అందాల కిరీటం అంటే కేవలం మెరిసే రాళ్లతో చేసింది కాదు..!

ఫ్యాషన్ రంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటీ సెలీనా జైట్లీ.

Updated : 21 Jul 2023 12:59 IST

(Photos: Instagram)

వెండితెరపై అందాల తారలను చూడగానే చాలామంది వారి జీవనశైలి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ, అవకాశాలు దక్కించుకుని నటిగా ఎదగడానికి వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. 15 ఏళ్లకే ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన తాను సైతం ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటీ సెలీనా జైట్లీ.

ఆర్మీ నేపథ్యం..

సెలీనా జైట్లీ 1981లో హిమాచల్‌లో జన్మించింది. తండ్రి వీకే జైట్లీ ఆర్మీలో కల్నల్‌గా పనిచేశారు. ఆమె తల్లి మీటా భారత ఆర్మీలో నర్సుగా సేవలందించారు. సెలీనాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతను కూడా ఆర్మీలో పని చేస్తున్నాడు. ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సెలీనా బాల్యమంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గడిచింది. 2001లో ‘ఫెమినా మిస్ ఇండియా’ టైటిల్ అందుకుంది సెలీనా. ఆ తర్వాత 2003లో ‘జాన్‌షీన్’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు హిట్‌ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది.

తక్కువ ఎత్తున్న అమ్మాయిల్లో..!

ఫ్యాషన్‌ రంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి సెలీనా ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఈ సంవత్సరంతో నేను ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచి 22 ఏళ్లవుతోంది. 2001లో ప్యూర్టెరికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్‌’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచాను. అంతకుముందు సంవత్సరమే భారత్‌ మూడు విజయాలు నమోదు చేసింది. మిస్‌ యూనివర్స్‌, మిస్‌ వరల్డ్‌, మిస్‌ ఏషియా పసిఫిక్‌ పోటీల్లో లారా దత్తా, ప్రియాంకా చోప్రా, దియా మీర్జాలు గెలుపొందారు. 103 మంది పాల్గొన్న ఈ పోటీల్లో తక్కువ ఎత్తున్న అమ్మాయిల్లో నేనూ ఒకదాన్ని. నా ఎత్తు 5.6 అడుగులు. అయినా పోటీని తట్టుకుని రన్నరప్‌గా నిలిచా. దేశ వారసత్వాన్ని నిలబెట్టినందుకు అది నాకెంతో గర్వకారణం.

15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టాను. కోల్‌కతా వంటి నగరాల్లో అప్పుడే ఫ్యాషన్‌ రంగం అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సమయంలో సవాళ్లను ఎదుర్కొని అవకాశాలు దక్కించుకోవడం అంత సులభం కాదు. అలాగే చదువు, పోటీ పరీక్షలతో నా టీనేజ్‌ కష్టంగా గడిచింది. దీనికి తోడు తీవ్ర మొటిమలు, ఎండోమెట్రియాసిస్‌తో బాధపడ్డాను. దానివల్ల నెలకోసారి హాస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఆ సమస్య వల్ల పిరియడ్స్‌ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కెరీర్ గురించి ఎన్నో కలలు కన్న నాకు ఆ సమస్యలు మరింత కఠినంగా మారాయి. నాతోటి అమ్మాయిలు వారాంతాల్లో ఎంజాయ్‌ చేస్తుంటే నేను మాత్రం కోల్‌కతాలో షూటింగ్‌, ర్యాంప్‌ షోలతో గడిపేదాన్ని.. ఫ్యాషన్‌ రంగంలో ఎదగడం కోసం తక్కువ మొత్తానికి కూడా పని చేశాను. ఇండస్ట్రీలో సరైన నిబంధనలు లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందలేకపోయా..!

వీటికి తోడు ‘నువ్వు బాగా తెల్లగా ఉన్నావు.. బాగా సన్నగా ఉన్నావు.. తగినంత ఎత్తు లేవు..’ వంటి విమర్శలను తరచూ ఎదుర్కొనేదాన్ని. కానీ అవే నన్ను ప్రత్యేకంగా నిలిచేలా చేశాయి. టీనేజ్‌లో ఉండే అమ్మాయిలు అందాల కిరీటం సొంతం చేసుకోవడం గొప్ప విషయం. కానీ దానికోసం చేసే ప్రయాణం మాత్రం కష్టంగా ఉంటుంది. కిరీటం అంటే కేవలం మెరిసే రాళ్లతో చేసింది కాదు. అందులో అమ్మాయిల సంకల్ప బలం, అంకితభావం, పోరాటం, ధైర్యం వంటి గుణాలు కూడా ఉంటాయి. అందం.. ఇతరుల్లో స్ఫూర్తి నింపడానికి ఉపయోగించే శక్తిమంతమైన ఆయుధం. ఒక నటిగా, సమానత్వ సాధనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి బ్రాండ్ అంబాసిడర్‌గా వివిధ వేదికలపై దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు కృతజ్ఞురాలిని’ అంటూ చెప్పుకొచ్చింది సెలీనా.

మంచు విష్ణు హీరోగా చేసిన ‘సూర్యం’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైంది సెలీనా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్