అప్పట్నుంచి నా భర్త నన్ను దూరం పెడుతున్నాడు!

మాకు పెళ్లై రెండేళ్లవుతోంది. ఇప్పుడు నాకు నాలుగో నెల. గర్భం ధరించడం వల్ల కలయికను ఆస్వాదించలేకపోతున్నా. కానీ, అతను నన్ను అర్థం చేసుకోకుండా దూరం పెడుతున్నాడు.

Updated : 30 Dec 2023 15:54 IST

మాకు పెళ్లై రెండేళ్లవుతోంది. ఇప్పుడు నాకు నాలుగో నెల. గర్భం ధరించడం వల్ల కలయికను ఆస్వాదించలేకపోతున్నా. కానీ, అతను నన్ను అర్థం చేసుకోకుండా దూరం పెడుతున్నాడు. అది అతని చూపుల్లోనే నాకు అర్థమవుతోంది. తను అలా చూడడం నాకు నచ్చట్లేదు. దాంతో నాకున్న ఇబ్బందులను కూడా అతనికి చెప్పలేకపోతున్నా. ఇలా మా మధ్య దూరం పెరిగింది. ఒక్కోసారి తను నన్ను హెల్త్‌ చెకప్స్‌కి కూడా తీసుకెళ్లడం లేదు. ఈ సమయంలో కూడా ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే ఇంటి పనులు నిర్వర్తిస్తున్నాను. కానీ, అతని నుంచి సరైన తోడ్పాటు అందడం లేదు. దాంతో భర్త ఉండి ప్రయోజనం ఏముందనిపిస్తోంది. మేమిద్దరం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పెళ్లి తర్వాత దంపతులు తల్లిదండ్రులుగా మారడమనేది అపూర్వమైన ఘట్టం. ఇది భార్యాభర్తల అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుంది. అయితే గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కొంతమందికి చిరాకు, కోపం కూడా వస్తుంటుంది. వీటి వల్ల కూడా దంపతుల మధ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, వీటి నుంచి బయటపడడానికి ప్రయత్నించండి. గర్భధారణ సమయంలో భర్త తోడ్పాటు ఎంతో అవసరం. కాబట్టి, ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే.. మీ ఇద్దరి సమస్యల గురించి ఒకరికొకరు నేరుగా చెప్పుకున్నట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్ని బట్టి మీ మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. సాధారణంగా చాలా సమస్యలు కలిసి చర్చించుకుంటే పరిష్కారమవుతాయి. కాబట్టి, మీరు కూడా ఒకసారి మీ భర్తతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతన్నుంచి ఏం ఆశిస్తున్నారో వివరించండి. అలాగే ఈ సమయంలో భర్తగా అతను మీ దగ్గర ఉండడం ఎంత అవసరమో తెలియజేయండి. ఇలా అతని బాధ్యతలను గుర్తు చేయడం వల్ల మార్పు వస్తుందేమో గమనించండి.

కొంతమంది ఇలాంటి సమయంలో సహనం కోల్పోతుంటారు. ఫలితంగా సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి, సాధ్యమైనంత మేరకు ఓర్పుగా ఉండి పరిపక్వతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో పరిస్థితుల్ని అర్థం చేసుకొని మారేందుకు మీ భర్తకు కాస్త సమయం ఇవ్వండి. గర్భం ధరించగానే ఒక మహిళ మాతృత్వాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తుంది. కానీ, భర్త అలా కాదు. చిన్నారి పుట్టిన తర్వాతే తండ్రిగా బాధ్యతలు అతడికి అవగతమవుతాయి. కాబట్టి, అతనితో చర్చించి సమస్య పరిష్కరించుకోండి. ఒకవేళ అప్పటికీ మీ మధ్య సమస్య ఉంటే పెద్ద వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. కచ్చితంగా మీ సమస్య పరిష్కారమవుతుంది. ప్రతి మహిళ జీవితంలో గర్భధారణ అనేది ప్రత్యేకమైన సమయం. కాబట్టి ఈ సమయంలో మానసిక ఒత్తిడికి లోనుకాకుండా.. సంతోషంగా ఆస్వాదించడానికి ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్