కోడలైనంత మాత్రాన అవన్నీ భరించాలా? నేనేం చేయాలి..?

భర్త కోసం పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్లిన కొంతమంది ఆడపిల్లలకు అత్తారింటి వేధింపులు హారతి పట్టి మరీ స్వాగతం పలుకుతున్నాయని చెప్పచ్చు. కోడలంటే అత్తమామలు చెప్పినట్లే నడుచుకోవాలి.. భర్త మాట జవదాటకూడదు.. తనకంటూ సొంత నిర్ణయాలుండకూడదు.. ఇలాంటి తుప్పు పట్టిన కట్టుబాట్లు పెడుతున్నా ఇంటి గుట్టు రచ్చకీడ్చడమెందుకని చాలామంది కోడళ్లు సర్దుకుపోతున్నారు.

Published : 19 Jan 2022 18:22 IST

(Image for Representation)

భర్త కోసం పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్లిన కొంతమంది ఆడపిల్లలకు అత్తారింటి వేధింపులు హారతి పట్టి మరీ స్వాగతం పలుకుతున్నాయని చెప్పచ్చు. కోడలంటే అత్తమామలు చెప్పినట్లే నడుచుకోవాలి.. భర్త మాట జవదాటకూడదు.. తనకంటూ సొంత నిర్ణయాలుండకూడదు.. ఇలాంటి తుప్పు పట్టిన కట్టుబాట్లు పెడుతున్నా ఇంటి గుట్టు రచ్చకీడ్చడమెందుకని చాలామంది కోడళ్లు సర్దుకుపోతున్నారు. ఇన్నాళ్లూ తానూ ఇలాంటి కష్టాల మధ్యే బతికానంటోంది విజయనగరానికి చెందిన విభావరి. ఎనిమిదేళ్లుగా అత్తింటి వేధింపుల్ని భరిస్తోన్న ఆమె.. ఇక అలసిపోయానంటూ తన కష్టాల కడలిని మన ముందుంచింది. ఇలాంటి విష పూరిత వాతావరణంలో తన కూతురు పెరగకూడదంటే ఏం చేయాలో పాలుపోక మన సహాయం కోరుతోంది. మరి, ఇంతకీ ఆమె కథేంటో విందాం రండి..

అందరు ఆడపిల్లల్లాగే నేనూ వైవాహిక జీవితం గురించి బోలెడన్ని కలలు కన్నా. మనసున్న భర్త దొరకాలని, అత్తింట్లో సఖ్యతగా మెలగాలని, వాళ్లూ నా ఆశయాలను గౌరవించాలని.. ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా పెద్దదే లెండి! ఇక మా అమ్మ కూడా అత్తారింట్లో ఎలా ఉండాలో పదే పదే చెప్పేది.. చెప్పడమేంటి? పెళ్లికి ముందు నేను పెరిగిన ఉమ్మడి కుటుంబమే నాకు బోలెడన్ని విషయాలు నేర్పింది.

******

మా అమ్మ తన పెళ్లితోనే ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టింది. బంధాలు, బంధుత్వాలంటే ప్రాణం పెట్టే ఫ్యామిలీ అది. అత్తలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు.. ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరూ అమ్మానాన్నలతో ఎంతో స్నేహంగా మెలిగేవారు. నాన్నమ్మ, తాతయ్య కూడా అమ్మను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకునే వారు. పండగో, ఏదైనా ప్రత్యేక సందర్భమో వచ్చిందంటే ఇల్లంతా సందడి నెలకొనేది. ఇలాంటి ప్రేమానురాగాల మధ్య పెరిగిన నేను.. పెళ్లయ్యాక ఇలాంటి కుటుంబంలోకే అడుగుపెట్టాలని కోరుకున్నా. అయితే అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా! ఏదైతేనేం.. బీటెక్‌ పూర్తై ఉద్యోగం వచ్చాక అభిషేక్‌తో నా పెళ్లైపోయింది. తను ఉద్యోగం చేసేది బెంగళూరులో.. కాబట్టి నేనూ పెళ్లి తర్వాత అక్కడికే బదిలీ పెట్టుకున్నా. అభి చాలా మంచివాడు.. ఇంట్లో ఒకరికొకరం.. ఆఫీస్‌కెళ్లినా సమయం దొరికినప్పుడల్లా ఊసులాడుకునేవాళ్లం. ఇలా రెండేళ్ల మా వైవాహిక బంధంలో లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలు! ఆ తర్వాత నేను అమ్మను కాబోతున్నానన్న విషయం మా ఇద్దరి జీవితాల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపింది.

గర్భిణిగానూ కొన్ని నెలలు ఆఫీసుకెళ్లాను.. మరికొన్నిసార్లు నీరసంగా అనిపించి ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలోనే నాకు తోడుగా ఉండడానికని మా వారు మా అత్తయ్యను తీసుకొచ్చారు. తనంటే నాకు ముందు నుంచే కాస్త బెరుకు, భయం! ఎందుకంటే తనకు చాదస్తం ఎక్కువ.. చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక వంక పెట్టి ఓ మాట అనాలని చూస్తుంది. కోడలిపై అత్తగా పెత్తనం చెలాయించాలనుకుంటుంది. నాకేమో అది నచ్చదు.. మా అమ్మలాగే తనతో కలిసిపోవాలని ఉన్నా.. ఆమె చేష్టలు నాకు విసుగు తెప్పించేవి. బహుశా.. ఎక్కువగా గ్రామీణ వాతావరణంలో ఉండడం వల్ల ఆమె ఇలా చేస్తుందేమోనని సర్దుకుపోయేదాన్ని. లేనిపోని గొడవలెందుకని ఈ విషయాలు మావారి దాకా తీసుకెళ్లేదాన్ని కాదు! ఇదే అదనుగా తీసుకొని కొన్ని సార్లు పాత కాలపు మూఢనమ్మకాలు నా మీద రుద్దాలని చూసేది. గర్భిణిగా ఉన్న సమయంలో ఆవు పేడ తింటే సహజ కాన్పు అవుతుందని ఊర్లో ఎవరో సాధువు చెప్పారని.. ఓ రోజు బలవంతంగా నాతో పేడ తినిపించాలని చూసింది. నిపుణుల సలహా మేరకు నేను తీసుకునే ప్రతి ఆహార పదార్థం కడుపులోని బిడ్డకు మంచిది కాదని నన్ను పెడదోవ పట్టించాలని చూసేది.

******

ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె నాకు సహాయం చేయడమేమో గానీ తన చేష్టలతో టార్చరే ఎక్కువగా పెట్టేది. వీటన్నింటితో నాలో మానసిక సంఘర్షణ పెరిగిపోయింది. ఇక ఊరుకుంటే దీని ప్రభావం నామీదా, కడుపులోని నా బిడ్డ మీదా పడుతుందన్న ఉద్దేశంతో ఆమె చేష్టల గురించి ఓ రోజు మా వారితో చెప్పాను. తను భార్యను ఎంతగా ప్రేమిస్తాడో.. కన్నతల్లినీ కాదనుకోలేడని తెలుసు. అయినా వీటి గురించి ఆమె దగ్గర ఓ రోజు ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే తను మాత్రం నాతో అలాంటివేమీ చేయట్లేదంటూ అడ్డంగా అబద్ధమాడేసింది.  అది చూసి  ‘ఇంత సులభంగా అబద్ధం ఎలా చెప్పగలుగుతార’ని నిర్ఘాంతపోవడం నా వంతైంది. దాంతో మా వారికి కూడా ఏమనాలో తెలియలేదు. ఇక ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రసవానికి మా పుట్టింటికి వెళ్లాను. మేము కోరుకున్నట్లుగానే మహాలక్ష్మి పుట్టింది. ఆరు నెలలు ప్రసవానంతర సెలవు దొరకడంతో పుట్టింట్లోనే ఉండిపోయా. ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు ఇంటి నుంచే పనిచేశా. అయితే ఆపై ఆ అవకాశం లేకపోవడంతో ఆఫీస్‌కి వెళ్లక తప్పలేదు.

అప్పటికే పాప వయసు ఏడాది దాటింది. నేను, అభి ఆఫీస్‌కి వెళ్తే పాపను చూసుకోవడానికి అమ్మ కొన్ని నెలల పాటు మాతోనే ఉంది. ఆ తర్వాత మళ్లీ మా అత్తయ్యను తీసుకొచ్చారు మావారు. దాంతో నా సమస్యలు మళ్లీ మొదలయ్యాయి! కానీ తప్పదు! అయితే ఇక్కడ నా భయమేంటంటే.. తన చాదస్తపు అభిప్రాయాలు, మూఢ నమ్మకాలు ఎక్కడ నా కూతురిపై రుద్దుతుందోనని ఆఫీసుకెళ్లిన అనుక్షణం భయపడుతుండేదాన్ని. ఈ మానసిక ఒత్తిడితో పని కూడా సరిగ్గా చేయలేకపోయేదాన్ని. దాంతో పాప కాస్త పెద్దయ్యే వరకు ఉద్యోగం మానేద్దామనుకున్నా. మా ఆయన సలహా తీసుకున్నాక వెంటనే రాజీనామా చేశాను. అయితే ఆ తర్వాతైనా మా అత్తయ్య ఊరికి వెళ్లిపోతుందనుకున్నా.. కానీ ఈసారి తనకు మా మామగారు కూడా తోడయ్యారు.. అప్పుడప్పుడూ మా ఆడపడుచులు, తోటికోడళ్లు.. కూడా వచ్చి వెళ్తుండేవారు. ఇక ఇలాంటి సందర్భాల్లో నా మీద మరింత భారం పడేది. ఓవైపు పాపను చూసుకుంటూనే.. మరోవైపు వాళ్లకు అతిథి మర్యాదలు చేసేదాన్ని. అయినా ఏదో ఒక మాట అనడమే పనిగా పెట్టుకునేది మా అత్తగారు.

******

వీటికి తోడు ఇంటి కోడలు మగాళ్ల ముందు కుర్చీలో కూర్చోకూడదని, మగాళ్లు తిన్నాకే ఆడవాళ్లు తినాలని.. ఇలా నా ఇంట్లో నాకే నరకం చూపించేది. కోడలిగా అత్తింటి వారికి గౌరవమర్యాదలు, అతిథి సత్కారాలు చేయడం వరకు సరే.. అంతేకానీ అత్తింట్లో కోడలు ఓ మెట్టు కిందే ఉండాలని ఎక్కడా రాసిపెట్టిలేదు. ఇదంతా ఒకెత్తనుకుంటే.. అందరూ తిన్నాకైనా కంచం ముందు కూర్చుంటే.. ‘అసలే నువ్వు చంటి బిడ్డ తల్లివి.. ఇంత సమయం కడుపు మాడ్చుకోకూడదు..’ అంటూ మావారి ముందు ఎక్కడ లేని ప్రేమా ఒలకబోసేది. ఇలా అత్తగారి చేష్టలకు మామగారు కూడా వంత పాడేవారు. ఒక్కోసారి ఇవన్నీ గమనించినా.. చూసీ చూడనట్లుగా వెళ్లిపోయేవాడు అభి. ఇలాంటి వాతావరణంలోనే నాలుగేళ్లు గడిచిపోయాయి. నా పాపకు ఐదేళ్లొచ్చాయి. అత్తమామల వింత ప్రవర్తనతో విసిగివేసారిపోయా. ఇకనైనా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే.. ఇటు నా జీవితమూ గాడిలో పడదు.. అటు అప్పుడప్పుడే లోకం తెలుసుకుంటోన్న నా బిడ్డ మనసు పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఈ ఆలోచనతోనే మా అత్తమామల్ని వారి ఊరికి పంపించేద్దామని మావారిని సున్నితంగా అడిగి చూశా. ఇదే విషయం గురించి ఆయన వాళ్లతో మాట్లాడితే.. ‘ఏంట్రా! నీ కూతురు పెద్దదైపోయింది.. నీకు మా అవసరం తీరిపోయింది.. అంతేగా నువ్వు చెప్పేది’ అంటూ వెళ్లమన్నట్లుగా మాట్లాడారు. సరే.. జరిగిందేదో జరిగిపోయింది.. ఇవన్నీ మర్చిపోయి తనను నేను కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటా.. అయితే తను నన్ను కన్న కూతురిలా కాకపోయినా.. తన చాదస్తపు మాటలు, ప్రవర్తనతో విసిగించకపోతే చాలు.. అనుకున్నా. కానీ ఆమెపై ఆ నమ్మకం నాకు ఎప్పుడో పోయింది. ఇక జీవితాంతం నేను తనతో కలిసి బతకాల్సిందేనని నాకు అర్థమైంది.. కానీ ఆ ఆలోచనే నా మనసును డిప్రెషన్‌లోకి నెట్టేస్తోంది. అటు ఆవిడ మారదు.. క్షణక్షణం నన్ను నేను మోసం చేసుకుంటూ బతకలేను.. ఈ డోలాయమానంలో ఇంటి వాతావరణం చక్కదిద్దాలంటే ఏం చేయాలో మీరైనా ఓ మంచి సలహా ఇస్తారా..? 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్