరించింది. తద్వారా ఈ అరుదైన అవకాశం అందుకున్న తొలి మహిళా ఆఫీసర్‌గా చరిత్ర సృష్టించిందామె. ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌ (ఈఎంఈ) కార్ప్స్‌’లో గీత సభ్యురాలు.

గీతది ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం. లూథియానాకు చెందిన ఆమె తండ్రి.. మెహర్‌ రెజిమెంట్‌లో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా పని చేశారు. గీత చెన్నైలో శిక్షణ పూర్తిచేసి, 2000లో ఆర్మీలో బాధ్యతలు చేపట్టారు. ఈఎంఈ కార్ప్స్‌ సభ్యురాలిగా ఆయుధాల డిజైన్‌, అభివృద్ధి, ప్రయోగం, పరిశీలన.. వంటి బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భాగంగా సిక్కిం, జమ్మూకశ్మీర్‌ వంటి ప్రాంతాల్లో సేవలందించారు. ఈఎంఈ శిక్షణ కేంద్రంలో ఇన్‌స్ట్రక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. గీతా రాణా.. ఆర్మీలో ఒక యూనిట్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తోన్న తొలి నాన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్