అందం.. ఆరోగ్యం.. ద్రాక్ష రసంతో మీ సొంతం..!

మీకు గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టమేనా? ఏంటీ?? ఉన్నట్లుండి ఇలా అడుగుతున్నారు.. అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఇటు అందం, అటు ఆరోగ్యం.. రెంటినీ సొంతం చేసే సుగుణాలెన్నో ఉన్నాయి కాబట్టి..! ఇంతకీ ఏంటవంటారా? మీరే చూడండి..

Published : 23 Sep 2021 17:01 IST

మీకు గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టమేనా? ఏంటీ?? ఉన్నట్లుండి ఇలా అడుగుతున్నారు.. అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఇటు అందం, అటు ఆరోగ్యం.. రెంటినీ సొంతం చేసే సుగుణాలెన్నో ఉన్నాయి కాబట్టి..! ఇంతకీ ఏంటవంటారా? మీరే చూడండి..

వయసును దాచిపెడుతుంది..

ద్రాక్షపండ్లలో ఎ, సి, బి-6 వంటి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల కారణంగా ఇవి మన శరీరంలో వ్యాది µనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. అంతేకాదు.. జలుబు, దగ్గు, ఫ్లూ.. వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వయసు పైబడిన కొద్దీ శరీరంపై ముడతలు రాకుండా నివారిస్తాయి.

గుండెకు కొండంత అండ..!

ద్రాక్షరసం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తయి తద్వారా రక్తనాళాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు మన దరిచేరవు.

అదుపులో కొలెస్ట్రాల్..

ఒక గ్లాస్ ద్రాక్ష రసం తాగితే చాలు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు.. ఇది ధమనుల్లో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

స్త్రీలకెంతో మేలు..

ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కొందరు ఈ సమయంలో చాలా బలహీనంగా ఉంటారు. అలాంటి వారికి కాన్పు సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. దీన్ని అధిగమించాలంటే ద్రాక్షపండ్లు తినడం లేదా ద్రాక్షరసం తాగడం చాలా అవసరం. ద్రాక్షతో.. ఈ సమయంలో తరచుగా ఎదురయ్యే అజీర్తి సమస్యను తగ్గించుకోవచ్చు. డాక్టర్ సలహా మేరకు ప్రెగ్నెంట్ వుమెన్‌కు వీటివల్ల చాలా మేలు కలుగుతుంది.

క్యాన్సర్ రాకుండా..

ద్రాక్షరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఎలాంటి క్యాన్సర్ కణుతులు ఏర్పడకుండా నిరోధిస్తాయి. ప్రత్యేకించి పర్పుల్ రంగులో ఉన్న ద్రాక్షరసమైతే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

ఎముకలను దృఢపరుస్తుంది..

ద్రాక్షరసంలో కాపర్, ఐరన్, మాంగనీస్.. వంటి మైక్రో న్యూట్రియంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి రోజూ ఒక గ్లాస్ ద్రాక్షరసాన్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

అజీర్తి నుంచి ఉపశమనం..

ద్రాక్షరసం.. అజీర్తి సమస్య నుంచి ఉపశమనం కలుగజేస్తుంది. ద్రాక్షరసంలో ఉండే సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాల వల్ల జీర్ణవ్యవస్థ, పేగువ్యవస్థలు అదుపులో ఉండి.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది.

తక్షణ శక్తికి..

సాధారణంగా అలసటను దూరం చేసుకోవడానికి ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతుంటాం కదా! ఓసారి వీటికి బదులుగా ఒక గ్లాసు తెల్ల ద్రాక్షరసాన్ని తాగి చూడండి.. తక్షణ శక్తి మీ సొంతమవుతుంది. ఈ ద్రాక్షలో ఉండే ఐరన్, ఫ్లావనాయిడ్స్.. లాంటి యాంటీఆక్సిడెంట్ల వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. శరీరంలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు లోపిస్తే తలనొప్పి, ఆయాసం వంటి సమస్యలు తలెత్తుతాయి.

మరికొన్ని ఉపయోగాలు..

* ఆస్తమాతో బాధపడే వారికి ద్రాక్ష మంచి ఔషధంగా పనిచేస్తుంది.

* ద్రాక్ష రసం పార్శ్వపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

* కడుపు నొప్పితో బాధపడేవారు ద్రాక్షరసం తీసుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు.

* శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

* కంటి, పంటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి కూడా ఉపశమనాన్ని కలుగజేస్తుంది.

* ద్రాక్షనూనెను సుగంధ ద్రవ్యాల్లోనూ ఉపయోగిస్తారు.

* శరీరంపై అలర్జీలు రాకుండా చేస్తుంది.

చూశారుగా.. ద్రాక్షరసంతో ఎన్ని ప్రయోజనాలున్నాయో..! అందుకే ద్రాక్షరసాన్ని రోజూ మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే అటు అందం.. ఇటు ఆరోగ్యం.. రెండూ మీ సొంతమవుతాయి. సో.. ఇప్పటినుంచైనా ఫాలో అవ్వండి మరి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్