వర్షాకాలంలో కంటి ఆరోగ్యానికి ఇవి పాటించండి!

ఇతర సీజన్లతో పోల్చుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. వాతావరణం చల్లబడడం, తేమ శాతం పెరగడంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ కాలంలో కేవలం సీజనల్‌ వ్యాధులే కాదు... కంటి ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Published : 19 Aug 2021 19:07 IST

ఇతర సీజన్లతో పోల్చుకుంటే వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. వాతావరణం చల్లబడడం, తేమ శాతం పెరగడంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ కాలంలో కేవలం సీజనల్‌ వ్యాధులే కాదు... కంటి ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక కరోనా నేపథ్యంలో చాలామంది చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పటికీ కంటి సంరక్షణను గాలికొదిలేస్తున్నారని చెబుతున్నారు.

వీటితో జాగ్రత్త!

కళ్ల కలక...

వర్షాకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. వైరస్‌ ద్వారా ఇది సంక్రమిస్తుంది. కళ్లు బాగా మండిపోవడం, ఎర్రబడడం, నీళ్లు కారడం దీని లక్షణాలు. ఈ ఇన్ఫెక్షన్ సోకితే సరిగ్గా చూడలేరు. పైగా ఇది గాలి ద్వారా ఇతరులకు సులభంగా సోకుతుంది. కాబట్టి వీలైనంతవరకు నల్ల కళ్లజోడు ధరించాలి. కర్చీఫ్‌లు, టవల్స్ వంటివి ఎవరివి వారివే ఉపయోగించాలి.

స్టైస్

అప్పుడప్పుడు కనురెప్ప పై భాగంలో లేదా కంటి లోపలి భాగంలో మొటిమల్లా ఎర్రటి చీము గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటినే ‘స్టైస్’ అంటారు. సరైన మందులు తీసుకుంటే రెండు రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది కానీ ఈ సమయంలో కళ్లు మూసుకుపోతాయి. బాగా నొప్పిగా ఉంటుంది. అసలు చూడలేం.

కార్నియా అల్సర్

స్టైస్‌ మాదిరిగానే కార్నియాపై చీము గడ్డలు ఏర్పడి బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమయంలో దృష్టి కూడా సరిగా ఉండదు. పై రెండింటితో పోల్చుకుంటే కార్నియా అల్సర్‌ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కార్నియా అనేది కళ్లలో అతి ముఖ్యమైన భాగం. సరైన వైద్యం తీసుకోకపోతే శాశ్వతంగా కంటిచూపును కోల్పోవాల్సి వస్తుంది.

వర్షాకాలంలో వచ్చే కొన్ని కంటి ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకున్నారుగా... మరి వీటి బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం రండి.

వ్యక్తిగత పరిశుభ్రత

వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖం తుడుచుకునేందుకు ఎల్లప్పుడూ శుభ్రమైన టవల్స్‌, న్యాప్‌కిన్స్‌, చేతిరుమాళ్లనే వాడండి. చేతులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే బ్యాక్టీరియా కళ్లలోకి ప్రవేశించి వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇక కంటి రక్షణకు ఉపయోగించే టవల్స్, గ్లాసెస్‌, కాంటాక్ట్ లెన్స్‌లను ఇతరులతో పంచుకోవద్దు.

సన్‌గ్లాసెస్

వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కళ్లను కాపాడడంలో సన్‌గ్లాసెస్‌ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు వీటిని ధరించడం ఉత్తమం.

చల్లని నీటితో శుభ్రం చేసుకోండి

ప్రతిరోజూ పరిశుభ్రమైన చల్లని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. నిద్ర లేచినప్పుడు, కాంటాక్ట్ లెన్స్‌లను తొలగించినప్పుడు చాలామంది కళ్లను గట్టిగా రుద్దుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల కార్నియా శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కళ్లను గట్టిగా రుద్దకూడదు.

కాంటాక్ట్‌ లెన్స్‌లు వద్దు!

కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడడం వల్ల కళ్లు పొడిబారతాయి. అందుకే ఇవి ఉపయోగిస్తున్న వారి కళ్లు బాగా ఎరుపెక్కి ఉంటాయి. తీవ్రమైన చికాకు కూడా వస్తుంటుంది. అందుకే వర్షాకాలంలో వీటిని వాడకపోవడమే మేలు. మరీ తప్పదనుకుంటే మాత్రం లెన్స్‌ను శుభ్రంగా తుడిచి, పొడిగా ఉండేలా చూసుకోవాలి.

పోషకాహారం

ఎలాంటి ఇన్ఫెక్షన్లైనా తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

ఇవి కూడా..!

* మురికి చేతులతో కళ్లను తాకవద్దు.

* కళ్లను ఎక్కువసార్లు రుద్దుకోవద్దు.

* ఇతరులు ఉపయోగించే మందులు, గ్లాసెస్‌, కాంటాక్ట్‌ లెన్స్‌లను వాడద్దు.

* ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు ఐ-మేకప్‌కు దూరంగా ఉండడం ఉత్తమం.

* ఎల్లప్పుడూ వాటర్‌ఫ్రూప్‌ మేకప్‌ కిట్‌ను వాడండి. అదేవిధంగా దీనిని ఇతరులతో పంచుకోవద్దు.

* గాలి, ధూళి కణాల నుంచి రక్షణ పొందేందుకు సన్‌గ్లాసెస్‌ను ధరించండి.

* ఈత కొట్టేటప్పుడు సేఫ్టీ గాగుల్స్‌ను వాడడం మర్చిపోవద్దు.

* వర్షాకాలంలో స్విమ్మింగ్‌పూల్స్‌కు దూరంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఈ సీజన్‌లో నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ.

* ఇప్పటికే కంటి ఇన్ఫెక్షన్ల బారినపడిన వారికి దూరంగా ఉండడం మేలు.

* ఎలాంటి సమస్యలు లేకున్నా ఏడాదికోసారైనా కంటి పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలి. అప్పుడే రెటీనాలోని రక్తనాళాల పరిస్థితేంటో క్షుణ్ణంగా తెలుస్తుంది. సమస్యలు తీవ్రతరం కాకుండా ముందే జాగ్రత్తపడవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్