వీటిని వారానికోసారి శుభ్రం చేయాల్సిందే..!
మనం ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పటికీ కొన్ని వస్తువులను, ప్రదేశాలను మాత్రం అప్పుడప్పుడు మాత్రమే క్లీన్ చేస్తుంటాం. తద్వారా వాటిపై దుమ్ము, ధూళి చేరి మురికిగా కనిపిస్తుంటాయి. పైగా వాటి వల్ల శ్వాసకోస...
మనం ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పటికీ కొన్ని వస్తువులను, ప్రదేశాలను మాత్రం అప్పుడప్పుడు మాత్రమే క్లీన్ చేస్తుంటాం. తద్వారా వాటిపై దుమ్ము, ధూళి చేరి మురికిగా కనిపిస్తుంటాయి. పైగా వాటి వల్ల శ్వాసకోస, చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. అయితే మనం ఉపయోగించే కొన్ని రకాల వస్తువులను మాత్రం నిర్ణీత వ్యవధిలో కచ్చితంగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. మరి అవేంటో.. వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..!
⚛ రోజూ ఇంట్లో ఫ్లోర్‌ను తుడుస్తున్నప్పటికీ గోడలను అప్పుడప్పుడూ మాత్రమే శుభ్రం చేస్తుంటాం. అయితే వాటిని కనీసం వారానికోసారైనా క్లీన్ చేయాల్సిందే. లేదంటే వాటిపై దుమ్ము పేరుకుపోయి జిడ్డుగా తయారవుతాయి.
⚛ ఏ పండగలో, ప్రత్యేక సందర్భాల్లోనో తప్ప కిటికీలను శుభ్రం చేయాలనే ఆలోచనే చాలామందికి రాదు. అయితే వాటిని వారం నుంచి నెల రోజుల వ్యవధిలో కనీసం ఒకసారైనా శుభ్రం చేయడం మంచిది.
⚛ ప్రతి రెండు నుంచి మూడు వారాలకోసారి బాత్‌టబ్, షవర్‌ని కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. లేదంటే దానిపై నాచు పేరుకొనే అవకాశం ఉంటుంది. టాయిలెట్, సింక్‌లను మాత్రం వారానికోసారి కచ్చితంగా శుభ్రంగా కడగాల్సిందే..
⚛ బెడ్‌పై పరిచిన దుప్పట్లు, పిల్లో కవర్లు, బెడ్‌షీట్లు వంటి వాటిని తరచూ శుభ్రం చేస్తున్నప్పటికీ పరుపుని శుభ్రం చేయాలనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోం. ఇలా చేయడం వల్ల దాని నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టే రెండు నెలలకోసారైనా పరుపును శుభ్రం చేయడం ఉత్తమం. దీనికోసం పరుపుపై బేకింగ్ సోడాను చల్లి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.
⚛ సాధారణంగా కార్పెట్‌ని అప్పుడప్పుడూ దులిపి ఎండలో వేసి మళ్లీ ఇంట్లో పరుస్తుంటాం. అయితే ఇలా చేయడంతో పాటు కనీసం నెలకోసారైనా దాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్పెట్‌కు దుమ్ము అతుక్కొని ఉండిపోతుంది. దీనివల్ల కూడా మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నారులున్నట్లయితే కార్పెట్ శుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ప్రతి ఆరు నెలలకోసారి కార్పెట్‌ను స్టీమింగ్ చేయాల్సి ఉంటుంది.
⚛ సాధారణంగా బాత్ టవల్స్‌ని ఎన్ని రోజులకోసారి ఉతుకుతాం? మహా అయితే వారానికోసారి అంటారా..? కానీ ఇలా చేస్తే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదు. మన చర్మం పైన ఉన్న మృతకణాలు మిలియన్ల కొద్దీ టవల్‌పై చేరతాయి. వీటి కారణంగా రుమాలుపై బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా అది చర్మానికి హానికరంగా తయారవడంతో పాటు దుర్వాసన కూడా వస్తుంది. అందుకే వాటిని మూడుసార్లు ఉపయోగించిన వెంటనే ఉతికేయాల్సి ఉంటుంది.
⚛ కంప్యూటర్ కీబోర్డ్‌పై టాయిలెట్ సీట్‌లో ఉండే దానికంటే ఐదు రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుందట. అయితే వీటిని చాలామంది దుమ్ము పట్టింది అనిపించినప్పుడు మాత్రమే శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి వారానికోసారి డిస్-ఇన్ఫెక్టంట్ స్ప్రేతో కీబోర్డ్‌ను క్లీన్ చేయాలి. అలాగే మౌస్‌ని కూడా శుభ్రపరచాలి. ఆల్కహాల్‌లో దూదిని ముంచి కీబోర్డ్‌లోని కీన్ మధ్య తుడవడం ద్వారా క్రిములన్నీ నశిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.