నెచ్చెలి వివాహంలో మదిపొంగే భావాలెన్నో..!

దేవుడు తల్లిదండ్రులను, తోబుట్టువులను మనకిచ్చి కేవలం స్నేహితులను మాత్రమే ఎంచుకునే అవకాశాన్ని మనకు అందించాడు. అలాంటి స్నేహితుల్లో కొంతమంది మనకు ప్రాణంగా, ఇంట్లోవాళ్లతో సమానంగా లేదా కొన్నిసార్లు వారి కంటే ఎక్కువే అన్నట్లుగా మనసుకు దగ్గరవుతారు.

Published : 19 Nov 2021 20:53 IST

దేవుడు తల్లిదండ్రులను, తోబుట్టువులను మనకిచ్చి కేవలం స్నేహితులను మాత్రమే ఎంచుకునే అవకాశాన్ని మనకు అందించాడు. అలాంటి స్నేహితుల్లో కొంతమంది మనకు ప్రాణంగా, ఇంట్లోవాళ్లతో సమానంగా లేదా కొన్నిసార్లు వారి కంటే ఎక్కువే అన్నట్లుగా మనసుకు దగ్గరవుతారు. అలాంటి ప్రాణస్నేహితురాలికి పెళ్లి కుదిరిందంటే.. ఎంత ఆనందమో కదా..! తన పెళ్లిలో హడావిడి చేస్తూ, ఇల్లంతా హంగామా సృష్టిస్తూ, కలియదిరుగుతూ ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటారు. అయితే స్నేహితురాలి పెళ్లంటే కేవలం ఆనందం మాత్రమే కాదు.. మరెన్నో భావోద్వేగాలు మది నిండా ఉప్పొంగుతుంటాయి. మరి, తన నెచ్చెలి వివాహ సమయంలో ఓ అమ్మాయి ఏమనుకుంటుందో.. ఎలా ఫీలవుతుందో తెలుసుకుందాం రండి..

నా ఫ్రెండ్‌కి పెళ్లి కుదిరిందోచ్..

స్నేహితురాలి పుట్టినరోజంటేనే ఎంతో హడావిడి చేస్తాం. నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకొని చక్కటి గిఫ్ట్ కొంటాం. మిగిలిన స్నేహితులందరితో కలిసి ప్లాన్ చేసి మరీ సర్‌ప్రైజ్ చేస్తాం. ప్రతి సంవత్సరం వచ్చే పుట్టినరోజునే ఇంతలా సెలబ్రేట్ చేస్తే.. జీవితంలో ఒకేసారి చేసుకొనే పెళ్లి వేడుకకు ఇంకెంత హడావిడి చేయాలి.. అందుకే తమ నెచ్చెలి వివాహంలో భాగంగా పెళ్లిచూపుల నుంచే హంగామా చేయడం మొదలుపెడతారు స్నేహితులు. పెళ్లి కుదరడమే ఆలస్యం.. నా ఫ్రెండ్‌కి పెళ్లి కుదిరిందోచ్.. అంటూ తనకే పెళ్లవుతున్నట్లుగా ఆనంద పరవశంలో మునిగి తేలుతుంటారు. అప్పటి నుంచే పెళ్లి కోసం ప్లానింగ్ ప్రారంభమైపోతుంది. పెళ్లికి ఏ రంగు చీర కొనుక్కోవాలి. దానికి ఏ నగలు మ్యాచింగ్ వేసుకోవాలి.. ఏయే వేడుకల్లో ఎలాంటి దుస్తులు ధరించాలి.. వంటివన్నీ ఆలోచించి పెట్టుకుంటాం. తన పెళ్లి కోసం తనకంటే ఎక్కువ ఎక్సయిటింగ్‌గా ఫీలవుతుంటాం.

తనని బాగా చూసుకుంటాడా?

పెళ్లి కుదిరిందని తెలియగానే ఆ వచ్చే అబ్బాయి మన స్నేహితురాలిని మరింత బాగా చూసుకుంటే బాగుండు అని ప్రతి అమ్మాయి భావించడం సహజమే. కొంతమందైతే మరో అడుగు ముందుకేసి.. ఆ అబ్బాయిని స్నేహితురాలితో పాటు కలిసి ఇంటర్వ్యూ కూడా చేసేస్తారు. అలా చేసి తనకు తగినవాడనిపిస్తేనే పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు. ఇలా చేయకపోయినా.. కొన్ని ప్రశ్నలడిగి.. భవిష్యత్తును అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు బెస్ట్‌ఫ్రెండ్స్.. వారితో భవిష్యత్తు భద్రంగా ఉంటుందనుకుంటే ఆల్ హ్యాపీస్.. లేదంటే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. కేవలం స్నేహితురాలిని సరిగ్గా చూసుకోవడమే కాదు.. ఆ వచ్చే వ్యక్తి తమ స్నేహానికి అడ్డు చెప్పకూడదని చాలామంది దేవుడిని కోరుకుంటుంటారు. ఈ నేపథ్యంలో స్నేహితురాలికి కాబోయే భర్తను కూడా తమ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అబ్బాయి కాస్త అందగాడైతే బావ అంటూ వరసలు కలిపి మరీ అతడిని, ఆపై స్నేహితురాలిని ఆటపట్టిస్తుంటారు ప్రాణస్నేహితులు.

తను వెళ్లిపోతోంది..

పెళ్లయిన తర్వాత ఒకే నగరంలో ఉంటే ఫర్వాలేదు. కానీ పెళ్లయి వేరే నగరానికి లేదా దేశానికి వెళ్లాల్సి వస్తే మాత్రం స్నేహితురాలి బాధ వర్ణణాతీతం. తన ప్రాణాన్ని ఎవరో తన నుంచి తీసుకుపోతున్నట్లుగా బాధపడుతుందామె. ఒకవేళ ఒకే చోట ఉన్నా.. ఇంతకుముందులా పైజామా పార్టీలు, గర్ల్స్ నైట్‌లు, హాలిడేలు చేసుకోవడానికి వీలు కాదనే బాధ ఎలాగూ ఉంటుందనుకోండి. అయితే తను పెళ్లయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందన్న ఆనందం ముందు ఈ బాధ చాలా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతర దేశాలకు వెళ్లినా.. ఫోన్, స్కైప్ ద్వారా టచ్‌లో ఉండే స్నేహితులు ప్రస్తుతం చాలామందే ఉన్నారనుకుంటూ తమను తాము ఓదార్చుకుంటుంటారు వీరు.. స్నేహితులందరికీ పెళ్లయి వెళ్లిపోతున్నప్పుడు తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నాననే బాధ కలిగే క్షణం కూడా ఇదే.. ఇలాంటి సందర్భంలో చాలామంది తాను కూడా పెళ్లి చేసుకుంటే బాగుండు అనే నిర్ణయానికి వచ్చేస్తారు.

ఎన్నెన్నో బాధ్యతలు..

పెళ్లంటే ఎన్నో వేడుకలు.. మరెన్నో పూజలు.. ఇవన్నింటిలోనూ నా స్నేహితురాలు ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి ఫ్రెండ్ కోరుకుంటుంది. అందుకే ఆ వేడుకల్లో ఆమెను అందంగా కనిపించేలా చేసే బాధ్యతను తన భుజాలకెత్తుకుంటుంది. ఆమెతో పాటు షాపింగ్ చేయడం.. తనకు అవసరమైన ప్రతి వస్తువూ కొనేలా చూడడం.. ఇలా ప్రతి అవసరాన్నీ పూర్తి చేయడంతో పాటు.. ఆమెకు తెలియకుండా పెళ్లిలో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ప్లాన్ చేస్తుంది. బ్యాచిలరేట్ పార్టీ లాంటివి ఏర్పాటు చేసి పెళ్లికూతురిని సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇటు పెళ్లి కాబోయే స్నేహితురాలితో పాటు షాపింగ్, పెళ్లి ప్లానింగ్.. అటు ఆమెకు ఇవ్వాల్సిన సర్‌ప్రైజ్‌ల కోసం ప్లాన్ చేసుకోవడం.. ఇలా పెళ్లికి సంబంధించిన కార్యాచరణతోనే ఆమె బిజీబిజీగా గడుపుతుంది..

ఇవన్నీ పూర్తయి స్నేహితురాలు పెళ్లయి వెళ్లిపోతుంటే చిన్నపిల్లలా ఇంట్లోవాళ్ల కంటే ఎక్కువగా బాధపడుతుంది. అయితే తన వద్దకొచ్చి బాధపడుతున్న స్నేహితురాలిని ఓదార్చడంలోనూ ఆమె ముందుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్