Lulu Lotus: ఈమె నోటితో ఈల వేయదు.. మరి?!

ఈల.. ఒకప్పుడు అబ్బాయిలకు మాత్రమే సొంతమైన నైపుణ్యం. కానీ ఈతరం అమ్మాయిలు అబ్బాయిలతో పోటీ పడి మరీ ఈల వేస్తున్నారు. సాధారణంగా ఈల అంటే నోటితో వేయడం మనకు తెలుసు.

Published : 12 Jan 2024 12:21 IST

(Photos: Screengrab)

ఈల.. ఒకప్పుడు అబ్బాయిలకు మాత్రమే సొంతమైన నైపుణ్యం. కానీ ఈతరం అమ్మాయిలు అబ్బాయిలతో పోటీ పడి మరీ ఈల వేస్తున్నారు. సాధారణంగా ఈల అంటే నోటితో వేయడం మనకు తెలుసు. కానీ, కెనడాకు చెందిన లులు లోటస్‌ అనే మహిళ మాత్రం అందరిలా నోటితో కాకుండా ముక్కుతో ఈల వేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తన ప్రత్యేకతతో తాజాగా ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించుకుంది. మరి, లులుకు ఇదెలా సాధ్యమైందో తెలుసుకుందామా...

ఏడేళ్ల వయసులో...

లులుది కెనడాలోని మిస్సిసాగా అనే ప్రాంతం. అందరిలాగే సాధారణ అమ్మాయిలా పెరిగిన లులుకి.. తనలో ముక్కుతో ఈల వేసే నైపుణ్యం ఉందన్న విషయం ఏడేళ్ల వయసులో తెలుసుకుందట! ఈ క్రమంలోనే తన నైపుణ్యాన్ని అందరి ముందూ ప్రదర్శించడానికి విపరీతమైన ఆసక్తి కనబరిచేదట. ఈ క్రమంలో అప్పుడప్పుడూ తరగతి గదిలోని టీచర్లు, స్నేహితులతో ప్రాంక్ చేసేదట. తను ముక్కుతో ఈల వేసినప్పుడు ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తుందోనని తన చుట్టూ ఉన్న వారంతా తెగ వెతికేవారట. ఇలా ఎవరూ కనిపెట్టకుండా ముక్కుతో ఈల వేస్తూ అందరినీ ఆటపట్టించడం చాలా సందర్భాల్లో ఆస్వాదించినట్టు లులు చెప్పుకొచ్చింది.

ఆ డాక్యుమెంటరీతో ..

లులు తన గొంతు కండరాలను సవరించుకొని ముక్కులోంచి గాలి వచ్చేలా చేస్తుంది. తద్వారా ముక్కుతో ఈల వేస్తుంటానని లులు అంటోంది. ఓ సందర్భంలో సంగీత కళాకారుడు స్టీవ్‌ అయోకికి సంబంధించిన డాక్యుమెంటరీని చూసిందామె. ఈ క్రమంలో అతడు తన సంగీత ప్రతిభతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడని తెలుసుకుంది. దాంతో లులు కూడా తన ప్రత్యేకతతో ప్రపంచ రికార్డ్‌ సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పట్నుంచి గిన్నిస్‌ రికార్డే లక్ష్యంగా ప్రయత్నించానంటోందామె.

ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది...

గిన్నిస్‌ రికార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రికార్డు సాధించాలంటే ఎలా ముందుకెళ్లాలి? వంటి వివరాలన్నీ తెలుసుకున్న లులు.. ఈ క్రమంలో ‘ఈల’ను రికార్డ్‌ చేయడానికి వివిధ రకాల పరికరాలను ఉపయోగించాలని తెలుసుకుంది. అలా ముక్కుతో ఈల వేసి ఓ పరికరం సహాయంతో రికార్డు చేసిన ఈల శబ్దం 44.1 డెసిబుల్స్‌గా నమోదైంది. దాంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు లులు ఘనతను ‘అత్యంత బిగ్గరగా వేసిన ఈల’గా గుర్తించారు. తాజాగా సంబంధిత రికార్డు పత్రాన్ని ఆమెకు అందించారు. దాంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందని సంబరపడిపోతోందామె.

‘గది లోపల ఈల శబ్దాన్ని రికార్డ్‌ చేయడానికి వాతావరణం అనువుగా ఉంది. అక్కడున్న అధునాతన సాంకేతికత, నిపుణుల సహాయంతో అనుకున్న దానికంటే వేగంగానే ఈలను రికార్డ్‌ చేయగలిగాను..’ అంటోన్న లులు.. తన ఈల రికార్డ్‌కు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా రెండు రోజుల్లోనే 7 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. దాంతో లులు ప్రత్యేక నైపుణ్యాలు ప్రపంచమంతా పాకాయి.

వేధింపుల్ని ఎదుర్కొని..

లులు ప్రత్యేకత గురించి తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలిస్తే అంతే బాధ కూడా కలుగుతుంది. ఒకానొక సమయంలో లులు తన భర్త చేతిలో గృహహింసను ఎదుర్కొంది. ఆ బాధను తట్టుకోలేక వివాహ బంధం నుంచి బయటికొచ్చి.. తన ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. లులు వీగన్‌ డైట్‌ను అనుసరిస్తుంది. అయితే ఈ డైట్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతోన్న ఆమె.. పిల్లలకూ వీగన్‌ డైట్‌పై అవగాహన పెంచాలనుకుంది. ఈ క్రమంలోనే ఈ ఆహార శైలిపై పలు స్టోరీ బుక్స్‌ రాసి మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అలాగే తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా వివిధ అంశాలపై వీడియోలు రూపొందిస్తూ పోస్ట్‌ చేస్తుంటుంది లులు.

లులు ఐదేళ్ల కొడుక్కి కూడా ఈ ప్రత్యేకమైన నైపుణ్యం ఉందట. తన బాబు కూడా ముక్కుతో ఈల వేస్తాడని అంటోన్న ఈ విజిల్‌ మామ్‌.. పెద్దయ్యాక తన కొడుకే తన రికార్డును చెరిపేసినా ఆశ్చర్యం లేదంటోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్