నదుల ప్రక్షాళనే ఆమె ధ్యేయం!

నదులే మన నిత్యావసరాల్ని తీర్చే జల మార్గాలు. అలాంటి జల సంపద నేడు వివిధ కారణాల రీత్యా కలుషితమవుతోంది. పారిశ్రామిక-మానవ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ భూతం నదుల పరిశుభ్రతను హరించివేస్తున్నాయి. తద్వారా మనకే కాదు.. అందులోని జలచరాలకూ ముప్పు....

Published : 28 Aug 2022 14:41 IST

(Photo: Instagram)

నదులే మన నిత్యావసరాల్ని తీర్చే జల మార్గాలు. అలాంటి జల సంపద నేడు వివిధ కారణాల రీత్యా కలుషితమవుతోంది. పారిశ్రామిక-మానవ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ భూతం నదుల పరిశుభ్రతను హరించివేస్తున్నాయి. తద్వారా మనకే కాదు.. అందులోని జలచరాలకూ ముప్పు తప్పట్లేదు. వదోదరకు చెందిన స్నేహ షాహికి ఇది మింగుడు పడలేదు. చిన్నవయసు నుంచే పర్యావరణంపై ప్రేమ పెంచుకున్న ఆమె.. కాలేజీ దశ నుంచే కాలువల ప్రక్షాళన మొదలుపెట్టింది. తన ప్రయత్నాన్ని క్రమంగా నదులకు విస్తరించి.. వాటి పరిశుభ్రత దిశగా నడుం బిగించింది. ప్రస్తుతం తమిళనాడులోని తమిరాభరణి నదీ ప్రక్షాళన మొదలుపెట్టిన స్నేహ.. ఓవైపు చదువు కొనసాగిస్తూనే, మరోవైపు పర్యావరణ పరిరక్షణకూ కృషి చేస్తోంది. ఇలా తన చేతలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోన్న ఈ యువ పర్యావరణవేత్త గ్రీన్‌ జర్నీ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం రండి..

గుజరాత్‌లోని వదోదరలో పుట్టి పెరిగింది స్నేహా షాహి. ఆమెది సైనిక నేపథ్యమున్న కుటుంబం. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆమెకు క్రమంగా పచ్చటి ప్రకృతి, వాతావరణం అంటే మక్కువ పెరిగింది. ప్రయాణాల్ని బాగా ఇష్టపడే స్నేహకు నేషనల్‌ పార్కులు, జూ పార్కులకు వెళ్లడమంటే మక్కువట! ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ విభాగంలో పీజీ పూర్తిచేసిన ఆమె.. ముందు ఈ సబ్జెక్టును ఎంచుకుంటానన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారని, ఇందులో భవిష్యత్తు ఏముంటుందన్నట్లుగా చూశారని చెబుతోంది స్నేహ.

ఆ ప్రాజెక్టే ఆదిగా..!

వదోదరలోని మహారాజ సాయాజీరావ్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివే క్రమంలోనే నదీజలాల ప్రక్షాళనలో భాగంగా తన తొలి ప్రాజెక్ట్‌లో భాగమైంది స్నేహ. ఆ సమయంలో తన కాలేజీలో జరుగుతున్న ‘యూఎన్‌ఈపీ (ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం) ప్లాస్టిక్‌ టైడ్‌ టర్నర్‌ ఛాలెంజ్‌’లో పాల్గొందామె. ఇందులో భాగంగా తన బృందంతో కలిసి క్యాంపస్‌ లోపల ఉన్న కాలువను శుభ్రం చేసే బాధ్యతను తీసుకుంది. ఈ క్రమంలో కిలోల కొద్దీ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వస్తువుల్ని తొలగించి.. అందులోని తాబేళ్లు, మొసళ్లను వాటి బారి నుంచి కాపాడిందామె. అంతేకాదు.. ఆ కాలువ చుట్టుపక్కలా పచ్చటి మొక్కల్ని పెంచి.. ఆ ప్రదేశాన్ని సుందరంగా మార్చేసింది స్నేహ. అంతేకాదు.. అక్కడి సుమారు 300 మంది విద్యార్థుల సంతకాలు సేకరించి.. ఈ ఛాలెంజ్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఐరాస ఎంపిక చేసిన 18 మంది సభ్యుల్లో ఒకరిగానూ చోటు దక్కించుకుందీ గ్రీన్‌ లవర్.

సవాళ్లను ఓపిగ్గా ఎదుర్కొంటూ..!

‘టైడ్‌ టర్నర్‌ ఛాలెంజ్‌’లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే క్రమంలో పలు సవాళ్లు ఎదురయ్యాయంటోంది స్నేహ. ‘వాతావరణ పరిరక్షణ, నదీజలాల ప్రక్షాళన విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం కాస్త కష్టమే అయిందని చెప్తా. ఎందుకంటే మేం ఓవైపు చెబుతున్నా.. మరోవైపు చాలామంది తమ ఇంట్లోని వ్యర్థాలను పబ్లిక్‌ ప్రదేశాల్లో, కాలువల్లో పడేసేవారు. దానివల్ల ఎదురయ్యే పర్యవసానాలు ఎంత ప్రతికూలంగా ఉంటాయో రుజువు చేస్తే కానీ వారిలో మార్పు రాలేదు. ఇక ఇప్పుడైతే చాలామంది పర్యావరణానికి హాని కలిగించే వారిని వారిస్తూ మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సత్కార్యక్రమంలో భాగమైన నాకు దేశ, విదేశాల్లో పలువురు గొప్ప వ్యక్తుల్ని కలిసే అవకాశం దక్కింది..’ అంటూ చెబుతోంది స్నేహ.

ప్రస్తుతం నా లక్ష్యమదే!

ప్రస్తుతం బెంగళూరులోని ATREEలో ‘ఎక్స్‌ట్రీమ్‌ హైడ్రోలాజికల్‌ ఈవెంట్స్‌’లో పీహెచ్‌డీ చేస్తోంది స్నేహ. మరోవైపు తమిళనాడులోని తమిరాభరణి నదీ ప్రక్షాళనకు నడుం బిగించింది. ‘ప్రస్తుతం నేను తమిళనాడులో ఉన్నా.. వదోదరలో నా జూనియర్స్‌ కార్యకలాపాలనూ పర్యవేక్షిస్తుంటా. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్ని కలిపే 124 కిలోమీటర్ల పొడవైన ఈ నదిపై చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం, ఇతర అవసరాల కోసం వాళ్లకు ఈ నీరే ఆధారం. కానీ పలు వ్యర్థాల కారణంగా ఇది కలుషితమవుతోంది. అయితే దీని వెనక ఇతర కారణాలేమైనా ఉన్నాయా లేదంటే పర్యావరణ మార్పుల వల్ల ఇలా జరుగుతోందా అన్న విషయంలో ప్రస్తుతం నా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ ప్రక్షాళన.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం..’ అని చెప్పుకొచ్చింది స్నేహ.

నీటి కాలుష్యం వల్ల పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఎక్కువ సమస్యల్ని ఎదుర్కొంటున్నారంటోన్న స్నేహ.. తెలిసి తెలిసి ఈ పొరపాటు చేయకుండా.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని కోరుకుంటోంది. నదీ జలాల ప్రక్షాళన, వాతావరణ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తోన్న స్నేహ.. ‘యూత్‌ ఫర్‌ ఎర్త్‌ అవార్డు’ను సైతం అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్