అలా ఉచితంగానే ఆస్ట్రేలియా చుట్టేస్తోంది!

ఈ రోజుల్లో చాలామంది ట్రావెలింగ్‌ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇందుకోసం ‘కంఫర్ట్‌ జోన్‌’ నుంచి బయటకు రావడానికి కూడా వెనకాడడం లేదు. అయితే ట్రావెలింగ్‌ చేయాలంటే ఖర్చు కూడా అధికమే.

Published : 29 Oct 2023 11:14 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో చాలామంది ట్రావెలింగ్‌ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. ఇందుకోసం ‘కంఫర్ట్‌ జోన్‌’ నుంచి బయటకు రావడానికి కూడా వెనకాడడం లేదు. అయితే ట్రావెలింగ్‌ చేయాలంటే ఖర్చు కూడా అధికమే. కొంతమంది ఈ ఖర్చును వివిధ మార్గాల ద్వారా తగ్గించుకుంటూ తమకు నచ్చిన ప్రాంతాలను చుట్టేస్తున్నారు. ఈ జాబితాలో కెనడాకు చెందిన హెయిలీ ముందు వరుసలో ఉంటుంది. ఆమె ఏడాది కాలంగా ఆస్ట్రేలియాలో ఉచితంగా పర్యటిస్తోంది. ఇందుకు సంబంధించిన విషయాలను ఆమె ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దాంతో నెట్టింట వైరల్‌గా మారింది. మరి, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా...

గూగుల్‌లో వెతికి..

కెనడాకు చెందిన హెయిలీ (25) మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీలో జాగ్రఫీ, పర్యావరణ శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందింది. చదువుకునే సమయంలో ‘యూనివర్సిటీ ఎక్స్‌ఛేంజ్‌’ కార్యక్రమంలో భాగంగా ఆస్ట్రేలియాలో నాలుగు నెలల పాటు పర్యటించింది. అప్పుడే ఆస్ట్రేలియాలో మరిన్ని ప్రాంతాలను సందర్శించాలనుకుంది. అయితే అది కుదరలేదు. తిరిగి కెనడాకు వచ్చిన ఆమె పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. అయితే గతేడాది ఆస్ట్రేలియా పర్యటనను పూర్తి చేయాలనుకుంది. ట్రావెలింగ్‌ అంటేనే ఖర్చుతో కూడుకున్నది. అందుకు హెయిలీ దగ్గర సరిపడినంత డబ్బు లేదు. దాంతో ఉచితంగా పర్యటించే మార్గాలను అన్వేషించాలనుకుంది. అందుకోసం గూగుల్‌లో ‘ఉచితంగా ట్రావెలింగ్‌ చేయడం ఎలా’ అని శోధించింది. దాంతో ఆమెకు పలు హౌస్ సిట్టింగ్‌ వెబ్‌సైట్లు దర్శనమిచ్చాయి. కొంతమందికి తమ పెట్స్‌ను చూసుకునే సమయం ఉండదు. ఇలాంటి వారు మనుషుల కోసం హౌస్ సిట్టింగ్‌ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తుంటారు. వీరు తమ పెట్స్‌ను చూసుకున్నందుకు గాను ఉచిత వసతి కల్పిస్తుంటారు.

తొమ్మిది నెలలుగా..

హౌస్ సిట్టింగ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలంటే కొంతమొత్తంతో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అలా హెయిలీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఆస్ట్రేలియాలో హౌస్ సిట్టింగ్‌ ఉద్యోగాల కోసం అన్వేషించింది. అలా రెండు నెలల అన్వేషణ తర్వాత ఆమెకు హౌస్ సిట్టర్‌గా అవకాశం లభించింది. దాంతో వర్కింగ్ హాలిడే వీసా తీసుకుని ఈ జనవరిలో క్వీన్స్‌ల్యాండ్‌లో ల్యాండయ్యింది. అక్కడ వారి ఇంట్లో ఉండే పెట్స్‌ను చూసుకుంటూ ఖాళీ సమయాల్లో వివిధ ప్రాంతాలను చుట్టేసేది. అలా తొమ్మిది నెలలుగా ఆమె వివిధ ప్రాంతాలను చుట్టేస్తోంది. అయితే హౌస్ సిట్టర్‌గా మూడు రోజుల నుంచి ఆరు నెలల కాలం మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. దాంతో ఆమె ఒక ప్రాంతంలో ఉండగానే మరో హౌస్ సిట్టర్‌కి అప్లై చేస్తూ ఆస్ట్రేలియాలో ఉండే చాలా ప్రాంతాలను సందర్శించింది.

మరొకొన్ని ఆదాయ మార్గాలు..

హౌస్ సిట్టింగ్‌ ద్వారా ఉచిత వసతి మాత్రమే లభిస్తుంది. అయితే ఇతర ఖర్చుల కోసం హెయిలీ మరిన్ని మార్గాలను అన్వేషించింది. ప్రయాణ ఖర్చులను భరించడం కోసం తనే ఒక కారును కొనుగోలు చేసింది. అందులోనే కొన్ని వసతులు ఉండేలా ఏర్పాటు చేసుకుంది. హెయిలీ ఖర్చులు కూడా తక్కువే. గ్రాసరీస్‌కు తప్ప ఇతరు ఖర్చులు ఎక్కువగా పెట్టదట. హెయిలీ ఫొటోగ్రాఫర్‌ కూడా. ట్రావెలింగ్‌లోనూ పలు సంస్థలకు కావాల్సిన ఫొటోలు అందిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తుంటుంది. ఈ క్రమంలో దాదాపు 10 లక్షల రూపాయలను ఆదా చేశానని అంటోంది. హెయిలీ వీసా మరో మూడు నెలల్లో పూర్తి కానుంది. ఈ సమయంలో సిడ్నీ, టాస్మేనియా, అడిలైడ్‌, పెర్త్‌ ప్రాంతాలను చుట్టేయాలని ఆశిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్