Alia Bhatt: తనతో ప్రతిరోజూ కొత్తగానే ఉంటుంది!
కొత్తగా తల్లైన మహిళలకు వర్క్-లైఫ్ బ్యాలన్స్ ఓ పెద్ద సవాలు. దేనికి ప్రాధాన్యమివ్వాలి? దేన్ని పక్కన పెట్టేయాలన్న విషయంలో వారిలో ఒక రకమైన సందిగ్ధత నెలకొంటుంది. ఈ రెండింట్లో దేన్ని నిర్లక్ష్యం చేసినా అటు వ్యక్తిగతంగా, ఇటు కెరీర్ పరంగా ఇబ్బందులు....
(Photos: Instagram)
కొత్తగా తల్లైన మహిళలకు వర్క్-లైఫ్ బ్యాలన్స్ ఓ పెద్ద సవాలు. దేనికి ప్రాధాన్యమివ్వాలి? దేన్ని పక్కన పెట్టేయాలన్న విషయంలో వారిలో ఒక రకమైన సందిగ్ధత నెలకొంటుంది. ఈ రెండింట్లో దేన్ని నిర్లక్ష్యం చేసినా అటు వ్యక్తిగతంగా, ఇటు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ బ్యాలన్స్ తప్పకుండా జాగ్రత్తపడుతున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ప్రస్తుతం 8 నెలల చిన్నారికి తల్లైన ఆమె.. ఓవైపు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూనే.. మరోవైపు తన ఇంటికీ, చిన్నారి ఆలనా పాలనకూ తగిన సమయం కేటాయిస్తున్నానంటూ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. మరి, ఆలియా పాటిస్తోన్న ఆ వర్క్-లైఫ్ బ్యాలన్స్ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
గతేడాది ఏప్రిల్‌లో తన ఇష్టసఖుడు రణ్‌బీర్ కపూర్‌తో ఏడడుగులు వేసింది ఆలియా. ఆపై నవంబర్‌లో తన ముద్దుల కూతురు రాహాను తమ జీవితంలోకి ఆహ్వానించిందీ ముద్దుల జంట. గర్భిణిగా ఉన్న సమయంలోనే కాదు.. తల్లయ్యాకా కొన్నాళ్లకే తిరిగి తన కెరీర్‌లో బిజీగా మారిపోయిందీ చక్కనమ్మ. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రంతో హాలీవుడ్‌లోకీ ప్రవేశించిన ఆలియా.. ఇంత బిజీ లైఫ్‌స్టైల్‌లోనూ ఇంటికి, కెరీర్‌కి సమ ప్రాధాన్యమిస్తున్నానంటూ.. తన వర్క్-లైఫ్ బ్యాలన్స్ చిట్కాల్ని పంచుకుంది.
పదేళ్లలో ఎన్నో మార్పులు!
‘నేను సినిమాల్లోకొచ్చి పదేళ్లు దాటింది. ఈ దశాబ్ద కాలంలో నా జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సినిమాలు, షూటింగ్స్ అంటూ.. నిద్రను, కుటుంబాన్ని త్యాగం చేసిన రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకంటూ ఓ కుటుంబం ఉంది. భర్త, కూతురు ఉన్నారు. వాళ్లకంటూ తగిన సమయం కేటాయించాల్సిన బాధ్యత నాపై ఉంది. అంతేకాదు.. ఈ పదేళ్లలో నా కుటుంబం, స్నేహితులతో మిస్సయిన సమయాన్ని ఇప్పుడు కేటాయించాలని నిర్ణయించుకున్నా. అలాగని కెరీర్‌ని వదిలిపెట్టను. రెండింటినీ బ్యాలన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఈ క్రమంలో ప్రాధాన్యాల్ని పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగుతున్నా. ఈ విషయంలో నా కూతురు రాహానే నా తొలి ప్రాధాన్యం. అంతేకాదు.. నేను చేసే ప్రతి పనిలోనూ తప్పా, ఒప్పా అని అక్కడే ఆగిపోకుండా.. పాజిటివ్‌గా అడుగు ముందుకేస్తున్నా. ఇక ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ పక్కన పెట్టేస్తే పాపతో, కుటుంబంతో గడపడానికి బోలెడంత సమయం దొరుకుతుంది. వీటన్నింటితో పాటు నా ఆరోగ్యం, ఇష్టాయిష్టాల పైనా దృష్టి పెడుతున్నా. ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఈ బ్యాలన్స్ నాకు ఎంతో దోహదం చేసింది..’ అంటూ చెప్పుకొచ్చిందీ న్యూ మామ్.
ఆ మధురానుభూతిని మర్చిపోను!
అమ్మతనం ప్రతి మహిళ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. పెరిగే బాధ్యతలూ మనకెన్నో మంచి విషయాలు నేర్పుతాయి. రాహా పుట్టాక తన జీవితం ఎంతో మారిపోయిందంటోంది ఆలియా. ముఖ్యంగా గతంలో కంటే ఇప్పుడు ఎంతో ఓపికతో వ్యవహరిస్తున్నానని చెబుతోంది.
‘రాహాకు పాలిస్తున్నప్పుడు తను నావైపు చూస్తూ నా ముఖాన్ని తడుముతుంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న మధురానుభూతి అది. తనతో ప్రతిరోజూ కొత్తగానే ఉంటుంది. అమ్మయ్యాక నాలో వచ్చిన గొప్ప మార్పేంటంటే.. ఓపిక! గతంలో చీటికీ మాటికీ కోపగించుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ కోపం నాలో లేదు. ప్రతి విషయాన్నీ నిదానంగా ఆలోచించడం మొదలుపెట్టా. ఈ ఓపికే నాలో మనోబలాన్ని పెంచింది..’ అంటోంది ఆలియా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.