సహోద్యోగితో సంబంధం ఉందని ఆఫీసుకొచ్చి గొడవ చేశాడు..!

నా భర్తకు అభద్రతా భావం ఎక్కువ. పెళ్లైన కొత్తలోనే నేను ధరించే దుస్తులపై ఆంక్షలు విధించేవాడు. మగవారితో మాట్లాడితే అస్సలు ఒప్పుకునే వారు కాదు. ఆఫీసు మానేసి ఇంటి దగ్గరే ఉంటూ బాబును చూసుకోమని ఒత్తిడి పెట్టాడు.

Published : 04 Aug 2023 12:35 IST

నా వయసు 35 సంవత్సరాలు. మాకు ఆరేళ్ల బాబు ఉన్నాడు. నా భర్తకు అభద్రతా భావం ఎక్కువ. పెళ్లైన కొత్తలోనే నేను ధరించే దుస్తులపై ఆంక్షలు విధించేవాడు. మగవారితో మాట్లాడితే అస్సలు ఒప్పుకునే వారు కాదు. ఆఫీసు మానేసి ఇంటి దగ్గరే ఉంటూ బాబును చూసుకోమని ఒత్తిడి పెట్టాడు. పెళ్లై ఎనిమిదేళ్లైనా అతని ప్రవర్తన అలాగే ఉంది. ఈమధ్య నేను పని చేస్తోన్న ఆఫీసుకి వచ్చి నా సహోద్యోగితో నాకు సంబంధం ఉందని పెద్ద గొడవ చేశాడు. అప్పట్నుంచి ఆఫీసుకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తోంది. ఈ విషయం గురించి నా భర్తతో చాలాసార్లు మాట్లాడాను. తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాను. అయినా ఎలాంటి మార్పు లేదు. బాబు, ఇతర విషయాల్లో బాగానే ఉంటాడు. నా భర్త ఆలోచనా విధానాన్ని మార్చాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. దంపతులకు ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. అప్పుడే వారి బంధం దృఢంగా ఉంటుంది. మీ భర్త విషయంలో అదే లోపించిందని అంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లైన మొదట్నుంచి మీపై ఆంక్షలు విధిస్తూ వచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో ఇతర విషయాల్లో అతను మంచిగానే ఉంటాడని అంటున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి అభద్రతా భావానికి లోనవ్వడానికి వివిధ కారణాలు దోహదం చేస్తుంటాయి. కొంతమంది జీవిత భాగస్వామి అలవాట్లను అపార్థం చేసుకుని అభద్రతా భావానికి లోనవుతుంటారు. మరికొంతమంది తాము పెరిగిన వాతావరణంలో ఇలాంటి పరిస్థితి ఉంటే వారు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఇంకొంతమంది సమాజంలో జరిగే వివిధ సంఘటనలను తమ జీవితానికి అన్వయించుకుని అభద్రతా భావానికి లోనవుతుంటారు. ఈ నేపథ్యంలో మీ భర్త అభద్రతా భావానికి గల అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.

ఇందుకోసం మీ భర్తతో ఒకసారి స్నేహపూర్వక వాతావరణంలో చర్చించండి. ఈ క్రమంలో మీకు ఎంతమాత్రం అతన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదన్న విషయాన్ని తెలియజేయండి. మీ మనసులో అతనికి తప్ప ఇతరులకు చోటు లేదన్న విషయాన్ని స్పష్టం చేయండి. అలాగే ఏదైనా ఇబ్బంది వస్తే మీరున్నారన్న ధైర్యం ఇవ్వండి. దానివల్ల అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మీ మాటలు/ప్రవర్తన/అలవాట్లు ఏవైనా మీకు తెలియకుండానే అతన్ని అభద్రతా భావానికి గురి చేస్తున్నాయేమో కూడా చెక్ చేసుకోండి. అప్పటికీ అతనిలో మార్పు రాకపోతే ఒకసారి మానసిక నిపుణులను సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని