Shikha Malhotra: కరోనా, పక్షవాతం.. రెంటినీ జయించి.. ఇప్పుడు నటిగా రీఎంట్రీ!

జీవితంలో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముడితే జీవితమే వ్యర్థమనిపిస్తుంది.. కానీ ఇలాంటి సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకొని, సానుకూల దృక్పథంతో అడుగు ముందుకేస్తే.. శిఖా మల్హోత్రాలా తిరిగి నిలబడగలుగుతాం. వృత్తిరీత్యా నటి అయినా కొవిడ్‌ సమయంలో నర్సుగా నిస్వార్థమైన సేవలందించిన ఆమె.. కరోనా సోకి ఒక దశలో చావు అంచుల దాకా వెళ్లింది.

Published : 29 Jul 2023 13:12 IST

(Photos: Instagram)

జీవితంలో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముడితే జీవితమే వ్యర్థమనిపిస్తుంది.. కానీ ఇలాంటి సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకొని, సానుకూల దృక్పథంతో అడుగు ముందుకేస్తే.. శిఖా మల్హోత్రాలా తిరిగి నిలబడగలుగుతాం. వృత్తిరీత్యా నటి అయినా కొవిడ్‌ సమయంలో నర్సుగా నిస్వార్థమైన సేవలందించిన ఆమె.. కరోనా సోకి ఒక దశలో చావు అంచుల దాకా వెళ్లింది. నెలల తరబడి ఆస్పత్రిలోనే గడపాల్సి వచ్చింది. పక్షవాతంతో ఒకవైపు శరీరం చచ్చుబడిపోయిన ఆమెను చూసి.. తాను లేచి నడిస్తే చాలనుకున్నారంతా! కానీ నడవడం కాదు.. ఏకంగా నటిగా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. తాను తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన తన ఫొటోలు. బికినీ ధరించి నాజూగ్గా కనిపిస్తోన్న తన ఫొటోలతో పాటు.. తన జీవితంలో తానెదుర్కొన్న గడ్డు రోజుల్ని గుర్తు చేసుకుంటూ పెట్టిన క్యాప్షన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన చాలామంది తన పట్టుదల, వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ఆమె కోలుకున్న తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం మీకోసం..!

దిల్లీకి చెందిన పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది శిఖా మల్హోత్రా. చిన్న వయసు నుంచే చదువుతో పాటు ఇతర వ్యాపకాల్లోనూ చురుగ్గా ఉండేదామె. ఈ క్రమంలోనే డ్రామా, పెయింటింగ్‌, కవితల్లో ప్రతిభ కనబరిచి పలు అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే శిఖ తల్లి వృత్తిరీత్యా నర్సు. ఆమె స్ఫూర్తితోనే తానూ నర్సింగ్‌ చదవాలనుకున్నట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందామె.

అమ్మ స్ఫూర్తితో..!

‘చిన్నతనం నుంచి నేను అన్ని విషయాల్లో చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. అయితే ఉన్నట్లుండి ఒక రోజు నిద్ర లేచేసరికి నా శరీరమంతా చచ్చుబడిపోయినట్లనిపించింది. చూపు, మాట మినహా.. నా శరీరంలోని ఏ భాగాన్నీ కదిలించలేకపోయా.. ఇది చూసి అమ్మానాన్న ఒక్కసారిగా షాకయ్యారు. అయితే అమ్మ నర్సు కావడంతో వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించింది. ఆపై ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించడంతో మూడేళ్ల తర్వాత పూర్తిగా కోలుకున్నా. తిరిగి చదువు కొనసాగించా. నర్సుగా సేవలందిస్తోన్న అమ్మను చూసి నేనూ నర్సింగ్‌ చదవాలనుకున్నా.. ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంటర్‌ పూర్తి కాగానే ఈ విషయం అమ్మానాన్నలతో చెప్పా. వాళ్లూ అందుకు ఒప్పుకోవడంతో నా కల నెరవేరింది. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి చెందిన వర్ధమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజీలో నర్సింగ్‌ ఆఫీసర్ డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికేషన్‌ సంపాదించా. అయితే నర్సుగా విధుల్లో చేరే ముందు నాలో ఉన్న కళా నైపుణ్యాల్ని ప్రదర్శించాలన్న కోరికను అమ్మానాన్నలతో చెప్పా. వాళ్లూ సరేననడంతో 2014లో ముంబయి చేరుకున్నా. ఓవైపు మ్యూజికల్‌ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేదాన్ని. ఈ క్రమంలోనే కాంచ్లీలో నటించే అవకాశం తలుపు తట్టింది. హీరోయిన్‌గా ఇది నా తొలి చిత్రం..’ అంటూ చెప్పుకొచ్చింది శిఖ.

నర్సుగా.. కొవిడ్‌ సేవలు!

‘కాంచ్లీ’ కంటే ముందుగానే షారుఖ్‌ నటించిన ‘ఫ్యాన్‌’, తాప్సీ చిత్రం ‘రన్నింగ్‌ షాదీ’ల్లో కీలక పాత్రల్లో నటించిన శిఖ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్‌గా తన తొలి చిత్రం కాంచ్లీ విడుదలైన నెల రోజులకే.. మన దేశంలో కొవిడ్‌ విజృంభించడంతో నర్సుగా విధుల్లో చేరానంటోందామె.

‘కాంచ్లీ విడుదలకు ముందే నటిగా నాకు మంచి గుర్తింపొచ్చింది. దీంతో నర్సింగ్‌ కెరీర్‌ని కొన్ని రోజులు వాయిదా వేయాలనుకున్నా. కానీ ఈ సినిమా విడుదలైన నెల రోజులకే కొవిడ్‌ విజృంభణ మొదలైంది. రెండో ఆలోచన లేకుండా నర్సుగా విధులు నిర్వర్తించాలనుకున్నా. ఇందుకేనేమో.. ఆ భగవంతుడు ముందుగానే నాతో నర్సింగ్‌ పూర్తిచేయించాడనిపించింది! నా నర్సింగ్‌ డిగ్రీతో ముంబయిలోని ‘హిందూ హృదయ్‌ సమ్రాట్‌ బాలాసాహెబ్‌ థాక్రే ఆస్పత్రి’కి వెళ్తే.. తొలుత అక్కడ ఎలాంటి నర్సింగ్‌ ఉద్యోగాలు లేవని చెప్పారు.. భవిష్యత్తులో ఉంటే పిలుస్తామంటూ దరఖాస్తు పెట్టుకోమన్నారు. కానీ నేను ఉద్యోగం చేయడానికి రాలేదు.. కొవిడ్‌ బాధితులకు నర్సింగ్‌ సేవలందించడానికి వచ్చానని.. మెడికల్‌ సూపరింటెండెంట్‌ని కలవడానికి అనుమతించమని కోరా. ఒక నటి నర్సుగా సేవలందించడమేంటి? అదీ కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో..! అని అందరూ నా ధైర్యాన్ని ప్రశంసించారు.. ఇలా ఆ ఆస్పత్రి ఐసీయూలో దాదాపు ఏడాది పాటు కొవిడ్‌ బాధితులకు సేవలందించా.. మరోవైపు బాధితుల్లో ఒంటరితనాన్ని దూరం చేయడానికి వారికి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చా..’ అంటూ మరో సందర్భంలో తన గత అనుభవాలను పంచుకుందీ కొవిడ్‌ వారియర్.

సమస్యలతో ఊపిరాడలేదు!

‘పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు..’ ఓవైపు తన ప్రాణాలను పణంగా పెట్టి కొవిడ్‌ బాధితులకు సేవలందించిన శిఖకు కూడా ఈ మహమ్మారి సోకింది. ఆ తర్వాత ఒక అనారోగ్యం తర్వాత మరొకటి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒకానొక దశలో అసలు తన కాళ్లపై తాను నిలబడగలుగుతానో, లేదో అనుకున్న తాను.. సంకల్పబలంతోనే తిరిగి నిలబడగలిగానంటూ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది.

‘కొవిడ్‌ ఐసీయూ వార్డులో ఏడాది సేవలందించాక నాకూ కరోనా సోకింది. దీన్నుంచి కోలుకునే క్రమంలోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. పక్షవాతంతో కుడివైపు శరీరం చచ్చుబడిపోయింది. దీంతో తిరిగి నిలబడగలుగుతానా? నటిగా కెరీర్‌ని కొనసాగించగలుగుతానా? అనుకున్నా. ఇక ఈ సమస్యల నుంచి బయటపడే క్రమంలో నేను వాడిన స్టెరాయిడ్స్‌తో నా శరీరం ఉబ్బిపోయింది.. విపరీతంగా బరువు పెరిగా.. ఊబకాయం వేధించింది. ఇలా వీటన్నింటి నుంచి నెమ్మదిగా కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. అప్పుడే నిర్ణయించుకున్నా.. తిరిగి మునుపటి శిఖలా సినిమాల్లోకి రావాలని! గతంలో నేనెప్పుడూ నా బికినీ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయలేదు. కానీ ఇన్ని అనారోగ్యాల నుంచి నేను బయటపడగలిగానంటే.. అందుకు నా సంకల్ప బలమే కారణం. ఇది తెలియజేయడానికే ఇప్పుడు బికినీతో మీ అందరి ముందుకొచ్చా. సంకల్పం, ధైర్యం ఉంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నుంచైనా బయటపడగలుగుతాం. కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని జీవితాన్ని గెలిచిన వారందరికీ ఈ పోస్టు అంకితం. అన్నట్లు.. త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్ట్‌తో మళ్లీ మీ అందరి ముందుకు రాబోతున్నా..’ అంటూ తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలతో, తన తాజా ఫొటోల్ని కొలేజ్‌ చేసి పోస్ట్‌ చేసింది శిఖ.

ఇలా ఆమె పెట్టిన పోస్ట్‌, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని జయించిన ఆమె ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘మేడం.. మీరు మా అందరికీ స్ఫూర్తి.. మీ సేవలు మాకు గర్వకారణం.. అనారోగ్యాల్ని జయించి తిరిగి కోలుకోవడంతో సంతోషంగా ఉంది.. ఆల్‌ ది బెస్ట్‌!’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ.. ‘మంచి వాళ్లకే ఎందుకు చెడు జరుగుతుందో అర్థం కాదు.. ఏదైతేనేం.. ఎంతో బాధను భరించి కోలుకొని నిలబడగలిగారు..’ అంటూ ప్రశంసిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్