ఫిట్స్‌ ఉన్న వారు గర్భం దాల్చచ్చా?!

మోహన గత కొంత కాలంగా ఫిట్స్‌/సీజర్స్‌తో బాధపడుతోంది. అయితే దీని కారణంగా పుట్టబోయే బిడ్డల్లో అవకరాలొస్తాయేమోనన్న భయంతో గర్భం దాల్చడానికే భయపడుతోందామె.భావనకు ఇప్పుడు మూడో నెల. అయితే తనకు ముందు నుంచీ ఫిట్స్‌ సమస్య ఉండడంతో ఈ సమయంలో మరిన్ని జాగ్రత్తలు.....

Published : 23 May 2022 16:30 IST

మోహన గత కొంత కాలంగా ఫిట్స్‌/సీజర్స్‌తో బాధపడుతోంది. అయితే దీని కారణంగా పుట్టబోయే బిడ్డల్లో అవకరాలొస్తాయేమోనన్న భయంతో గర్భం దాల్చడానికే భయపడుతోందామె.

భావనకు ఇప్పుడు మూడో నెల. అయితే తనకు ముందు నుంచీ ఫిట్స్‌ సమస్య ఉండడంతో ఈ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోందామె. దీనికి తోడు ఫిట్స్‌ రాకుండా మందులు కూడా వాడుతోంది. అయితే ఆ మందులు తన కడుపులోని పిండంపై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతాయోనన్న భయం ఆమెలో ఉంది.

ఫిట్స్‌/ఎపిలెప్సీ/మూర్ఛ.. పేరేదైనా మెదడు పనితీరును దెబ్బతీసే ఈ వ్యాధి మనదేశంలో ఏటా పది లక్షల మందిపై ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తలకు బలమైన గాయం తగలడం, బ్రెయిన్‌ స్ట్రోక్‌, మెదడులో ట్యూమర్‌ ఉండడం, బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌.. వంటివి ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా చెప్పచ్చు.

అయితే ఈ నాడీ సంబంధిత సమస్యతో బాధపడే చాలామంది మహిళలు గర్భం ధరించడానికి భయపడుతుంటారు. ఇందుకు కారణం.. తమ సమస్య కారణంగా తమకు పుట్టబోయే సంతానంలో ఎలాంటి లోపాలు తలెత్తుతాయోనని! అయితే ఆ భయం అక్కర్లేదని, ఈ సమస్య ఉన్నప్పటికీ గర్భిణులు డాక్టర్ల సలహాలు పాటిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యవంతులైన బిడ్డలకు జన్మనివ్వచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి, ఈ సమస్య వల్ల గర్భిణులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ క్రమంలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..

ఎపిలెప్సీ.. సీజర్స్‌ డిజార్డర్‌గా పిలిచే ఈ వ్యాధి, అందుకోసం వాడే మందులు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో హార్మోన్ల అసమతుల్యత, రుతుచక్రం అదుపు తప్పడం, ఇతర సంతాన సమస్యలతో పాటు మెనోపాజ్‌ దశలోనూ ఈ వ్యాధి ప్రభావం ఉంటుందట! అయితే ఇలాంటి సమస్య ఉన్న మహిళలు గర్భం ధరించే క్రమంలో, గర్భిణిగా ఉన్నప్పుడు డాక్టర్ల సలహా మేరకు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వచ్చని సలహా ఇస్తున్నారు.

ఎలాంటి సమస్యలొస్తాయి?

సీజర్స్‌ ఉన్న మహిళల్లో గర్భం ధరించకముందు వాటి ప్రభావం ఎలా ఉందో ప్రెగ్నెన్సీ సమయంలోనూ అలాగే ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే అది కూడా డాక్టర్ల సలహా మేరకు సరైన మందులు వాడినంత వరకే! అలాకాకుండా మందులు ఆపేయడం, నిద్రలేమి.. ఇలాంటి సందర్భాల్లో ప్రెగ్నెన్సీ సమయంలో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందట! ఇలా ఈ సమస్య కారణంగా గర్భం ధరించిన మహిళల్లో పలు దుష్ప్రభావాలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..

* పిండం హార్ట్‌ రేట్‌ తగ్గిపోవడం

* పిండానికి సరిగ్గా ఆక్సిజన్‌ అందకపోవడం

* నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం

* మూర్ఛ కారణంగా కింద పడిపోవడం వల్ల గర్భస్రావం కావడం లేదంటే గడువుకు ముందే (ప్రి-మెచ్యూర్‌) గర్భాశయం నుంచి మాయ విడిపోవడం.. వంటి సమస్యలొస్తాయి.

మందులు వేసుకోవచ్చా?!

సీజర్స్‌ ఉన్న మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా యాంటీ-సీజర్‌ మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో వాడే కొన్ని రకాల మందుల కారణంగా పుట్టబోయే పిల్లల్లో న్యూరల్‌ ట్యూబ్‌లో లోపాలు, గుండె-మూత్రాశయానికి సంబంధించి పుట్టుకతోనే వచ్చే సమస్యలు.. వంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. ఇంకా వీటి డోసు ఎక్కువైతే సమస్యలూ ఎక్కువవుతాయట! అలాగని మందులు వేసుకోకపోవడం కూడా మంచిది కాదంటున్నారు.. కాకపోతే పిండంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు మీ సమస్య తీవ్రతను బట్టి ఆ 9 నెలల పాటు సురక్షితమైన మందులేవో వైద్యులు సూచిస్తారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

* సీజర్స్‌ సమస్య కొంతమందిలో అప్పుడప్పుడూ వస్తే.. మరికొంతమందిలో తరచూ వస్తుంటుంది. ఇలా తరచూ వచ్చే వారు మాత్రం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకునే ముందే ఓసారి గైనకాలజిస్ట్‌ని, న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి మీ ఆరోగ్యస్థితిని బట్టి వారు చెప్పిన ప్రకారమే ప్లాన్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

* ఇక తరచూ సీజర్స్‌ వస్తున్నట్లయితే మందులు వాడుతూ ఆ సమస్య కాస్త కంట్రోల్‌ అయ్యాకే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడకుండా ఉంటుందట!

* వైద్యులు సూచించిన ప్రకారమే యాంటీ-సీజర్‌ మందులు వాడాల్సి ఉంటుంది. అది కూడా రోజూ కచ్చితమైన సమయానికి, కచ్చితమైన డోసు వేసుకున్నప్పుడే అవి శరీరంపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకానీ.. ఇష్టమొచ్చిన సమయానికి మందులు వేసుకోవడం, పూర్తిగా ఆపేయడం.. అస్సలు కరక్ట్‌ కాదు. ఎందుకంటే దీని ప్రభావం అంతిమంగా కడుపులో పెరుగుతోన్న బిడ్డపైనే పడుతుందట!

* సీజర్స్‌ ఉన్న గర్భిణులు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో పోషకాహారం తీసుకోవడం, ఏడెనిమిది గంటల సుఖనిద్ర, ప్రి-నాటల్‌ విటమిన్‌ మాత్రలు వాడడంతో పాటు కెఫీన్‌-ఆల్కహాల్‌.. వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

* ఫోలికామ్లం పుట్టబోయే పిల్లల్లో న్యూరల్‌ ట్యూబ్‌లో లోపాలు రాకుండా, మెదడు-వెన్నెముకలో అసాధారణ సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. అందుకే తొలి త్రైమాసికంలో గర్భిణులకు దీన్ని సూచిస్తారు వైద్యులు. అయితే కొన్ని యాంటీ-సీజర్‌ మందులు శరీరం ఫోలికామ్లాన్ని ఉపయోగించుకునే విధానంపై ప్రతికూల ప్రభావం చూపుతాయట. అందుకే గర్భం దాల్చక ముందు నుంచే కాస్త ఎక్కువ మోతాదులో ఫోలికామ్లం తీసుకోమని సూచిస్తూ దాని ప్రభావం శరీరంపై ఎలా ఉందో పరీక్షిస్తారట!

* సీజర్స్‌ ఉన్న వారు ప్రసవం సమయంలో మరింత భయపడుతుంటారు. ఈ క్రమంలో వారు సుఖ ప్రసవం కంటే సి-సెక్షన్‌కే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. అయితే సీజర్స్‌ ఉన్నా కూడా సాధారణ మహిళల్లాగే నార్మల్‌ డెలివరీవైపు మొగ్గు చూపచ్చంటున్నారు నిపుణులు. ఒకవేళ ప్రసవం జరిగే సమయంలో పదే పదే సీజర్స్‌ వస్తే మాత్రం వైద్యులే సి-సెక్షన్‌ని ఎంచుకుంటారట!

* యాంటీ-సీజర్‌ మందులు వాడుతున్నా పిల్లలకు పాలివ్వచ్చని, తల్లిపాల ద్వారా ఆ మందుల ప్రభావం పిల్లలపై పడదని పలు అధ్యయనాలు రుజువుచేస్తున్నప్పటికీ.. ఈ విషయంలో సంబంధిత నిపుణుల సలహా పాటించడమే మంచిది.

సీజర్స్‌ ఉన్న మహిళలు గర్భం ధరించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకున్నారు కదా! అయితే మీరూ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే పైన సూచించిన సలహాలు పాటిస్తూనే తరచూ చెకప్స్‌ చేయించుకోవడం, ఇతర అనారోగ్యాలేవైనా తలెత్తితే మీ సొంత మందులు కాకుండా గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలాంటి మందులు వేసుకోవాలో వారే సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్