30 ఏళ్ల నుంచి బార్బీ బొమ్మలే ఆమె జీవితం..!

గత 30 ఏళ్ల నుంచి బార్బీ బొమ్మలను సేకరించడమే ఆమె పనిగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 18,500 బొమ్మలను సేకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం సంపాదించారు. ఈ క్రమంలో ఆమె గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు..!

Published : 03 Aug 2023 12:32 IST

చిన్నపిల్లలకు ఆటబొమ్మంటే మొదటగా గుర్తొచ్చేది బార్బీనే. చాలామంది అమ్మాయిలు బార్బీ బొమ్మలా ఉండాలనుకుంటారు. చిన్నపిల్లలకు, అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన ‘బార్బీ’ ప్రధాన పాత్రలో ఇటీవలే ఓ చిత్రం కూడా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే - జర్మనీకి చెందిన బెటినా డార్ఫ్‌మన్‌కి బార్బీ బొమ్మలంటే ఎంతో ఇష్టం. ఎంతలా అంటే- గత 30 ఏళ్ల నుంచి బార్బీ బొమ్మలను సేకరించడమే ఆమె పనిగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 18,500 బొమ్మలను సేకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించారు. ఈ క్రమంలో ఆమె గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు..!

మొదటి బొమ్మ దగ్గర్నుంచి..!

జర్మనీకి చెందిన బెటినా డార్ఫ్‌మన్ (62)కు బార్బీ బొమ్మలంటే ఇష్టం. చిన్నప్పుడు ఆమె ఎక్కువగా వాటితోనే గడిపేదట. ఆ తర్వాత బార్బీ బొమ్మలను సేకరించడమే ఆమె పనిగా పెట్టుకున్నారు. అలా 1993 నుంచి వివిధ రకాల బార్బీలను సేకరించడం మొదలుపెట్టారు. కానీ తన మొదటి బొమ్మను ఐదేళ్ల వయసులోనే సేకరించానని చెబుతున్నారు డార్ఫ్‌మన్. 2005 నాటికే దాదాపు 2500 బొమ్మలను సేకరించారు. దాంతో ఎక్కువ బార్బీలను సేకరించిన మహిళగా తొలిసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. అంతకుముందు ఈ జాబితాలో బ్రిటన్‌కు చెందిన టోనీ మ్యాటియా ఉంది. ఆమె దగ్గర కేవలం 1125 బొమ్మలే ఉండేవి. అప్పట్నుంచి డార్ఫ్‌మన్‌ బొమ్మల జాబితా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆమె దగ్గర సుమారు 18,500 బొమ్మలు ఉన్నాయి. ఇందులో కొన్ని అరుదైనవి కూడా ఉన్నాయి. 1959లో మొదటిసారిగా మార్కెట్లోకి వచ్చిన బార్బీ బొమ్మ కూడా ఆమె జాబితాలో ఉంది. అలాగే ఇటీవలే విడుదలైన ‘బార్బీ’ చిత్రానికి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి.

బొమ్మల డాక్టర్..!

గత 30 ఏళ్లుగా డార్ఫ్‌మన్‌ బార్బీలే తన జీవితమన్నట్టుగా గడుపుతున్నారు. ఈ క్రమంలో తను సేకరించిన బార్బీలను పలు ఎగ్జిబిషన్లలో కూడా ప్రదర్శిస్తుంటారు. అలాగే ‘బార్బీ’ గురించి కొన్ని పుస్తకాలు కూడా రాశారు. అంతేకాదు.. డార్ఫ్‌మన్‌ బొమ్మల డాక్టర్‌ కూడా. ఆమె ఒక డాల్‌ హాస్పిటల్ నడుపుతున్నారు. ఈ క్రమంలో బొమ్మలకు సంబంధించి ఏవైనా మరమ్మతులు అవసరమైతే కూడా చేస్తుంటారు.

డాల్‌ హాస్పిటల్‌ గురించి మాట్లాడుతూ ‘నాకు క్రాఫ్టింగ్‌, రిపేరింగ్‌ అంటే ఇష్టం. 90ల్లో నేను సేకరించిన బొమ్మలకు చేతులు, కాళ్లు మార్చేదాన్ని. అది చూసిన కొంతమంది టాయ్‌ ట్రేడర్స్‌.. వారి బొమ్మలకు మేకప్‌ వేయమని, కనుబొమ్మలు మార్చమని అడిగేవారు. దాంతో వారికి ఆ పనులు చేసిపెట్టేదాన్ని. అందుకుగాను నా బొమ్మలకు కావాల్సిన వస్తువులు ఇచ్చేవారు. అప్పట్నుంచి డాల్‌ హాస్పిటల్‌ నడుపుతూ బొమ్మలకు రిపేర్‌ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు డార్ఫ్‌మన్. బొమ్మలకు రిపేర్‌ చేసినందుకు గాను 5 నుంచి 300 యూరోల వరకు తీసుకుంటారట.

అమెరికా బొమ్మల తయారీ సంస్థ మ్యాటెల్ 1959లో మొదటిసారి బార్బీ బొమ్మలను తయారుచేసింది. ఆ తర్వాత కొంత కాలానికే ఆ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ సంపాదించుకున్నాయి.

Photos: Facebook, guinnessworldrecords.com

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్