ఈ అందమైన అమ్మాయి.. నవ్వినా, ఏడ్చినా ప్రమాదమేనట!

సంతోషంగా ఉన్నప్పుడు నవ్వేస్తాం.. బాధ కలిగితే ఏడ్చేస్తాం.. చిరాగ్గా అనిపించినప్పుడు కోపగించుకుంటాం.. ఇలా విభిన్న రకాలుగా మనలోని భావోద్వేగాల్ని ప్రదర్శిస్తుంటాం.

Published : 19 Dec 2023 17:49 IST

(Photos: Instagram)

సంతోషంగా ఉన్నప్పుడు నవ్వేస్తాం.. బాధ కలిగితే ఏడ్చేస్తాం.. చిరాగ్గా అనిపించినప్పుడు కోపగించుకుంటాం.. ఇలా విభిన్న రకాలుగా మనలోని భావోద్వేగాల్ని ప్రదర్శిస్తుంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి ఫీలింగ్‌నైనా బయటికి వ్యక్తం చేయడం వల్ల మానసిక సాంత్వన చేకూరుతుంది. కానీ ఇంగ్లండ్‌కు చెందిన బెత్‌ సంగరైడ్స్‌ అనే అమ్మాయికి మాత్రం ఈ అదృష్టం లేదనే చెప్పాలి. ఎందుకంటే తాను ఎలాంటి భావోద్వేగాలనైనా ప్రదర్శించినా, ఆఖరికి దేన్నైనా వాసన చూసినా సరే.. చర్మంపై ఎర్రటి దద్దుర్లు పుట్టుకొస్తాయి. అలర్జీతో తనను బతికుండగానే కాల్చేసినంత బాధ కలుగుతుందంటోందామె. ఇలాంటి అరుదైన చర్మ సమస్యతో ఐదేళ్లుగా నరకం అనుభవిస్తోన్నా.. సానుకూల దృక్పథంతో, నిండైన ఆత్మవిశ్వాసంతో తనకున్న ఈ ప్రతికూలతల్ని అధిగమించే ప్రయత్నం చేస్తోందామె. ఈ క్రమంలోనే ఇటీవలే తన కథను సోషల్‌ మీడియాలో పంచుకోగా అది కాస్తా వైరల్‌గా మారింది.

20 ఏళ్ల బెత్‌ది ఇంగ్లండ్‌లోని డీల్‌ అనే పట్టణం. చూడ్డానికి ఫెయిర్‌గా, అందంగా ఉండే ఈ అమ్మాయి.. 15 ఏళ్ల వరకు అందరిలాగే ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండేది. తనలో కలిగిన భావోద్వేగాల్నీ అందరితో కలిసి పంచుకునేది. అయితే ఆ తర్వాత్తర్వాతే క్రమంగా తనలో ఉన్న చర్మ సమస్య బయటపడిందంటోందామె.

‘పిజ్జా ఫేస్‌’ అనేవారు!

సాధారణంగా మన శరీరానికి సరిపడని ఆహారం తీసుకున్నప్పుడు చర్మంపై దద్దుర్లు, అలర్జీ వంటివి వస్తుంటాయి. అయితే బెత్‌ పరిస్థితి ఇందుకు భిన్నం. పడని ఆహారం తీసుకోవడమే కాదు.. అతిగా నవ్వినా, ఏడ్చినా, కోపగించుకున్నా, చిరాకు పడినా.. ఇలా ఎలాంటి భావోద్వేగాల్ని ప్రదర్శించినా.. క్షణాల్లోనే చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి.. కాసేపటికే ఎరుపెక్కి కాలిపోయినట్లుగా తయారవుతుంది. అయితే కొన్ని నిమిషాలు/గంటల వ్యవధిలోనే తిరిగి సాధారణ స్థితికి చేరుకునే ఈ చర్మ సమస్యను వైద్యులు ‘అనాఫిలాక్సిస్‌’గా నిర్ధరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే అత్యంత సున్నితమైన చర్మ రియాక్షన్‌ ఇది.

‘నా పదిహేనేళ్ల వయసులో మొదటిసారిగా ముఖంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడడం గమనించాను. తొలుత ఇది టీనేజ్‌లో వచ్చే మొటిమల సమస్యేమో అనుకున్నా. కానీ  ఆ తర్వాత్తర్వాత పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. నవ్వినా, ఏడ్చినా, కోపగించుకున్నా, ఘాటైన వాసనలు పీల్చినా, ఆఖరికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నా, ఎండ పడినా, బయట గాలి తగిలినా.. చర్మంపై ఎర్రటి దద్దుర్లు వచ్చేవి.. చూడ్డానికి ఎవరైనా యాసిడ్‌ పోశారేమో అన్నంతగా చర్మంపై అక్కడక్కడా ఎర్రటి ప్యాచుల్లా ఏర్పడేవి. వీటి కారణంగా తీవ్రమైన నొప్పి, మంట వేధించేవి. వైద్యులు ఈ సమస్యను అనాఫిలాక్సిస్‌గా గుర్తించి చికిత్స అందించడం ప్రారంభించారు. ఇలా గత ఐదేళ్లుగా నేను ఇబ్బందులు పడుతుంటే.. అటు స్కూల్లో, ఇటు బయట కొంతమంది నన్ను విమర్శించేవారు. నా చర్మ సమస్యపై జోకులేసుకుంటూ నవ్వుకునేవారు. ‘పిజ్జా ఫేస్‌’, ‘టొమాటో ఫేస్‌’ అంటూ ఆటపట్టించేవారు..’ అంటూ చెబుతోంది బెత్‌.

బయట తినాల్సి వస్తే..!

ఇలా తన అరుదైన చర్మ సమస్యకు తోడు కొన్నిసార్లు నడవడం, కూర్చోవడం కూడా ఇబ్బందయ్యేదట బెత్‌కు. మరోవైపు జీర్ణాశయం, మూత్రప్రిండాలు, గుండెకు సంబంధించిన పలు సమస్యలూ ఒకదాని తర్వాత మరొకటి ఆమె చుట్టుముట్టాయట! అయినా సరైన జీవనశైలి, డాక్టర్‌ చికిత్సతో వీటన్నింటినీ అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నానంటోందామె.

‘నా చర్మ సమస్య చూసి చాలామంది నానా రకాలుగా మాట్లాడుకునేవారు. మొదట్లో వాళ్ల మాటలు పట్టించుకొని.. మేకప్‌తో అలర్జీని కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశా. కానీ అది వర్కవుట్‌ కాలేదు.. పైగా సమస్య మరింత తీవ్రమయ్యేది. అందుకే అప్పట్నుంచి నాకెంతో ఇష్టమైన మేకప్‌ను కూడా పక్కన పెట్టేశా. ఇక పాస్తా అంటే నాకు చాలా ఇష్టం. లక్కీగా ఈ పదార్థం నా ఒంటికి కూడా సరిపడింది. దీంతో పాటు ప్లెయిన్‌ చికెన్‌ నగ్గెట్స్‌.. వంటి మసాలాలు/కారం ఉపయోగించకుండా తయారుచేసినవే తీసుకుంటున్నా.. బయటికెళ్లడం, బయట తినడం పూర్తిగా మానేశా. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో తినాల్సి వచ్చినా.. నా ఆరోగ్య పరిస్థితిని అక్కడి చెఫ్‌కు వివరించి.. ప్రత్యేకంగా ఆహారం తయారుచేయించుకొని మరీ తీసుకుంటా. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు నా డైట్‌లోనూ పలు మార్పులు చేర్పులు చేసుకున్నా. ఈ అలవాట్లు నాకున్న అరుదైన చర్మ సమస్యతో పాటు ఇతర అనారోగ్యాల్నీ అదుపులో ఉంచడంలో సహకరిస్తున్నాయి..’ అంటూ తన పరిస్థితిని వివరిస్తోంది బెత్‌.

‘అనాఫిలాక్సిస్‌’పై అవగాహన!

ప్రస్తుతం బెత్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ సాషా హేతో కలిసి జీవిస్తోంది. అతడే తనను పూర్తి కేరింగ్‌గా చూసుకుంటున్నట్లు చెబుతోంది.

‘నా ఆరోగ్య పరిస్థితిని చూసి చాలామంది హేళన చేసేవారు. కొంతమంది ఇది అంటువ్యాధేమోనని మొహమ్మీదే తలుపులేసేవారు.. అలా వారి ప్రవర్తన, మాటలు నన్ను బాధపెట్టేవి. ఒక్కోసారి నా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసేవి. ఇలాంటి సమయంలోనే నా బాయ్‌ఫ్రెండ్‌ సాషా నాకు అండగా నిలిచాడు. తన మాటలు, చేతలతో నా మనసును పాజిటివిటీ వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. చేయని తప్పుకు నేనెందుకు బాధపడాలంటూ ఆపై నేనూ రియలైజ్‌ అయ్యా. అప్పట్నుంచి నా చర్మ సమస్యను సానుకూల దృక్పథంతోనే చూస్తున్నా. నాలాంటి సమస్య ఉన్న వారిలో అవగాహన పెంచేందుకు నా కథను సోషల్‌ మీడియాలో పోస్టుల రూపంలో పంచుకుంటున్నా.. వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నా..’ అంటూ స్ఫూర్తి రగిలిస్తోంది బెత్‌. ‘జీవితం విసిరే ఎలాంటి సవాలునైనా సానుకూల దృక్పథంతో ఎదిరించే ప్రయత్నం చేస్తే.. ఎంతోమందిలో స్ఫూర్తి నింపగలం’ అని నిరూపిస్తోన్న బెత్‌ కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్