Bumrah: అమ్మే నాకు గొప్ప స్ఫూర్తి.. రుణం తీర్చుకోలేను!

‘నా స్ఫూర్తి ఎక్కడో లేదు.. ఇంట్లోనే ఉంది..’ ఇటీవలే ఓ సందర్భంలో క్రికెటర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అన్న మాటలివి. అందుకే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఇంటికెళ్లి పూర్తి ఆత్మవిశ్వాసంతో తిరిగొచ్చానని చెప్పాడు. దాని ఫలితం పాకిస్థాన్‌తో పాటు ఆపై జరిగిన మ్యాచ్‌ల్లోనూ ప్రస్ఫుటమైంది.

Published : 06 Nov 2023 12:33 IST

(Photo: Instagram)

‘నా స్ఫూర్తి ఎక్కడో లేదు.. ఇంట్లోనే ఉంది..’ ఇటీవలే ఓ సందర్భంలో క్రికెటర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అన్న మాటలివి. అందుకే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఇంటికెళ్లి పూర్తి ఆత్మవిశ్వాసంతో తిరిగొచ్చానని చెప్పాడు. దాని ఫలితం పాకిస్థాన్‌తో పాటు ఆపై జరిగిన మ్యాచ్‌ల్లోనూ ప్రస్ఫుటమైంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో టీమిండియా సాగిస్తోన్న జైత్రయాత్రలో ఈ గుజరాతీ క్రికెటర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి ఆ స్ఫూర్తి ప్రదాత మరెవరో కాదు.. అతడి తల్లి దల్జీత్‌ బుమ్రానే! జస్ప్రీత్‌కు ఐదేళ్లున్నప్పుడే అతడి తండ్రి చనిపోవడంతో అమ్మే అన్నీ అయి అతడిని పెంచింది. ఆర్థికంగా, ఎమోషనల్‌గా ఆమె ఎదుర్కొన్న సమస్యలు; పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేసిన త్యాగాలు ఎన్నో! అయితే అవేవీ వృథా కాలేదంటున్నారు దల్జీత్. తన కొడుకును తొలిసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లో చూసిన మరుక్షణమే తాను పడిన కష్టాలన్నీ మర్చిపోయానంటున్నారు. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌తో తన కొడుకు ప్రదర్శన చూసి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతోన్న ఆమె.. ఓ సందర్భంలో తన గత అనుభవాలను నెమరువేసుకున్నారు.

స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఉంటుందంటారు. 2000లో తన భర్త జస్బీర్‌ను కోల్పోయినప్పుడు అంతటి సహనాన్నే ప్రదర్శించారు దల్జీత్‌. అప్పటికి ఆమె కూతురు జుహికాకు ఏడేళ్లు, జస్ప్రీత్‌కు ఐదేళ్లు. కుటుంబ పెద్ద దిక్కు దూరమవడంతో ఆర్థికంగా, కుటుంబ పరంగా అన్ని బాధ్యతలు ఆమె పైనే పడ్డాయి. ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోయిన ఆమె.. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలనుకున్నారు. అప్పటివరకు గృహిణిగా ఇంటికే పరిమితమైన దల్జీత్‌.. తన పిల్లల భవిష్యత్తు, కుటుంబ పోషణ కోసం టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించారు.

నా కల నిజం చేశాడు!

అటు ఉద్యోగం చేస్తూనే మరోవైపు బీఈ పూర్తి చేశారు దల్జీత్‌. ప్రి-ప్రైమరీ స్కూల్‌ టీచర్‌గా ఉద్యోగంలో చేరిన ఆమె.. కొన్నేళ్లలోనే ఆ స్కూల్‌కి ప్రిన్సిపల్‌ అయ్యారు. ఇలా ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో బిజీగా ఉంటూనే.. తన పిల్లలకూ తగిన సమయం కేటాయించేవారామె. వారినీ తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించానంటున్నారు దల్జీత్.
‘కెరీర్‌ విషయంలో నా పిల్లల్ని వారికి ఆసక్తి ఉన్న రంగాల్లోనే ప్రోత్సహించాలనుకున్నా. ఈ క్రమంలోనే జస్ప్రీత్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఉన్న మక్కువను గుర్తించి ఆ దిశగానే ప్రోత్సహించా. అయితే ఆర్థిక కారణాల రీత్యా మొదట్లో తనకు కావాల్సిన నాణ్యమైన క్రికెట్‌ కిట్‌ను అందించలేకపోయా. ఒక జత షూస్‌, ఒక జత టీషర్ట్స్‌తోనే సాధన చేసేవాడు. రోజూ వాటినే ఉతుక్కొని వేసుకునేవాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నా కొడుక్కి ఒక్కటే చెప్పేదాన్ని.. ‘నీ మనసు మాట విను! ఈ ప్రపంచాన్ని గెలువు!’ అని. ఆ మాటను, నా కలను నిజం చేసి చూపించాడు. ఐపీఎల్‌లో తొలిసారి అడుగుపెట్టినప్పుడు టీవీలో నా కొడుకును చూసి భావోద్వేగానికి లోనయ్యా.. ఆనందభాష్పాల్ని ఆపుకోలేకపోయా..’ అంటోన్న ఈ మాతృమూర్తి.. ప్రస్తుత ప్రపంచకప్‌లో తన కొడుకు అత్యుత్తమ ప్రదర్శన చూసి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నానని చెబుతున్నారు. ఇక జస్ప్రీత్‌ అక్క జులికా వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడింది. ప్రస్తుతం ఓ మార్కెటింగ్‌ సంస్థలో కెరీర్‌ కొనసాగిస్తోంది.

అమ్మే.. నా రోల్‌ మోడల్!

ఇలా తన తల్లి చేసిన త్యాగాలు, తమ చిన్నతనంలో ఆమె పడిన కష్టాల ఫలితంగానే తానీ స్థాయికి చేరగలిగానంటున్నాడు జస్ప్రీత్‌. తన త్యాగాలకు ప్రతిఫలంగా ఏమిచ్చినా తక్కువే అంటున్నాడు.

‘కష్టాలే మనల్ని దృఢంగా తయారుచేస్తాయి.. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే నేర్పునిస్తాయి. ప్రస్తుతం నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణం.. నన్ను, అక్కను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆమె ఎన్నో కష్టాలకోర్చింది. నా కెరీర్‌ విషయంలోనూ ఏనాడూ తను ఒత్తిడి చేయలేదు. ‘ఇంటి పరిస్థితులు బాగోలేవు.. ఏ ఇంజినీరో, డాక్టరో అయి బాధ్యతల్ని భుజాలకెత్తుకో!’ అని ఎప్పుడూ ఆశించలేదు. కెరీర్‌ ఎంపిక విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. తనను, తన పరిస్థితుల్ని చూస్తూ పెరిగిన మేము.. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని అమ్మ నుంచి నేర్చుకున్నాం. జీవితంలో మీకు స్ఫూర్తి ఎవరు అని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఇంట్లోనే అమ్మ రూపంలో ఇంత గొప్ప స్ఫూర్తి ప్రదాత ఉన్నప్పుడు స్ఫూర్తిని ఇంకెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది? అమ్మ చేసిన త్యాగాలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.. ఇకపై ఆమెకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవడం తప్ప..! ఇప్పటికీ మ్యాచ్‌కు ముందు వీలైతే అమ్మను కలుసుకోవడం, లేదంటే అమ్మతో ఫోన్లో మాట్లాడడం.. నాకు సెంటిమెంట్‌! ప్రేమతో నిండిన అమ్మ పలకరింపే నాలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తుంది..’ అంటున్నాడీ స్పీడ్‌ స్టార్‌. 2021లో క్రికెట్‌ ప్రజెంటర్‌ సంజనా గణేశన్‌ను వివాహం చేసుకున్నాడు జస్ప్రీత్‌. ప్రస్తుతం ఈ జంటకు ఓ కొడుకు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్