కెల్వన్.. ఉఖానే.. పెళ్లి వేడుకల్లో మెరిసిపోయిన ఐరా..!

సెలబ్రిటీ పెళ్లిళ్లలో ప్రతిదీ ప్రత్యేకమే! వాళ్లు ధరించే దుస్తులు, ఆయా సంప్రదాయాల ప్రకారం జరుపుకొనే ముందస్తు పెళ్లి వేడుకలు ముచ్చట గొలుపుతుంటాయి. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఐరాఖాన్‌-నుపుర్‌ శిఖరే ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లోనూ అలాంటి ఘట్టమే చోటుచేసుకుంది.

Updated : 08 Nov 2023 20:47 IST

(Photos: Instagram)

సెలబ్రిటీ పెళ్లిళ్లలో ప్రతిదీ ప్రత్యేకమే! వాళ్లు ధరించే దుస్తులు, ఆయా సంప్రదాయాల ప్రకారం జరుపుకొనే ముందస్తు పెళ్లి వేడుకలు ముచ్చట గొలుపుతుంటాయి. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఐరాఖాన్‌-నుపుర్‌ శిఖరే ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లోనూ అలాంటి ఘట్టమే చోటుచేసుకుంది. ఆమిర్‌ నివాసంలో ‘కెల్వన్’, ‘ఉఖానే’ పేరుతో ఈ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మరాఠీ వధువుగా ముస్తాబైంది ఐరా. వీటికి సంబంధించిన ఫొటోల్ని ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అవి వైరల్‌గా మారాయి. అందులోనూ ముఖ్యంగా కెల్వన్, ఉఖానే వేడుకల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. మరి, ఈ ముద్దుల జంట ప్రి-వెడ్డింగ్‌కి సంబంధించిన విశేషాలు, ఆ వేడుకల గురించి తెలుసుకుందాం రండి..

సెలబ్రిటీ స్టేటస్‌తో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఐరాఖాన్‌. సంగీతంలో ఉన్నత విద్యనభ్యసించిన ఆమె.. మానసిక సమస్యలపై అందరిలో అవగాహన పెంచేందుకు ‘అగట్సు’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. ఒకానొక సమయంలో డిప్రెషన్‌తో బాధపడిన ఐరా.. తనలా మరెవరూ ఇబ్బంది పడకూడదనే ఈ ఎన్జీవోను స్థాపించినట్లు ఓ సందర్భంలో పంచుకుంది. మరోవైపు దర్శకురాలిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుందీ బ్యూటీ. 2019లో ‘Medea’ పేరుతో ఓ నాటకాన్ని తెరకెక్కించి తొలి ప్రయత్నంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సతీమణి హేజల్‌ కీచ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ నాటకం.. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రదర్శితమైంది.

లాక్‌డౌన్‌ ప్రేమ!

కొవిడ్‌ లాక్‌డౌన్‌లో కలుసుకొని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటలు కొన్నున్నాయి. ఐరా-నుపుర్‌ల ప్రేమకథా అదే సమయంలో మొదలైంది. వృత్తిరీత్యా నుపుర్‌ సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌. 2020లో ఆమిర్ఖాన్‌కు వ్యక్తిగత ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా ఐరా కొన్నాళ్లు ఆమిర్‌ ఇంట్లోనే ఉంది. అదే సమయంలో ఐరాకు నుపుర్‌ ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పించాడు. అలా మొదలైన వీరి స్నేహం కొన్నాళ్లకే ప్రేమగా మారింది. ఇద్దరూ వ్యక్తిగత విషయాల్ని పంచుకొని మరింత దగ్గరయ్యారు. ఇక 2021లో వేలంటైన్స్‌ డే సందర్భంగా ఐరా.. ‘ఇతడే నా వేలంటైన్‌’ అంటూ నుపుర్‌తో దిగిన కొన్ని ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీరి ప్రేమబంధం గురించి అందరికీ తెలిసిపోయింది. ఇక అప్పట్నుంచి ఒకరింట్లో జరిగే ఫంక్షన్లు, పార్టీలకు మరొకరు హాజరవడం.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోల్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడంతో ఈ జంటకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది.

అందుకే నచ్చాడు!

సరిగ్గా ఏడాది క్రితం ఓ పబ్లిక్‌ ఈవెంట్లో అందరి ముందు మోకాళ్లపై కూర్చొని తన ఇష్టసఖికి ప్రేమ ప్రతిపాదన తెలిపాడు నుపుర్‌. ఇలా వీళ్ల ప్రేమకు పెద్దలూ అంగీకరించడంతో గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుందీ జంట.

‘నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నుపుర్‌ నాకు అండగా నిలిచాడు. మనసు బాగోలేక ఒక్కోసారి చిన్నపిల్లలా ప్రవర్తించేదాన్ని. అయినా తను నన్ను అర్థం చేసుకొని మరింత జాగ్రత్తగా చూసుకునేవాడు. ఈ ప్రతికూల దశ నుంచి నేను బయటపడగలిగానంటే అదంతా నుపుర్‌ చలవే! ఇప్పుడే కాదు.. సోషల్‌ మీడియాలో విమర్శలొచ్చినప్పుడూ వాటిని ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చాడు.. అందుకే నా మనసుకు బాగా దగ్గరయ్యాడు..’ అంటూ తన ఇష్టసఖుడి గురించి ఓ సందర్భంలో చెబుతూ మురిసిపోయింది ఐరా.

మరాఠీ వధువుగా!

గతేడాది ఎంగేజ్‌మెంట్‌తో తమ ప్రేమను మరో మెట్టెక్కించిన ఈ సెలబ్రిటీ లవ్‌బర్డ్స్‌.. ప్రస్తుతం పెళ్లికి రడీ అయిపోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 3న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు ఒక్కొక్కటిగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా ‘కెల్వన్‌’ అనే వేడుక నిర్వహించారు. ఆమిర్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో కాబోయే వధూవరులు, ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఐరా-నుపుర్‌ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. మరాఠీ స్టైల్‌లో ఎరుపు రంగు నౌవారీ చీరలో ముస్తాబైన ఐరా.. ఫ్లోరల్‌ జ్యుయలరీతో ఆకట్టుకుంది. మహారాష్ట్ర మహిళలు సంప్రదాయబద్ధంగా ధరించే ముక్కెర ‘పేష్వారీ నథ్‌’తో తన లుక్‌ని పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మకు అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందేమో అన్నంత క్యూట్‌గా కనిపించింది. ఇక నుపుర్‌ పసుపు రంగు కుర్తా-పైజామాలో అదరగొట్టాడు. ఇలా ఈ వేడుకలో భాగంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకుంది ఐరా. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.

కెల్వన్.. ఉఖానే!

‘నుపుర్‌ని నేనెంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను.. కెల్వన్ 2, ఉఖానే 2’ అంటూ ఫొటోలతో పాటు ఐరా పెట్టిన క్యాప్షన్‌ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో కెల్వన్, ఉఖానే వేడుకల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

నిజానికి ఈ రెండూ మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం నిర్వహించే ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు. వీటితోనే మరాఠీ పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయి. కెల్వన్‌ వేడుకలో భాగంగా వధూవరుల కుటుంబాలు విడివిడిగా విందును ఏర్పాటుచేస్తాయి. వధువు కుటుంబం నిర్వహించే వేడుకలకు వరుడి కుటుంబం హాజరవడం, అలాగే వరుడి కుటుంబం ఏర్పాటుచేసే విందులో వధువు కుటుంబం పాల్గొనడం.. వధూవరులకు ఇష్టమైన వంటకాలు వడ్డించి.. వారికి బహుమతులు అందజేయడం ఈ వేడుకలోని ప్రత్యేకత! అలాగే పెళ్లికి రెండుమూడు రోజుల ముందు ఇరు కుటుంబాలూ వాళ్ల వాళ్ల స్నేహితులు, సన్నిహితులు, బంధువుల కోసం మరోసారి ఈ వేడుకను నిర్వహిస్తాయి. ఇరు కుటుంబాల మధ్య అనుబంధం పెంచుకోవడమే ఈ వేడుకలోని అంతరార్థం!

‘ఉఖానే’ కూడా ఇలాంటి వేడుకే. ఇందులో భాగంగా వధూవరులకు విందు ఇవ్వడంతో పాటు.. ఒకరి పేరుతో మరొకరు చిన్న పద్యం/కవితను రాసి పాడతారు. ఇలా తమ ప్రేమను తెలుపుకొంటుంటారు. తాజాగా ఐరా ఇంట్లో జరిగిన ఈ వేడుకల మాదిరిగానే ఇటీవలే నుపుర్‌ ఇంట్లోనూ ఈ రెండు వేడుకలు జరిగాయి. ఆ ఫొటోలూ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘విమర్శకులకు దూరంగా ఓ ప్రశాంతమైన ప్రదేశంలో పెళ్లి చేసుకోవాలనుంది. అది కూడా శిఖరం అంచున కానీ లేదంటే నీటి అడుగున కానీ!’ అంటూ తమ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గురించి ఇటీవలే ఓ సందర్భంలో చెప్పకనే చెప్పిందీ సెలబ్రిటీ డాటర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్