ట్రక్కు డ్రైవర్‌గా కోటి సంపాదిస్తోంది..!

ఆస్ట్రేలియాకు చెందిన యాష్లీయా మాత్రం ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ ఏడాదికి దాదాపు కోటి రూపాయలు సంపాదిస్తోంది. అంతేకాదు.. ఏడాదికి ఆరు నెలలు మాత్రమే పని చేస్తూ మిగతా సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాలను చుట్టేస్తోంది.

Updated : 06 Aug 2023 11:08 IST

(Photos: Instagram)

పెద్ద పెద్ద కార్లు సైతం అవలీలగా నడిపేసినా;  లారీలు, ట్రక్కులు మొదలైన భారీ వాహనాలను నడిపే విషయంలో మాత్రం మహిళలు కొంచెం తక్కువగానే కనిపిస్తారు. ఆ మాటకొస్తే- భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు వచ్చే వేతనాలు కూడా తక్కువే. అయితే ఆస్ట్రేలియాకు చెందిన యాష్లియా మాత్రం ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తూ ఏడాదికి దాదాపు కోటి రూపాయలు సంపాదిస్తోంది. అంతేకాదు.. ఏడాదికి ఆరు నెలలు మాత్రమే పని చేస్తూ మిగతా సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాలను చుట్టేస్తోంది. అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..

డబ్బులు తక్కువ.. పని ఎక్కువ..

‘నా పేరు యాష్లియా. మాది ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నగరం. మొదట్లో నేను హౌస్‌ కీపింగ్‌, బార్‌ వర్క్, కిచెన్‌ వర్క్‌, సెక్యూరిటీ.. వంటి పనులు చేశా. వాటికి పెద్దగా డబ్బులు ఇచ్చేవారు కాదు. కానీ, పని మాత్రం విపరీతంగా ఉండేది. దాంతో మంచి ఉద్యోగం కోసం ఓ మైనింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి తరచుగా ఫోన్‌ చేసేదాన్ని. కొన్ని వారాల తర్వాత వారి నుంచి పిలుపు వచ్చింది. మొదట్లో ట్రైనీగా అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ట్రక్‌ డ్రైవింగ్‌, మెషీన్లను ఆపరేట్‌ చేయడం వంటి పనులు కూడా నేర్పించారు. రెండు వారాల శిక్షణలోనే మైనింగ్‌కు సంబంధించిన చాలా విషయాలు నేర్పారు. నేను కూడా తొందరగానే డ్రైవింగ్‌ నేర్చుకున్నాను. దాంతో వాళ్లు నేరుగా సైట్‌కు పంపించారు. ఆ తర్వాత సొంతంగా ట్రక్కు డ్రైవింగ్‌ చేయడం మొదలుపెట్టా’..!

అలా కోటి రూపాయలు సంపాదిస్తున్నా..!

‘శిక్షణ పూర్తైన తర్వాత గ్రీనీ (ట్రక్కు డ్రైవర్‌)గా అవకాశం ఇచ్చారు. దానికి గంటల చొప్పున డబ్బులు చెల్లిస్తుంటారు. నాకు గంటకు 36.50 డాలర్లు (3 వేల రూపాయలు) ఇచ్చేవాళ్లు. అలా మూడు నెలలు పని చేసిన తర్వాత నాకు ఇచ్చే మొత్తాన్ని గంటకు 43.50 డాలర్లు (3500 రూపాయలు) చేశారు. మా పని విధానం రోస్టర్‌ పద్ధతిలో ఉంటుంది. అంటే రెండు వారాల పాటు వరసగా పని చేస్తే తర్వాత రెండు వారాలు సెలవు ఉంటుంది. ఇలా ఏడాది మొత్తంలో ఆరు నెలల పాటు మాత్రమే పని చేస్తాను. అలా మొదటి సంవత్సరంలోనే దాదాపు 20 లక్షలు వేతనంగా పొందాను. కొత్త డ్రైవర్‌కి ఇది చాలా మంచి మొత్తం. కొంతకాలం తర్వాత మరో  కాంట్రాక్టర్ దగ్గర పనిచేయడం మొదలు పెట్టా. వాళ్లు గంటకు 4200 రూపాయలు ఇచ్చేవాళ్లు. ఇదే కాకుండా బోనస్‌గా ప్రతి నెల కొంత మొత్తం ఇస్తుంటారు. అలా ప్రస్తుతం ఏడాదికి సుమారు కోటి రూపాయలు సంపాదిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది యాష్లియా.

ప్రపంచాన్ని చుట్టేస్తూ..!

యాష్లియా పని చేసేది రెండు వారాలే అయినా అది చాలా కష్టంగా ఉంటుందట. ఆమె రోజుకు 12 గంటల పాటు డ్రైవింగ్‌లోనే ఉంటుందట. ఆ తర్వాత లభించే రెండు వారాల సెలవులను మాత్రం ఏమాత్రం వృథా చేయకుండా ప్రపంచాన్ని చుట్టేస్తుంటుంది.

‘గనుల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. నేను ఉదయం 4 గంటలకే డ్యూటీలో ఉంటాను. రోజులో 12 గంటల పాటు వేడి వాతావరణంలో పని చేస్తాను. అలా రెండు వారాలు పని చేస్తే.. తర్వాత రెండు వారాల సెలవు లభిస్తుంది. ఈ సమయాన్ని అస్సలు వృథా చేయను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సెలవుల సమయంలో వివిధ దేశాలకు వెళుతుంటాను. ఇప్పటికే నేను చాలా దేశాలకు వెళ్లాను. అయితే చాలామంది ‘గనుల్లో ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తూ మంచి జీవనశైలి ఎలా సాధ్యమవుతోంది?’ అని అడుగుతుంటారు. దానికి నా దగ్గర మూడు సమాధానాలు ఉన్నాయి. ఒకటి నేను ఇప్పటికీ సింగిల్‌. రెండు నాకు అప్పులు లేవు. మూడు నేను పెట్టుబడి పెట్టిన ఒక ఇంటిని అమ్మేశా. దాంతో నా బ్యాంక్‌ బ్యాలన్స్‌ కూడా సరిపడినంత ఉంది’ అని చెప్పుకొచ్చింది.

ఇటు ట్రక్ డ్రైవర్‌గా, అటు ట్రావెలింగ్ తోనూ విరామం లేకుండా గడిపే యాష్లియా ఫ్యాషన్‌, ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటుంది. అందుకే యాష్లియాను ‘వరల్డ్‌ హాట్టెస్ట్‌ ట్రక్‌ డ్రైవర్‌’ అంటుంటారు. యాష్లియా డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ కూడా. ఆమె తనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్