దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

Published : 18 Jul 2021 12:48 IST

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

బ్రెస్ట్ క్రాలింగ్ అంటే..?

అప్పుడే పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాల రూపంలోనే తనకు ఆహారం దొరుకుతుందని గుర్తించగలిగే శక్తి సహజంగానే ఉంటుంది. దీంతో వారు పుట్టగానే అమ్మ రొమ్ముని అందుకొనేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు.. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే తమంతట తామే పాలు తాగుతుంటారు. ఈ ప్రక్రియనే 'బ్రెస్ట్ క్రాల్' అంటారు. అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కనిపించే ఈ లక్షణం వారి ఆరోగ్యానికి చాలా మంచిదని, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది చిన్నారులకు మాత్రమే కాదు.. తల్లులకు సైతం మేలు చేస్తుంది.

చిన్నారులకు ఎంతో మేలు..

అప్పుడే పుట్టిన చిన్నారుల్లో చాలామంది అమ్మ స్తన్యం కోసం ఆరాటపడటం మనం చూస్తుంటాం. దీనివల్ల చిన్నారులకు చాలా మేలు చేకూరుతుంది. శిశువును తల్లికి దగ్గరగా ఉంచినప్పుడు చనుమొనలను అందుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేసే క్రమంలో వారి నడుము, భుజాలు, కాళ్లు, మెడ కండరాలు దృఢంగా తయారవుతాయి. అంతేకాదు.. చక్కగా కదలడం మొదలుపెడతాయి. చనుమొనల నుంచి వచ్చే ఒకరకమైన వాసనే చిన్నారులు తమ తల్లిని గుర్తించి రొమ్ముల దగ్గరకు చేరుకొనేలా చేస్తుంది. ఈ ప్రయత్నంలో బిడ్డ విజయవంతం కాగలిగాడంటే.. అతనికి వాసనలను గుర్తుపట్టే సామర్థ్యం ఉన్నట్టు లెక్క. స్తన్యం కోసం చిన్నారులు పడే ఈ ఆరాటం కారణంగా వారిలో తల్లిని గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. ఫలితంగా తల్లీబిడ్డల మధ్య అనుబంధం దృఢమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పుట్టగానే ముర్రుపాలు తాగడం వల్ల చిన్నారిలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. తల్లి నుంచి మంచి బ్యాక్టీరియా చిన్నారి శరీరంలో ప్రవేశిస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి చిన్నారిని రక్షిస్తాయి. అలాగే పుట్టిన వెంటనే తల్లిపాలు అందడం వల్ల బిడ్డలోని మెకోనియం బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా పాపాయికి కామెర్లు రాకుండా ఉంటాయి.

తల్లికీ లాభమే..

బ్రెస్ట్ క్రాలింగ్ ద్వారా పాపాయికి మాత్రమే కాదు తల్లికి సైతం ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్రాలింగ్ వల్ల తల్లుల్లో ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావం తగ్గుముఖం పడుతుంది. తన చిన్నారి తనను గుర్తుపట్టి పాలు తాగుతోందంటే.. ఆ తల్లికి కలిగే ఆనందమే వేరు.. ఇలా అమ్మను గుర్తుపట్టి బిడ్డ పాలు తాగుతున్న సమయంలో ఆమె శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ఫలితంగా తల్లీబిడ్డల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. అంతేకాదు ఆక్సిటోసిన్.. ప్రసవం తర్వాత కొందరిలో ఏర్పడే రక్తహీనతను దూరం చేస్తుంది. అప్పటి వరకు వ్యాకోచించి ఉన్న గర్భాశయం సంకోచించడం మొదలవుతుంది. గర్భంలోని మాయ తక్కువ సమయంలో బయటకు వెళ్లిపోతుంది.

అందరిలోనూ కనిపిస్తుందా..?

బ్రెస్ట్ క్రాలింగ్ చిన్నారుల్లో సాధారణంగా కనిపించే లక్షణమే. అయితే సాధారణ ప్రసవం జరిగి తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డల్లోనూ ఇది కనిపిస్తుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలా సాధ్యం కాకపోవచ్చు. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే ఏదైనా కారణంతో తల్లి నుంచి దూరంగా ఉంచడం వల్ల చిన్నారుల్లో బ్రెస్ట్ క్రాల్ కనిపించకపోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితులు సవ్యంగా ఉన్నప్పటికీ అందరిలోనూ ఈ లక్షణం కనిపించకపోవచ్చు. పుట్టిన గంటలోపు చిన్నారిని తల్లి వద్దకు చేరిస్తే మాత్రం కచ్చితంగా బ్రెస్ట్ క్రాలింగ్‌ని గుర్తించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్