Published : 13/12/2021 20:40 IST

కత్రినా అక్కచెల్లెళ్ల గురించి తెలుసా?

(Photo: Instagram)

సుఖమైనా, కష్టమైనా.. ముందు ఇంట్లో, అది కూడా తోబుట్టువులతో పంచుకోవడం మనకు అలవాటు! ఎందుకంటే వాళ్లే అన్ని వేళలా మనకు అండగా నిలుస్తారన్న ధైర్యం, నమ్మకం! తన అక్కచెల్లెళ్లతో తనదీ అలాంటి అనుబంధమే అంటోంది కొత్త పెళ్లి కూతురు కత్రినా కైఫ్‌. వాళ్లే తన బలం, బలహీనత, ధైర్యం అంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ భావోద్వేగపూరిత పోస్ట్‌ పెట్టింది. ఇది చూసిన వాళ్లంతా ఒకింత ఎమోషనల్‌ అవడమే కాదు.. క్యాట్‌ సోదరీమణుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరూ అదే పనిలో ఉన్నారా? అయితే ఇది చదివేయండి!

బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌ తన ప్రియుడు విక్కీ కౌశల్‌తో ఇటీవలే ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే! ఈ పెళ్లిలో భాగంగా కత్రినా ఆరుగురు సోదరీమణులే ఆమెకు తోడు పెళ్లికూతుళ్లయ్యారు. ‘Phoolon ki Chaadar’ (వధువును వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చే తంతు) లో భాగంగా వారంతా వెంట ఉండి మరీ ఆమెను సాదరంగా వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చారు. తాజాగా ఇదే ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది క్యాట్.

ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే..!

నిజానికి ఇసాబెల్ కాకుండా కత్రినాకు మరో ఐదుగురు అక్కచెల్లెళ్లున్నారన్న విషయం ఈ పెళ్లి ద్వారానే చాలామందికి తెలిసిందని చెప్పచ్చు. అయితే తమ మధ్య ఉన్నది అక్కచెల్లెళ్లకు మించిన అందమైన బంధమంటోంది కత్రినా.
‘పెరిగి పెద్దయ్యే క్రమంలో మేమంతా ఒకరికొకరు ప్రాణంగా మెలిగాం. ప్రతి విషయంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం.. ఎంతో కేరింగ్గా ఉన్నాం. నా ఆరుగురు అక్కచెల్లెళ్లే నా బలం. ఈ ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ బాలీవుడ్‌ అందం. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సోదరీమణుల ప్రేమను చూసి ఒకింత భావోద్వేగానికి గురవుతూనే.. మరోవైపు తమ తోబుట్టువులతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.

ఎవరా ఆరుగురు?

ఇక కత్రినా తోబుట్టువుల విషయానికొస్తే.. ఆమెకు ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఒక అన్నయ్య.

* పెద్దక్క Stephanie Turcotte. తన వ్యక్తిగత విషయాలను చాలా రహస్యంగా ఉంచుతుందామె. అయితే తన పెట్‌ డాగ్‌ అంటే ఆమెకు ప్రాణమట! ఈ క్రమంలోనే దాంతో ఫొటోలు దిగుతుంటుంది.

* Christine Turcotte ఆమె రెండో అక్క. నాట్‌ స్పెన్సర్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం గృహిణిగా కొనసాగుతోంది.

* కత్రినా మూడో అక్క Natacha Turcotte Ogorman. ఆమె ఓ జ్యుయలరీ డిజైనర్.

* ఇక మరో సోదరి Melissa Turcotte గణిత శాస్త్రవేత్తగా పేరు గడించింది. ప్రతిష్ఠాత్మక ‘Laing O’ Rourke Mathematics Award’ అందుకుందామె.

* ఆమె తర్వాతి చెల్లెలు ఇసాబెల్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తను మోడల్‌గా, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇప్పటికే ‘Kwatha’, ‘Suswagatam Khushaamadeed’.. వంటి చిత్రాల్లో నటించింది. అలాగే తనో డాగ్‌ లవర్‌. ఈ క్రమంలో తన పెట్స్‌తో దిగిన ఫొటోల్ని తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది కూడా!

* ఇక కత్రినా ఆఖరి చెల్లెలు Sonia Turcotte. ఆమె ఫొటోగ్రాఫర్‌గా, గ్రాఫిక్‌ డిజైనర్‌గా కొనసాగుతోంది.

* క్యాట్‌కు ఓ అన్న కూడా ఉన్నాడు. అతని పేరు Sebastien Laurent Michel. తోబుట్టువుల్లో రెండో వాడైన ఆయన ప్రస్తుతం ఫర్నిచర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేయడమన్నా ఆయనకు మక్కువట!

వెల్‌కమ్‌.. బావగారూ!

కత్రినాతో ఏడడుగులు నడిచి ఓ పెద్ద కుటుంబంలోకి అడుగుపెట్టాడు మన విక్కీ. దీంతో కత్రినా చెల్లెలు ఇసాబెల్ కైఫ్‌ బావను సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. ‘బావగారూ! మా క్రేజీ కుటుంబంలోకి స్వాగతం. మీ రూపంలో మాకు ఒక అన్నయ్య దొరికాడు.. అక్కాబావలకు వివాహ శుభాకాంక్షలు!’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ మరదలు పిల్ల.

ఇక కత్రినా అన్న సెబాస్టియన్‌.. ‘మాదో అందమైన కుటుంబం. విక్కీ రూపంలో మా ఇంట్లోకి మరో తోబుట్టువు వచ్చాడు. నా చెల్లెలు తనకు తగిన వరుడిని ఎంచుకుంది.. ఈ సృష్టిలోని సంతోషమంతా మీది కావాలని కోరుకుంటున్నా..’ అంటూ పోస్ట్‌ పెట్టాడు.

 

తను లేని నేను లేను!

ఇక కత్రినాకు తన తల్లి సుజానేతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే క్యాట్‌ తరచూ తన తల్లితో దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ‘అమ్మతో నాకున్న జ్ఞాపకాలన్నీ అమూల్యమైనవి. చిన్నప్పుడు తనతో కలిసి డ్యాన్స్‌ చేయడం నాకెప్పటికీ గుర్తే. నాకు తెలిసిన గొప్ప, బలమైన వ్యక్తి అమ్మే! నువ్వు లేని నేను లేనమ్మా!’ అంటూ అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటుంది క్యాట్‌. లాయర్‌గా తన కెరీర్‌ ప్రారంభించిన సుజానే.. ప్రస్తుతం టీచర్‌గా పనిచేస్తూనే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 

వీళ్ల ఫ్యామిలీ పెద్దదేనట!


 

కత్రినా కైఫే కాదు.. అంతర్జాతీయంగా పేరు మోసిన పలు సెలబ్రిటీలకూ ఎక్కువ మంది తోబుట్టువులున్నారు. వారిలో..

* అమెరికన్‌ సింగర్‌ మడోన్నాకు ఏడుగురు తోబుట్టువులున్నారు. వారిలో ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులతో పాటు ఒక సవతి సోదరి, ఒక సవతి సోదరుడు ఉన్నారు.

* మరో అమెరికన్‌ గాయని డాలీ పార్టన్‌కు ఆరుగురు సోదరులు, ఐదుగురు సోదరీమణులున్నారు.

* ప్రముఖ గాయని రిహన్నాకు ఐదుగురు తోబుట్టువులు. వారిలో ఇద్దరు సోదరులు, ఇద్దరు సవతి సోదరీమణులు, ఒక సవతి సోదరుడు.

* అమెరికన్‌ మోడల్‌ కైల్‌ జెన్నర్‌కి తొమ్మిది మంది తోబుట్టువులు. వారిలో ఒకరు సొంత సోదరి కాగా.. నలుగురు సవతి సోదరీమణులు, మరో నలుగురు సవతి సోదరులున్నారు. కిమ్‌ కర్దాషియన్‌, ఖోలే కర్దాషియన్‌, కౌర్ట్నీ కర్దాషియన్‌, కైల్‌ జెన్నర్‌, కెండల్‌ జెన్నర్‌.. వంటి సెలబ్రిటీలు చాలామందికి సుపరిచితమే!

వీళ్ల గురించి వింటుంటే ‘అబ్బా.. ఎంత పెద్ద ఫ్యామిలీనో!’ అనిపిస్తోంది కదూ! మరి, మీదీ ఇలాంటి పెద్ద కుటుంబమేనా? మీకూ ఎక్కువ సంఖ్యలో తోబుట్టువులున్నారా? వాళ్లతో మీకున్న అనుబంధమూ ప్రత్యేకమైనదైనా? అయితే ఆలస్యమెందుకు మీ మధ్య ఉన్న అమూల్యమైన జ్ఞాపకాలు, మధురానుభూతులు మరొక్కసారి నెమరువేసుకోండి.. వాటిని మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోకండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని