ప్రేమించానన్నాడు.. పెద్దల ముందు వంచించాడు..!

ప్రస్తుతం ప్రేమ కథలు చాలా ఎక్కువైపోయాయి.. అయితే ప్రతి ప్రేమకథా విజయవంతం అవ్వాలని లేదు. అలా విఫలమైన ఓ ప్రేమకథతో మన ముందుకొచ్చిందో అమ్మాయి.. ప్రేమించే వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉంటేనే వారి ప్రేమను అంగీకరించండి.. లేదంటే వారిపై మీకు ప్రేమ ఉన్నా.. వారిని మర్చిపోవడమే సరైన మార్గమంటోందామె. మరి, తను ఎందుకిలా చెబుతోందో తెలియాలంటే తన కథేంటో మనం తెలుసుకోవాల్సిందే..

Published : 08 Aug 2021 13:23 IST

ప్రస్తుతం ప్రేమ కథలు చాలా ఎక్కువైపోయాయి.. అయితే ప్రతి ప్రేమకథా విజయవంతం అవ్వాలని లేదు. అలా విఫలమైన ఓ ప్రేమకథతో మన ముందుకొచ్చిందో అమ్మాయి.. ప్రేమించే వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉంటేనే వారి ప్రేమను అంగీకరించండి.. లేదంటే వారిపై మీకు ప్రేమ ఉన్నా.. వారిని మర్చిపోవడమే సరైన మార్గమంటోందామె. మరి, తను ఎందుకిలా చెబుతోందో తెలియాలంటే తన కథేంటో మనం తెలుసుకోవాల్సిందే..

నా పేరు జెస్సీ.. మా అమ్మానాన్నలకు నేను ఒక్కదాన్నే కూతురిని.. మా నాన్న ప్రింటింగ్ బిజినెస్ చేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉన్నా.. ఆయనకు అకౌంట్స్‌లో సాయం చేసేది. మాది చీకూచింతా లేని కుటుంబం.. నేను ఏది అడిగినా అమ్మానాన్న ఎప్పుడూ కాదన్నది లేదు. నేను అడిగితే తప్పనిసరిగా అది తెచ్చిపెట్టాల్సిందే. అయితే నేనూ ఎప్పుడూ దాన్ని అలుసుగా తీసుకోలేదు. ఇంటర్ వరకూ నా చదువు చక్కగా సాగిపోయింది. ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించడంతో అమ్మానాన్న ఎంతో గర్వపడ్డారు. తమ కూతురు బాగా చదువుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుందని భావించారు. నాకూ వేరే కోరికలేమీ లేవు.. బాగా చదువుకోవాలి. ఎంబీయే చేసి నాన్న వ్యాపారంలో ఆయనకు సాయం చేయాలనే భావించేదాన్ని.

ఇంటర్ వరకూ చదువే లోకంగా సాగిన నా జీవితంలో డిగ్రీలో చేరగానే ఓ కుదుపు మొదలైంది. దీనికి కారణం రోహిత్.. తను మా అమ్మ స్నేహితురాలు స్టెల్లా ఆంటీ వాళ్ల అబ్బాయి.. పదో తరగతి వరకూ నాతో పాటు చదువుకున్నా.. ఇంటర్లో మేమిద్దరం వేర్వేరు కాలేజీల్లో చేరాం. ఆ తర్వాత తను ఇంజినీరింగ్‌లో చేరాడు. నేను ఎంబీయే లక్ష్యంతో డిగ్రీలో చేరాను. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా ఓరోజు కాలేజీకి వెళ్లే దారిలో మధ్యలో కలిశాడు రోహిత్.. కొత్తగా బైక్ కొనుక్కున్నానని చూపించి.. కాలేజీ వరకూ డ్రాప్ చేస్తానన్నాడు. తను నా క్లాస్‌మేట్.. పైగా వాళ్ల కుటుంబం, మా కుటుంబం ఎప్పటినుంచో కలిసి ఉండేవి కాబట్టి ఆ చనువుతో అడిగాడేమోనని ఓకే చెప్పాను. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తనని అదే రోడ్డులో గమనించేదాన్ని. అప్పుడప్పుడూ వచ్చి నాతో మాట్లాడేవాడు. నన్ను డ్రాప్ చేసేవాడు. దాన్ని నేనెప్పుడూ స్నేహం కంటే ఎక్కువగా అనుకోలేదు. కానీ సడన్‌గా ఓరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. అంతకుముందెప్పుడూ తనని ఆ దృష్టితో చూడని నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు అలాంటి ఆలోచన లేదని చెప్పి వెళ్లిపోయాను. ఆ తర్వాత తనకు దూరంగా ఉండడం ప్రారంభించా. అయినా తను నన్ను చూడడం, మా కాలేజీ రోడ్డులో నాకోసం వేచిచూడడం మానలేదు. అయితే ఆ విషయం గురించి నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. నేను డిగ్రీ రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టా..

*****

రెండో సంవత్సరం ప్రారంభమైన కొన్నిరోజులకు తను మరోసారి నా వద్దకొచ్చి 'అసలు నేనంటే నీకెందుకు ఇష్టం లేదు?' అని అడిగాడు. 'నేను నిన్ను ఇంతకుముందెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు' అని చెప్పి తప్పించుకోవాలని చూసినా తను వినలేదు. 'నా గురించి ఒక్కసారి బాగా ఆలోచించు.. నేను నీకు నచ్చుతానేమో..' అంటూ చెప్పి వెళ్లిపోయాడు. ఎక్కడో ఓ మూల చిన్న బాధ.. తనను నేను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానేమో అని.. ఈ విషయాన్ని నా స్నేహితురాలితో పంచుకుంటే.. 'ప్రస్తుతం అందరికీ బాయ్‌ఫ్రెండ్ ఉండడం కామన్ అయిపోయింది. నీకు ఉంటే ఏంటి?' అంది. దీంతో నా మనసులో ఎక్కడో ప్రేమ పట్ల ఉన్న భయం కాస్త తగ్గినట్లయింది.. అయినా ఈ విషయం తనకు చెప్పలేదు. ఆపై తన ప్రవర్తనను బాగా గమనించేదాన్ని. అంతా తన గురించి పాజిటివ్‌గా చెప్పేవారే.. పైగా చదువుల్లో టాపర్ కూడా.. దీంతో నాకు తెలియకుండానే అతని పట్ల ఆకర్షితురాలైనా అతనికి ఆ విషయం చెప్పలేదు. కొన్నాళ్ల పాటు తనని గమనించిన తర్వాత నా మనసులో ఉన్న విషయం తనతో చెప్పి.. ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పా.. మా పెద్దలతో మాట్లాడే బాధ్యత తనది అని చెప్పాడు. దీంతో నా జీవితంలో ఆనందం నిండిపోయింది. ఆపై సినిమాలకు, షికార్లకు వెళ్లేవాళ్లం. ఇద్దరం చిన్నతనం నుంచీ స్నేహితులమే కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కూడా కాదు.. అది అలాగే కొనసాగితే కథ వేరేలా ఉండేదేమో..

ఓరోజు అమ్మకి మా ఇద్దరి వ్యవహారంలో అనుమానం వచ్చింది. నేను తనతో ఫోన్లో మాట్లాడడం వినడంతో తన అనుమానం నిజమైంది. అంతకుముందెప్పుడూ నాపై కోప్పడని అమ్మ.. ఈసారి కటువుగా వార్నింగ్ ఇచ్చింది. ఆ అబ్బాయిని మర్చిపోయి చక్కగా చదువుకుంటే కాలేజీకి వెళ్లే వీలుంటుంది. లేదంటే ఇంట్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. అయినా నేను వెనక్కి తగ్గలేదు. దీంతో అమ్మా, ఆంటీ కలిసి మా ఇద్దరితో మాట్లాడేందుకు నిర్ణయించుకున్నారు. అమ్మ నన్ను అడిగినప్పుడు మేమిద్దరం ప్రేమించుకుంటున్న విషయాన్ని ఇంట్లో ధైర్యంగా చెప్పేశాను. కావాలంటే కొన్ని సంవత్సరాలు ఆగేందుకు, మా కెరీర్‌పై దృష్టి పెట్టి చదువుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామని ధైర్యంగా వెల్లడించా. కానీ తను చెప్పిన మాటలు విని మా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది..

*****

అప్పటికి మేమిద్దరం ప్రేమించుకోవడం ప్రారంభించి దాదాపు సంవత్సరం అవుతోంది. అయితే తను చెప్పిన కథ మాత్రం వేరుగా ఉంది.. 'మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే.. చిన్నతనం నుంచీ ఇద్దరం కలిసి పెరిగాం. ఒకే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉంది. ఇద్దరం మంచి స్నేహితులం కాబట్టే సినిమాలకు, షికార్లకు తిరిగాం.. కానీ అంతకంటే మా మధ్య మరొకటి లేదు. తనకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయన్న విషయం ఇప్పటివరకూ నాకు తెలీదు. ఇప్పుడు మీరు అడిగితే కానీ జెస్సీ తన మనసులో మాటను బయటపెట్టలేదు. నిజానికి మేమిద్దరం ఎప్పుడూ ప్రేమించుకోలేదు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు. జెస్సీ నన్ను ప్రేమించి, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోందేమో మరి.. ఒకవేళ మీ అందరికీ ఇష్టమైతే నేను తనని పెళ్లి చేసుకుంటా..' అన్నాడు రోహిత్. ఇదంతా వింటున్న నాకు కన్నీళ్లు ఆగలేదు. ఏం చెప్పాలో.. ఏం చేయాలో అర్థం కాక అక్కడినుంచి తిరిగొచ్చేశా. మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్న మాటలు విన్న అమ్మకు అసలు విషయం అర్థమైంది. ఇక ఏమీ మాట్లాడకుండా నన్ను తీసుకొని ఇంటికొచ్చింది అమ్మ..

*****

ఆ తర్వాత కొన్ని రోజుల వరకూ నేను ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయా. అమ్మ కూడా నాతో మాట్లాడే ధైర్యం చేయలేదు. కానీ నేను బాధపడడం తను చూడలేకపోయింది. నాలుగైదు రోజులకు నా దగ్గరికి వచ్చి ఒకవేళ తనంటే నీకు మరీ అంత ఇష్టమైతే తాను ఆంటీతో మాట్లాడతానని.. మా ఇద్దరి చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. కానీ ప్రేమించిన అమ్మాయిని 'ప్రేమిస్తున్నా' అంటూ తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి.. భవిష్యత్తులో నన్ను ఆనందంగా చూసుకుంటాడని నాకు అనిపించలేదు. పైగా ఇప్పుడు పెళ్లి ఫిక్స్ చేసుకున్నా.. నేను ఇష్టపడ్డా కాబట్టి తనేదో బలవంతంగా ఒప్పుకున్నా.. అన్నట్లు అందరి ముందూ రోహిత్ బిల్డప్ ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. దీంతో అసలు విషయం అమ్మకు చెప్పి.. నాకు కొంచెం సమయం కావాలని.. రోహిత్‌ని మర్చిపోయి చదువుపై దృష్టి సారించాలనుకుంటున్నా అని చెప్పాను. అమ్మానాన్న నాకు ఈ విషయంలోనూ తోడుండి సహాయపడ్డారు. దీంతో డిగ్రీ మంచి మార్కులతో పాసై ఐఐఎంలో సీటు కూడా సాధించా.

*****

నా జీవితంలో ఎదురైన సంఘటన నాకొక్కటే పాఠం నేర్పింది. కలకాలం తోడుంటానని బాసలు చేయడం అందరి వల్లా అవుతుంది. కానీ క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఒకరికొకరు తోడు నిలవడం నిజమైన ప్రేమికులకే సాధ్యం అవుతుంది. అలా మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తినే పెళ్లాడండి. చిన్న కష్టానికే భయపడి వెనుకడుగు వేసే వ్యక్తితో జీవితాంతం కొనసాగడం కష్టం మాత్రమే కాదు.. అసాధ్యం కూడా..! అలాగే మీరు ఎవరినైనా ప్రేమిస్తే.. ఇబ్బందులు ఎదురయ్యాయని వారిని వదిలేయకండి.. ఇబ్బందులే మీ ప్రేమను ఎదుటివారికి ఇంకా ఎక్కువగా తెలియజేస్తాయి. ఆ సందర్భంలో వారికి మీరు తోడు నిలిస్తే.. ఎల్లప్పుడూ మీరు వారికి తోడున్నట్లే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్